జబర్దస్త్ ఫైట్

By KTV Telugu On 15 February, 2024
image

KTV TELUGU :-

నువ్వు ఒకటంటే నేను రెండు అంటాను.  తమలపాకులో నువ్వొకటంటే..తలుపు చెక్కతో నేనొకటి అంటాను. నువ్వు తిట్టినదానికంటే  ఫోర్స్ గా నేను తిడతాను. మా పార్టీ జోలికి  వస్తే ఎంతైనా మాట్లాడతాను. ఇవీ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కనిపిస్తున్న పరిణామాలు.

వైసీపీ వర్సెస్  కాంగ్రెస్.. ఈ మాట అనే కంటే షర్మిల వర్సెస్ రోజా అని అంటేనే బెటరేమో. షర్మిలను సీఎం జగన్ ఏమీ అనడం లేదు.  విపక్షాలు… తమ కుటుంబంలో కూడా చిచ్చుపెట్టాయని అన్నారే తప్ప.. షర్మిల కాంగ్రెస్ లో చేరడంపైనా, ఆమె తీరుపైనా ఆయన ఇంకా విమర్శలు మొదలు పెట్టలేదు. వైసీపీ నేతలు మాత్రం విమర్శలను అప్పుడే పీక్ పాయింట్ కు తీసుకెళ్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. రోజా అయితే ఒంటి కాలి మీద లేస్తున్నారు. దీనితో యుద్ధం మొదలైందనే చెప్పాలి. పైగా ఎన్నికల వేళ ఇద్దరు మహిళల మధ్య వివాదంగా కూడా మారే అవకాశం ఉన్నదని చెప్పక తప్పదు. రోజా  మొదలెట్టారో, షర్మిల మొదలెట్టారో.. ఆ మాట ప్రస్తుతం అప్రస్తుతమైనప్పటికీ ఆరోపణల పర్వం మాత్రం రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల దాన్ని గాలికొదిలేసి ఆంధ్రప్రదేశ్లోకి  ఎంట్రీ ఇచ్చారని రోజా ఎద్దేవా చేశారు. ఇప్పుడు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విచ్ఛిన్నం చేసేందుకు ఆమె వచ్చారని రోజా నిలదీసే ప్రయత్నం చేశారు….

షర్మిల ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్న ఫీలింగులో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సోదరుడైనప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టడం లేదు. నాలుగు  మాటలు ఎక్కువే అంటున్నారు. దానితో రోజా లాంటి వాళ్లు కౌంటర్ అటాక్ ఇచ్చే క్రమంలో కాస్త గీత దాటుతున్నారు. కొంచెం పర్సనల్ అటాక్ కూడా జరుగుతోందని చెప్పక తప్పదు…

షర్మిలదీ కొత్త అవతారమని రోజా అనడం మామూలు ఆరోపణ కాదనే  చెప్పాలి. దానితో షర్మిల కూడా బ్యాటింగ్ మొదలు పెట్టేశారు. రోజా నగరిలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నగరిలో ఏ పని చేయాలన్న మంత్రి రోజాకు కమీషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. దోపిడీని కూడా జబర్దస్త్ గా చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. రాత్రికి రాత్రే కొండలు మాయమవుతున్నాయని, గ్రావెల్‌, మట్టి, ఇసుక, ఆఖరికి చిన్నచిన్న ఉద్యోగాల్లో సిఫారసులకు కమీషన్లు, హౌసింగ్‌ స్కీంలో కోట్ల స్కాం, వెంచర్లు వేయాలంటే రియల్టర్ల నుంచి కప్పం, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి నెలవారీ ముడుపులు…. అంటూ మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు చేశారు. తనపై పిచ్చివాగుడు వాగితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మంత్రులకు పట్టిన గతే రోజాకు కూడా పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. దీనికి రోజా కూడా ధీటైన కౌంటర్ ఇచ్చారు. నిజమైన రాజన్న బిడ్డ సీఎం జగన్ మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కేవలం వైఎస్ ఆస్తుల కోసమే రోడ్డు ఎక్కారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అని సెటైర్లు వేశారు.

ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఫైట్ తీవ్రతరం  కావడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త కొత్త ఆరోపణలు తెరమీదకు వస్తాయి.  ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటారు. జగన్ దగ్గర తన పరపతిని పెంచుకునేందుకు రోజా ప్రయత్నిస్తూ.. షర్మిలపై ఆరోపణలు చేస్తారు. మరి తెలుగు ప్రజలు వాటిని సీరియస్ గా తీసుకుంటారా. వినోదంగా భావిస్తారా..చెప్పలేం..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి