ఏపీ కమలంలో కన్నా మంటలు.. వీర్రాజు పదవికి ఎసరు

By KTV Telugu On 25 February, 2023
image

కన్నా లక్ష్మీనారాయణ దర్జాగా సైకిల్ ఎక్కేశారు. భారీ అనుచరగణంతో వెళ్లి బాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. అయితే వెళ్లేముందు ఓ ఫినిషింగ్ టచ్ ఇచ్చి వెళ్లారు చూశారూ అది కమలం పార్టీలో రచ్చకు దారితీస్తోంది. వీర్రాజుతో వేగలేకనే పార్టీని వీడానని చెప్పిన కన్నా బీజేపీకి చెందిన చాలా మంది నేతలు టచ్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. అయితే కన్నా పార్టీని వీడుతున్నా మరికొందరిని పట్టుకుపోతానని చెబుతున్నా ఎక్కడా కాషాయదళం పల్లెత్తు మాట అనడం లేదు. మౌనం పాటిస్తోంది.

కానీ రాష్ట్ర నాయకులు కొందరు పార్టీలో రచ్చకు వీర్రాజును బాధ్యుడిని చేస్తూ పంచాయితీని ఢిల్లీకి తీసుకెళ్లారు. సోము వీర్రాజు నాయకత్వంపై గుర్రుగా ఉన్నవారంతా కట్టగట్టుకొని హస్తినకు వెళ్లడమే గాకుండా ప్రెసిడెంట్‌ను మార్చాలనే డిమాండ్‌ను పెద్దల ముందు ఉంచారు. వీర్రాజుతో పాటు ఎంపీ జీవీఎల్ సైతం అధికార వైసీపీకి మద్దతుగా ఉండడంతో ప్రజల్లో తమపై వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారట. అయితే తన వద్దకు వచ్చిన అసమ్మతి నేతలపై ఆ పార్టీ జాతీయ నేత మురళీధర్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చర్చించుకుంటే పోయేదానికి ఢిల్లీ దాకా అంతమంది రావాల్సిన అవసరమేముందని క్లాస్ పీకారట. అంతేకాదు అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఏముందని కూడా వారిని ఎదురు ప్రశ్నించారని తెలిసింది.

ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరే పార్టీ మారినా త్వరలోనే మరికొంతమంది కూడా వెళ్లేందుకు రెడీగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. విష్ణుకుమార్ రాజు కూడా కన్నాతో టచ్‌లో ఉన్నారు. ఆయన కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారనే రూమర్స్ వస్తున్నాయి. ఇక ఆ పార్టీ సీనియర్ నేత పురంధేశ్వరి కూడా జీవీఎల్‌పై ఇటీవల సీరియస్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ నేతలు అలర్ట్ అయ్యారు. పార్టీలో పరిస్థితిపై అధినాయకత్వానికి నివేదిక ఇస్తానని మురళీధర్ రావు బీజేపీ నేతలకు హామీ ఇచ్చి పంపించారట. త్వరలోనే మురళీధర్ రాష్ట్రానికి రానున్నారని తెలుస్తోంది.

పార్టీ జాతీయ నాయకత్వం సోము వీర్రాజుకు పూర్తి అండగా ఉందని ఆయన వర్గం నేతలు చెబుతుంటారు. అయితే జనసేనతో పొత్తు విషయంలో సోము వీర్రాజు వ్యవహారశైలి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని కొందరు ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. కన్నా పార్టీలో ఉన్నన్ని రోజులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని జాతీయ నాయకత్వం ఇప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తోందట. దీనికి తోడు వీర్రాజు వ్యతిరేకవర్గం బలంగా వాయిస్ రెయిజ్ చేస్తున్నారు. దాంతో తాజా పరిణామాలు సోము వీర్రాజుకు మైనస్‌గా మారే అవకాశం లేకపోలేదనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తంగా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం సోము వీర్రాజు పదవికి ఎసురు పెట్టేలా కనిపిస్తోంది.