లూథ్రా ట్వీట్ అర్ధం అదేనా?

By KTV Telugu On 15 September, 2023
image

KTV TELUGU :-

నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చాలా కాలం ఉండబోతున్నారా? ఆయనకు కనుచూపు మేరలో బెయిల్ వచ్చే అవకాశాలు లేనే లేవా? న్యాయ వ్యవస్థలపై  ఏ రాజకీయ నాయకుడికీ లేనంతటి అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో తనని తాను ఒడ్డుకు చేర్చుకోలేకపోతున్నారా? చిన్న పాము నైనా పెద్ద కర్రతో కొట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు   తన తరపున దేశంలోనే నంబర్ వన్  అడ్వొకేట్ గా  వెలుగొందుతోన్న  సిద్ధార్ధ లూథ్రాను  నియమించుకున్నా లాభం లేకపోయిందా? ఇపుడీ ప్రశ్నలే  రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చినపుడు   కోర్టులో సగానికి పైగా న్యాయవాదులు చంద్రబాబు నాయుడి తరపున వాదించడానికి వచ్చిన వారే. వారందరికీ సిద్దార్ధ లూథ్రా నాయకత్వం వహించారు. లూథ్రా వంటి దిగ్గజ  న్యాయవాది వచ్చారంటే  ఏపీ సిఐడీ వాదనలు కోర్టులో నిలబడతాయా అసలు? అన్న అనుమానం అందరిలోనూ వచ్చింది. సిఐడీ తరపున ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి  గట్టిగా వాదనలు వినిపించారు.  ఆయన ధాటికి లూథ్రా అంతటి న్యాయవాదికే ముచ్చెమటలు పట్టాయంటున్నారు  అక్కడి వ్యవహారాలను నిశితంగా గమనించిన  న్యాయవాదులు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ చంద్రబాబు నాయుణ్ని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడంలో ఏపీ సిఐడి పకడ్బందీగా సాక్ష్యాధారాలు పొందు పర్చడం ఒక ఎత్తయితే .. పొన్నవోలు మొక్కవోని దీక్షతో చేసిన వాదనలు మరో ఎత్తు అంటున్నారు నిపుణులు.

జ్యుడీషియల్ రిమాండ్ విధించినా  ఒక్కరోజులోనే   చంద్రబాబు నాయుణ్ని విడుదల చేయించగల సత్తా లూథ్రాకు ఉందని అంతా అనుకున్నారు. బహుశా ఏపీ సిఐడీ  అధికారులు కూడా అలానే అనుకుని ఉండచ్చేమో. కానీ  లూథ్రా ఎన్ని రకాలుగా  తన వాదనలు వినిపించినా.. ఎన్ని  మడత పేచీలు పెట్టినా.. న్యాయమూర్తికి ఎన్ని సవాళ్లు విసిరినా లాభం లేకపోయింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంతో పాటు  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అవినీతి కేసులోనూ విచారణకు ఏపీ సిఐడీ  పీటీ వారంట్ ఇచ్చింది. దాని తర్వాత మరో మూడు కేసుల విచారణ కూడా మొదలు  కానున్నట్లు చెబుతున్నారు.

తన న్యాయవాద వృత్తిలోనే  బహుశా  ఇంతలా ఎదురు దెబ్బలు తిని ఉండని  లూథ్రా  ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే కావచ్చు  తాజాగా చేసిన ఒక ట్వీట్ ఇపుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. గురు గోవింద్ సింగ్ చరిత్రలో ఔరంగ జేబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యనే   ఒకరు ట్వీట్ చేయగా దాన్ని లూథ్రా షేర్ చేశారు. ” న్యాయం కోసం  చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా కనుచూపు మేరలో న్యాయం కనపడ్డం లేదంటే.. ఇక కత్తి అందుకోవడమే సరియైనది.. యుద్ధానికి ముందుకు ఉరకడమే సరియైంది” అన్నదే  గురుగోవిండ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు.

న్యాయం కనుచూపు మేరలో కూడా కనపడ్డం లేదంటే  ఏంటి అర్ధం. లూథ్రా  చంద్రబాబు నాయుణ్ని  జైలు నుండి విడుదల చేయించడానికి  విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  కోట్లాది రూపాయల ఫీజు తీసుకుంటారు కాబట్టి అది ఆయన బాధ్యత కూడా. ఏసీబీ కోర్టులో  చంద్రబాబు  బెయిల్ కోసం  పిటిషన్ వేయని లూథ్రా  హై కోర్టులో  స్క్వాష్ పిటిషన్ పై విచారణను న్యాయమూర్తి వాయిదా వేసిన వెంటనే  నీరుగారిపోయారా? అని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. బహుశా హై కోర్టులో సైతం చంద్రబాబు నాయుడికి  దరిదాపుల్లో బెయిల్ వచ్చే  అవకాశాలు లేవన్న భావన లూథ్రాకు వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడీ  పోలీసులు ఆయనపై 409 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 409 చంద్రబాబుకు వర్తించదని లూథ్రా వాదించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దాన్ని తిరస్కరించి 409 బాబుకు వర్తిస్తుందని తేల్చి చెప్పారు. 409  వర్తిస్తుందంటే దానర్ధం అది నాన్ బెయిలబుల్ కేసు.  కింది కోర్టులో  న్యాయమూర్తి 409ని అనుమతిస్తే హైకోర్టులోనూ దానికి అనుగుణంగానే తీర్పు వచ్చే అవకాశాలు ఉండచ్చని న్యాయరంగ నిపుణులు అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే  లూథ్రా నిర్వేదానికి గురై ఉండచ్చంటున్నారు నిపుణులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి