బిజెపికి గుడ్ బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ ఎందుకని ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు పై అంతగా మండిపోతున్నారు. సోము వీర్రాజు వల్లే పార్టీ సర్వనాశనమైపోతుందని తీవ్రమైన వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు సోము వీర్రాజుకూ కన్నాకూ నిజానికి బిజెపిలో అంత భయంకరమైన శత్రుత్వం కూడా ఏమీ లేదు. అయినా సోమును కన్నా టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. రాజకీయ అవసరాలను బట్టి సమీకరణలను బట్టి ఓ పార్టీ నుండి మరో పార్టీకి జంప్ చేయడం మామూలు విషయమే. చాలా మంది తమకు రాజకీయంగా ఫ్యూచర్ ఉంటుందనుకున్న పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడంలో తప్పుకూడా లేదు. అయితే ఓ పార్టీనుండి వెళ్లేటపుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇచ్చే సమయంలోనే నేతలు చిత్ర విచిత్రంగా వ్యాఖ్యానాలు చేస్తారు.
తాజాగా బిజెపి నుండి టిడిపిలోకి జంప్ చేస్తోన్న కన్నాలక్ష్మీనారాయణ కూడా అదే చేశారు. 2019లో భారతీయ జనతా పార్టీలో చేరిన కన్నాలక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత పార్టీలో మారిన సమీకరణలు పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న పార్టీ హైకమాండ్ కన్నాను అధ్యక్ష పీఠం నుండి తప్పించి ఆయన స్థానంలో సోము వీర్రాజును నియమించింది. ఇందులో సోము వీర్రాజు తప్పేమీ లేదు. ఆయన కన్నాను పదవి నుండి తప్పించాలని కోరుకోనూ లేదు తనంతగా ప్రయత్నించనూ లేదు. కన్నాను తప్పించిన నాయకత్వం తనకు పదవి ఇచ్చేసరికి సహజంగానే ఆనందంగా స్వీకరించారు. ఆ పదవికి ఆయన అన్ని విధాలా అర్హుడు కూడా. ఎందుకంటే ఆరెస్సెస్ భావజాలంతో పెరిగిన సోము వీర్రాజు మొదటి నుండి బిజెపి సిద్ధాంతాలకు లోబడే రాజకీయాలు చేశారు. బిజెపిలో మొదట్నుంచీ ఉన్నారు కూడా. అయితే ఏ నాడూ తనకు పదవి కావాలని ఆయన ఎవరినీ అడగనూ లేదు పైరవీలు చేసుకోలేదు. ఆయన వాగ్దాటి అన్ని అంశాలపై ఆయనకున్న అవగాహనలను ఆధారం చేసుకునే పార్టీ నాయకత్వం ఆయన్ను ప్రమోట్ చేస్తూ వచ్చింది.
తన నుండి అధ్యక్ష పదవిని దక్కించుకున్న సోము వీర్రాజుపై కన్నాకు కూడా అంతకక్ష ఏమీ లేదంటున్నారు ఆయన గురించి తెలిసిన వారు. అటువంటప్పుడు పార్టీ మారాలని డిసైడ్ అయినపుడు వెళ్లేదేదో హుందాగా పోతే బాగుండేది కదా అంటున్నారు సోము వీర్రాజు వర్గీయులు. కన్నా సోము వీర్రాజును బజారుకీడ్చడానికి కారణం వేరే ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఎప్పుడైతే బిజెపి నుండి టిడిపిలో చేరాలని కన్నా డిసైడ్ అయ్యారో చంద్రబాబుతో ఎప్పుడైతే డీల్ ఓకే చేసుకున్నారో అప్పుడే కన్నాకు ఓ షరతు విధించారట చంద్రబాబు నాయుడు. వచ్చేటపుడు సోము వీర్రాజు ప్రతిష్ఠ మంటగలిపి రావాలని సూచించారట. దానికి ఒప్పుకున్న తర్వాతనే కన్నాకు టిడిపిలో ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట చంద్రబాబు. అందుకే బిజెపికి రాజీనామా చేసిన వెంటనే కన్నా సోము కారణంగానే తాను పార్టీ వీడాల్సి వస్తోందని తనలాగే చాలా మంది బిజెపికి గుడ్ బై చెప్పడానికి సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తద్వారా బిజెపి నాయకత్వం దృష్టిలో సోమును విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
మరి సోము వీర్రాజు అంటే చంద్రబాబుకు ఎందుకు కోపం ఎందుకంత శత్రుత్వం ఏంటి అసలు ఆంతర్యం అని ఆరా తీస్తే ఓ విషయం బయటపడింది. ఏపీ బిజెపిలో చంద్రబాబు నాయుణ్నీ టిడిపిని మొదట్నుంచీ వ్యతిరేకించే కొద్ది మంది నేతల్లో సోము వీర్రాజు కూడా ముఖ్యులు. 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై సోము వీర్రాజు చేసినన్ని విమర్శలను నాటి ప్రధాన ప్రతిపక్షమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కూడా చేసి ఉండదు. చంద్రబాబు పై అంతలా విరుచుకు పడేవారు సోము వీర్రాజు. బాబు హయాంలో అవినీతిపై రోజుకో ప్రెస్ మీట్ పెట్టి ఏకి పారేశారు. 2019 ఎన్నికల తర్వాత టిడిపి ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. ఆ ఎన్నికలకు ఏడాది ముందు బిజెపి తో కటీఫ్ చెప్పిన చంద్రబాబు ఎన్నికల తర్వాత మళ్లీ దగ్గరయ్యేందుకు చేసే ప్రయత్నాలకు సోము వీర్రాజే మోకాలడ్డుతూ వచ్చారట. టిడిపితో పొత్తు ప్రస్తావన వస్తే చాలు ఆ పార్టీ వల్లనే బిజెపి నష్టపోయిందని అటువంటి టిడిపితో పొత్తు వద్దే వద్దని సోము వీర్రాజు పార్టీ అధిష్ఠానానికి చాలా సార్లు చెప్పుకొచ్చారట.
బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేనను అడ్డు పెట్టుకుని బిజెపితో పొత్తు కుదుర్చుకోవాలని చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అయితే టిడిపితో పొత్తు అనగానే నరేంద్ర మోదీ కూడా మొహం చిట్లించేశారని అంటారు. తనతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ తోనే నరేంద్ర మోదీ ముందు నువ్వు ఆ చంద్రబాబు తో అంటకాగడం మానేయ్ బాగుపడతావు అని వారించారని అంటారు. టిడిపితో పొత్తు పెట్టుకుందాం సార్ అని పవన్ అనగానే మనం కలిసే పోటీ చేద్దాం కానీ టిడిపిని మాత్రం పిల్లిలా చంకలో పెట్టుకోవద్దు అన్నారట మోదీ. మోదీ ఇంతలా టిడిపిని వ్యతిరేకించడానికి సోము వీర్రాజు పార్టీ అధిష్ఠానానికి నూరిపోసిన విషయాలే కారణమని చంద్రబాబు కూడా నమ్ముతున్నారు. అందుకే సోము వీర్రాజు పేరు చెబితేనే చంద్రబాబు నాయుడు ఒంటికాలిపై లేచి నిలబడుతున్నారు. సోము వీర్రాజును రాజకీయంగా దెబ్బతీయాలని కసిగా ఉన్న చంద్రబాబు నాయుడు ముందుగా బిజెపిలో సోము ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని నిశ్చయంతో ఉన్నారట.
ఆ నేపథ్యంలోనే బిజెపి కి రాజీనామా చేసిన కన్నా టిడిపి వైపు ఓ చూపు చూడగానే చంద్రబాబు కన్నాకు కన్నుగీటి సోము వీర్రాజు పై కన్నానే ఆయుధంగా మలుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ తన రాజకీయ జీవితంలో ఏనాడూ కూడా ఏ రాజకీయ నేతపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. మొదటి సారి ఆయన సోము వీర్రాజుపై విరుచుకు పడ్డారు. బద్ధశత్రువులా సోము గాలి తీసే ప్రయత్నం చేశారు. కన్నా తనపై వ్యాఖ్యల చేసిన వెంటనే సోము వీర్రాజు కూడా ఆశ్చర్యపోయారనే అంటున్నారు. ఎందుకోసం కన్నా తనపై కక్షగట్టారో కూడా వీర్రాజుకు అర్ధం కాలేదని అంటున్నారు. అయితే కాస్త ఆలస్యంగా అయినా సోముకు దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడని తెలిసిందట. దీంతో ఆయన చంద్రబాబుపై మరింత మంటగా ఉన్నారని అంటున్నారు.
ఒక్క సోము వీర్రాజు పైనే కాదు పార్టీ మారిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనా కన్నా తీవ్రమైన విమర్శలు చేశారు. ఆవిమర్శలు విన్నవారికి అవి అంతకు ముందు ఎక్కడో విన్నట్లు అనిపించాయి. అవి ఎక్కడా అని ఆరా తీస్తే చంద్రబాబు నాయుడు అండ్ కో తరచుగా చేసే విమర్శలనే కన్నా చేత అనిపించారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. తన రాజకీయ శత్రువులను ఏదో ఒక రూపంలో సాధించడం అనేది చంద్రబాబు నాయుడికి విద్యార్ధి దశ రాజకీయాల నుండే అలవాటని చిత్తూరు జిల్లావాసులు అంటారు. మును ముందు కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజు గురించి, జగన్ మోహన్ రెడ్డి గురించి ఇంకెన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.