సక్సెసా.. ! ఫెయిల్యూరా.. !?

By KTV Telugu On 13 February, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు షర్మిలా రెడ్డి సరైన నాయకత్వాన్ని అందించలేకపోతున్నారా. ఆమెను జనం విశ్వసించడం లేదు. పార్టీ కేడర్లో కూడా ఉత్సాహం కనిపించడం లేదా. ఎన్నికలు దగ్గర పడుతున్నా.. కాంగ్రెస్ నేతల్లో సమరోత్సాహం  లోపించిందా. ఇంతకీ   షర్మిల చేస్తున్నదేమిటి. ఆమె పట్ల నమ్మకం కలుగకపోవడానికి కారణం ఏమిటి…?

ఢిల్లీ నుంచి అప్పుడప్పుడూ పార్టీ ఇంచార్జీలు దిగినట్లుగా కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను  ఎక్కడ నుంచో దించి పీసీసీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టింది. అప్పటికే ఆమె తెలంగాణలో పార్టీ ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయకుండానే కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీలో కూనారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని షర్మిల ఎలా ఆదుకుంటారో అర్థం కాక సగటు కేడర్ అనుమానిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ను తిట్టిపోసినట్లుగా ఏపీలో తన అన్న జగన్ రెడ్డిని విమర్శించినంత  మాత్రాన  విపరీతమైన జనాదరణ వచ్చి కాంగ్రెస్ గెలిచిపోతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవీపీ, రఘువీరా  లాంటి నేతలను వెంటపెట్టుకుని తిరిగినంత మాత్రాన ఓట్లు రాలిపోతాయా అని ప్రశ్నించే వాళ్లూ లేకపోలేదు. ఆమె డైలాగులు కొన్ని టీవీ చానెల్స్ లో ప్రసారం చేయడానికి పనికొస్తున్నాయే తప్ప జనాన్ని ఆకట్టుకోవడానికి కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆమె వస్తే పార్టీ జాతకం మారిపోతుందని భావించిన వాళ్లు ఇప్పుడిప్పుడే నిజాన్ని గ్రహిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా  పోటీ చేయాలనుకున్న వారి నుంచి వచ్చిన దరఖాస్తులు  కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.  175 అసెంబ్లీ స్థానాలకు 800 లోపే అప్లికేషన్లు రాగా అందులో నాన్ సీరియస్ కేండేట్స్ ఎక్కువగా ఉన్నారు. 25 లోక్ సభా  స్థానాలకు 125 అప్లికేషన్లు కూడా రాలేదు. దీనితో దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించారు. అంటే వరుసగా ఓడిపోతూ డిపాజిట్లు కోల్పోయిన పాతకాపులే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పకనే చెప్పినట్లయ్యింది. షర్మిల వెంట పార్టీ కార్యక్రమాలకు తిరిగే వారిలో కాలం చెల్లిన ముసలి బ్యాచే ఉంది తప్పితే యువత ఎక్కడా కనిపించడం లేదు..

షర్మిలను కాంగ్రెస్ లో ఒక వర్గమే సమర్థిస్తోంది. దళిత  నేతలు ఆమెకు దూరంగా ఉంటున్నారన్న ఫీలింగ్ కలుగుతోంది. పైగా ఒకప్పుడు షర్మిల మాటలు నమ్మి జగన్ రెడ్డి పక్షం వహించిన యూత్ ఇప్పుడు ఆమెను నిలదీసేందుకు ప్రయత్నిస్తున్నారు.. కొందరు గట్టిగా  ప్రశ్నిస్తున్నారు కూడా…

షర్మిల కాంగ్రెస్ లో ఒక గ్రూపుకే నాయకత్వం వహిస్తున్నారనిపిస్తోంది. పార్టీలో షర్మిల ఉన్నట్లుగా కూడా కొందరు సీనియర్లు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.మాజీ ఎంపీ హర్షకుమార్ ….దళిత సింహగర్జనకు పిలుపునిచ్చిన  నేపథ్యంలో పీసీసీ అనుమతి తీసుకున్నారా లేదా అర్థం కావడం  లేదు. ఇతర నేతలు కూడా షర్మిల సభలకు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఒకప్పుడు జగన్, షర్మిల అభిమానులుగా ఉన్న వాళ్లు ఇప్పుడు ఆమె పట్ల తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. నాడు పాదయాత్ర చేసి అన్నకు ఓటేయ్యాలని, కాంగ్రెస్ పార్టీ తమను అన్యాయం చేసిందని ప్రచారానికి దిగిన షర్మిల.. ఇప్పుడదే పార్టీలో ఎలా చేరతారని యువత ప్రశ్నిస్తోంది. నర్సీపట్నం రచ్చబండలో ఓ యువకుడు ఆమెను నిలదీసిన తీరులో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. అందులోనూ టీడీపీకి బలముండి, ఇప్పుడు వైసీపీ చేతిలో ఉన్న ప్రాంతంలో షర్మిల రచ్చబండ పెట్టి తప్పు చేశామన్న ఫీలింగ్ కాంగ్రెస్ కార్యకకర్తలకు కలుగుతోంది. షర్మిల  ఏదో సమాధానం చెప్పి తప్పించుకోవడంతో పార్టీ నేతలు  హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రతీసారీ అలా తప్పించుకోవడం కుదరదని మాత్రం గ్రహించాలి…

షర్మిల ఇప్పుడు అస్తిత్వ సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. నాయకురాలిగా ఆమె ప్రూవ్ చేసుకోవాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లయినా గెలివాలి. తాజా సర్వేలు మాత్రం ఆదిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. మరి ఎన్ని  మాట్లాడితే ఏం లాభం. ఎన్ని  తిట్లు తిడితే ఏం ప్రయోజనం…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి