ఒక పార్టీలో అందరూ ఉండాలని కోరుకుంటారు. అధికార పార్టీలో అయితే కాస్త సంపాదన కోసం కూడా సర్దుకుపోతారు. ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఉండే వారి కంటే వెళ్లిపోయే వారే ఎక్కువగా ఉన్నారు. నెల్లూరు వైసీపీలో అంతకు మించి కథ నడుస్తోంది. కొందరు వెళ్లిపోతే బావుండునని ఉన్న వాళ్లు ఎదురు చూస్తున్నారు. అందులో వాళ్ల స్వార్థం కూడా ఉంది. అలా ఎందుకు జరుగుతుందో ఓ సారి చూద్దాం…
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .. అలియాస్ వీపీఆర్ పెద్దదిక్కు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల గెలుపు కోసం కీలకంగా వ్యవహారించారు. ఒక దశలో జగన్, విజయసాయిరెడ్డిని దూరం పెట్టి, నెంబర్ టూ స్థానాన్ని వీపీఆర్ కి అప్పగించారు. అయితే వీపీఆర్ మృదుస్వభావి కావడం, కొన్ని వ్యవహారాలు నచ్చకపోవడంతో ఆ పదవులు, హోదాలకి దూరంగా ఉంటూ వచ్చారు. అతికష్టం మీద జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని చెబుతారు. ఇటీవల వీపీఆర్ పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. దాంతో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో ఒక్కసారిగా ఆనందం పెళ్లుబికింది. జగన్ తో భేటీ తరువాత వీపీఆర్ మెత్తబడ్డారు.వచ్చే ఎన్నికల్లో లోక్ సభ స్థానం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు డీలా పడిపోయారు. చాలా మంది ఎమ్మెల్యేల్లో విభేదాలు, గుర్తింపు లేకపోవడం, నిధులు ఇవ్వకపోవడం వంటి అనేక కారణాలతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంతా టీడీపీలోకి వెళ్లేందుకు మార్గాలు వెదుకుతున్నారు. ఆ క్రమంలో వీపీఆర్ వెంట వెళ్లొచ్చని, రాబోయే రోజుల్లో ఆయనే పెద్ద దిక్కుగా ఉంటారని భావించారు. వీపీఆర్ ప్రకటన, వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. వారంతా ఇప్పుడు టీడీపీలోకి వెళ్లేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.
నెల్లూరులో అంతా రెడ్డి రాజులే.. ఏ పార్టీ అధికారంలో ఉన్న సింహపురిలో రెడ్లదే ప్రాధాన్యం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.నెల్లూరు రెడ్లు గౌరవ మర్యాదలు ఆశిస్తారు. అలా జరగని పక్షంలో వారికి చాలా కోపం వస్తుంది. వైసీపీలో ఇప్పుడు అదే జరుగుతోంది. జగన్ తీరుపై నెల్లూరు పెద్దా రెడ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక్క ఛాన్సిస్తే వెళ్లి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పైగా సీఎం వారి ముందు పెడుతున్న డిమాండ్లు సహేతుకంగా లేవు..
పెద్దారెడ్ల పరిస్థితి ఇప్పుడు ఆగమ్యగోచరంగా ఉంది. జగన్ పాలనలో తమకు బానిస బతుకులే మిగిలాయని వాళ్లు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రావడం, రెండు గంటల పాటు సుధీర్ఘ చర్చలు సాగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ మరుసటి రోజే సీఎం జగన్ ని కలిసేందుకు మాగుంట ప్రయత్నించారు. 180 కోట్లు జమ చేయాలని, చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని జగన్ ఇచ్చిన ఆదేశాలను మాగుంట ఖాతరు చేయకపోవడంతో సీఎం ఆయన్ను పక్కన పెట్టేశారు. దానితో మాగుంటకు తాడేపల్లి ప్యాలెస్ అప్పాయింట్ మెంట్ దొరకలేదు. ఆదాలకు కూడా మాగుంట టైప్ ఆదేశాలే అందాయి. ఇప్పటి వరకు గౌరవప్రదమైన రాజకీయాలు చేసిన తాను ఇప్పుడు రూటు మార్చే ప్రసక్తే లేదని ఆదాల తేల్చేశారు. వాళ్లిద్దరూ టీడీపీలోకి వెళ్లిన పక్షంలో నెల్లూరు లోక్ సభా స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది పెద్ద ప్రశ్న. మాగుంట టీడీపీలోకి వెళితే.. నెల్లూరు నెల్లూరు లోకసభ స్థానం నుంచి ఆయన కుమారుడు రాఘవరెడ్డిని టీడీపీ తరపున బరిలోకి దించుతారనే చర్చ సాగుతుంది. వైసీపీ నుంచి వీపీఆర్ పోటీకి దిగితే మాత్రం నిర్ణయాలు మారొచ్చనే చర్చా నడుస్తుంది.
నెల్లూరు పెద్దా రెడ్లు ఎటువైపు ఉంటే అధికారం అటువైపు ఉంటుందని దశాబ్దాల పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. అయితే అధికారం ఎటు ఉంటే పెద్దారెడ్లు అటు వైపు ఉంటారని కూడా వ్యతిరేకవర్గం వాదిస్తుంది. ఏదేమైనా ఈ సారి నెల్లూరు రాజకీయాల్లో సమూల మార్పులు ఖాయమని తేలిపోయింది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…