పొత్తులతో టీడీపీకి కొత్త సమస్యలు వస్తున్నాయి. పాత వాళ్లు వర్సెస్ కొత్త వాళ్లు అన్నట్లుగా అంతర్గత పోరు తారాస్థాయికి చేరే ప్రమాదమూ ఏర్పడింది. చాలా నియోజకవర్గాల్లో ఈ సమస్య కనిపిస్తోంది. తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లా మైలవరంలో ఇటువంటి పరిస్తితే తప్పడం లేదు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను వైసీపీ అధిష్టానం చెప్పపెట్టకుండా వెళ్లగొట్టింది. ఆయన నియోజకవర్గంలో కొత్త ఇంచార్జీని పెట్టి పొమ్మనకుండానే పొగ పెట్టేసింది. అప్పటికే వసంత పక్క చూపులు చూస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్. అమరావతి సహా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసగించినందునే తాను బయటకు వెళ్లాలనుకున్నానని వసంత చెప్పుకొచ్చారు. వైసీపీని వదిలిన వసంత ఇప్పుడు కొత్త గూటి కోసం వెదుకుతున్నారు. ఆయన టీడీపీ లేదా జనసేన వైపుకు వస్తారని టాక్ నడుస్తోంది.ఇప్పుడదే టీడీపీలో కొత్త సంఘర్షణకు దారితీస్తోంది. మైలవరంపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పట్టు వీడేందుకు సిద్ధంగా లేరు. తాను మైలవరం నుంచే పోటీ చేస్తానని ఈ నెల రెండో వారంలో అన్నేరావు పేట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని కూడా ఆయన ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవినేని ఉమ… ప్రస్తుతం మీటింగ్ విత్ లీడర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జనంలో ఉంటున్నారు. కేశినేని నాని, వసంత కృష్ణప్రసాద్, సుజనా చౌదరి తలా ఒక పార్టీలో ఉంటూ, అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ, ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ల పనులు చేయించుకుంటున్నారన్నారు. తాను మాత్రం పసుపు కండువా కప్పుకొని చచ్చిపోతానే తప్ప, పార్టీ మారే ప్రసక్తే లేదని, అధినేత చంద్రబాబు, కార్యకర్తల మాటే తనకు శిరోధార్యమని స్పష్టం చేస్తున్నారు. ఆయన పరోక్షంగా వసంత కృష్ణప్రసాద్ పై అటాక్ చేస్తున్నారు..
టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్, తిరుపతి, తెనాలి, విజయవాడ వెస్ట్, మైలవరం లాంటి నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తారని చెబుతున్నారు. ఇదీ ఒక కోణం . వైసీపీ నుంచి తంబలుతంబలుగా వస్తున్న వారిని ప్రోత్సహిస్తూ మొదటి నుంచి టీడీపీలో ఉంటున్న వారికి అన్యాయం చేయబోతున్నారన్న ఆరోపణలు మరో కోణం. వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం కూడా అలాంటిదే.ఆయనకు అవకాశం ఇవ్వాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించుకున్నారట..
ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి సవాలక్ష సమస్యలు తప్పేలా లేవు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమ,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి నేతలు ఇప్పుడు సీటు త్యాగం చేసే పరిస్థితిలోకి నెట్టబడవచ్చు. ఇదీ వారిని ఏ మాత్రం మింగుడుపడని అంశం.ప్రతిపక్షంలో ఉన్నంత కాలం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తే ఇప్పుడేమిటి ఇలా దెబ్బకొడుతున్నారని కొందరు నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అలాంటి సంఘర్షణ ఉన్న నియోజకవర్గాల్లో మైలవరం కూడా ఒకటని చెప్పాలి. ఆ నియోజకవర్గంలో చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శించాలనుకున్నారు. తమ సామాజికవర్గానికే చెందిన వసంత కృష్ణప్రసాద్ ను నేరుగా పార్టీలో చేర్చుకోకుండా జనసేనలో చేర్చించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.వసంత కృష్ణ ప్రసాద్ కు పవన్ కల్యాణి టికెట్ ఇచ్చేట్లుగా మాట్లాడుకుని మైలవరాన్ని జనసేనకు కేటాయించాలనుకున్నారు.దానితో మైలవరం నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న దేవినేని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. 2009…2014లో వరుసగా రెండు సార్లు దేవినేని మైలవరానికి ప్రాతినిధ్యం వహించారు. నీటి పారుదల శాఖామంత్రిగా పనిచేశారు. 2019లో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పై పోటీ చేసి 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి దేవినేని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వైసీపీ శ్రేణులు ఆయన్ను నియోజకవర్గంలోకి రానివ్వకుండా అడ్డుకున్న సందర్భాలున్నాయి. ఓసారి మైనింగ్ విషయంలో ప్రశ్నించేందుకు వెళితే.. ఆయనపై దాదాపుగా హత్యాయత్నం జరిగింది. వైసీపీ ప్రభుత్వమూ, స్థానిక ఎమ్మెల్యే వల్ల మైలవరం టీడీపీ కేడర్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఇప్పుడు వసంతను తీసుకొచ్చి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎలా పోటీ చేస్తారన్నది వారు వేస్తున్న ప్రధాన ప్రశ్న.
తాజా పరిణామాలతో వసంత తీవ్ర ఆగ్రహం చెందుతున్న మాట వాస్తవం. డైరెక్టుగా చంద్రబాబును నిలదీయలేకపోయినా ఆయన లోలోన మథనపడుతున్న మాట నిజం. టీడీపీ పట్ల రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్న వసంతకు టికెట్ ఎలా ఇప్పిస్తారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. పైగా ఇంతకాలం ల్యాండ్, శాండ్, మైనింగ్ స్కామ్ లో వసంతను నిలదీసిన నోటితోనే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎలా ప్రోత్సహించాలన్నది టీడీపీ కేడర్ వేసుకుంటున్న ప్రశ్న.ఎన్నికల నాటికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…