షర్మిల తీరుపై అనుమానాలు…?

By KTV Telugu On 4 November, 2024
image

KTV TELUGU :-

రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ చేస్తుంటారు. మధ్య మధ్యలో పాదయాత్ర అంటే పాదాలపై నడిచే యాత్ర లాంటి అభాసుపాలయ్యే జోకులు వేసినా.. ఎక్కువ సమయం సీరియస్ పాలిటిక్స్ చేస్తుంటారు. తెలంగాణ నుంచి ఏపీకి మారిందే తడవుగా పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన షర్మిలా రెడ్డి… తన అన్న జగన్ రెడ్డిపై రోజుకు రెండు సార్లు తీవ్ర ఆరోపణలు చేస్తుంటారు. పైగా ఇప్పుడు ఆస్తుల వివాదంలో ఆమె వార్తల్లో తెగ నలుగుతున్నారు. తమకు రావాల్సిన ఆస్తిని, ఇవ్వాల్సిన ఆస్తిని జగన్ రెడ్డి వెనక్కి లాక్కున్నారని, దీనంతటికీ తన వదిన భారతీ రెడ్డి కారణమని కూడా షర్మిల ఆరోపణలు సంధిస్తున్నారు….

షర్మిలా రెడ్డి యాక్సిడెంటల్ పొలిటీషియన్ అని అనాల్సి ఉంటుంది. అప్పుడెప్పుడో అన్న జగన్ తరపున పాదయాత్ర చేయడం మినహా ఆమె రాజకీయాల వైపు చూడలేదు. అన్న తనను దూరం పెట్టిన తర్వాత మాత్రమే షర్మిల రాజకీయాలపై దృష్టి పెట్టి తొలుత తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు. చాలా గొప్పగా, హడావుడిగా సొంత పార్టీ పెట్టినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక ఆమె చతికిలపడిన నేపథ్యంలో కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ఇంతకాలమైనా ఆమె కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం పునరుద్ధరించలేకపోయారు.

కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావడానికి ప్రయత్నించిన సీనియర్లంతా మళ్లీ సైలెంట్ అయిపోవడానికి షర్మిల ఒంటెత్తు పోకడలే కారణమని తేల్చాల్సి ఉంటుంది. ఎవ్వరినీ లెక్కచేయకుండా, ఎవ్వరినీ పట్టించుకోకుండా, ఎవ్వరినీ దగ్గరకు రానివ్వకుండా షర్మిల అన్ని వ్యవహారాలు తనంతట తానుగా చేసేందుకు ప్రయత్నించారు. ఏపీసీసీ అంటే తానొక్కరే అన్నట్లుగా వ్యవహరించారు. ఎవ్వరినీ కలుపుకుపోకుండా ఇష్టానుసారం వ్యవహరించారు. దానితో పార్టీ నిర్వీర్యమైపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఒక ఎంపీగానీ, ఒక ఎమ్మెల్యే సీటు గానీ గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. 2024లో సైతం జీరో స్థానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకున్న కారణంగా షర్మిల వల్ల కలిగిన ప్రయోజనమేంటన్న ప్రశ్నలు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. తన కుటుంబ కక్షలు తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకున్నారన్న ఫీలింగ్ కాంగ్రెస్ వర్గాల్లో కలుగుతోంది…

ఇప్పుడు కూడా పార్టీ పరంగా ఎలాంటి పనులు చేయకుండా జగన్ రెడ్డిపై విరుచుకుపడేందుకే షర్మిల 24 గంటల సమయం కేటాయిస్తున్నారన్న ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. పైగా విపక్షంలో ఉన్న జగన్ ను ఎక్కువగా తిట్టడం, అధికారంలో ఉన్న చంద్రబాబును మొక్కుబడిగా విమర్శించడంపై కూడా కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. అసలు తిట్టాల్సింది చంద్రబాబును అయినప్పుడు ఆయనపై ఎక్కువ విమర్శలు ఎందుకు చేయడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల ఉండటం వల్ల పార్టీకి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటోందన్న ఒక ఆలోచన కూడా సగటు కాంగ్రెస్ వాదుల్లో వినిపిస్తోంది. గుట్టుచప్పుకు కాకుండా కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా కూడా చెబుతున్నారు. మరి త్వరలో ఏం జరుగుతుందో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి