ఆశ్రమం పేరుతో ఐదు నక్షత్రాల హోటల్….?

By KTV Telugu On 22 October, 2024
image

KTV TELUGU :-

ఎవరినైనా వదిలేస్తాను కానీ.. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద విషయంలో మాత్రం పట్టువిడుపులు ఉండవని సీఎం చంద్రబాబు తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిన స్వామీజీ సంగతి తేల్చేయ్యాల్సిందేనని.. గుట్టుగా చేసిన వ్యాపారాలు బయటకు రావాల్సిందేనని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పైగా ప్రభుత్వం ఇచ్చిన భూములతో స్వామిజీ ప్రైవేటు దందా నిర్వహిస్తున్నారని తెలుసుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు రాష్ట్రంలో చాలా మంది స్వామీజీలున్నప్పటికీ విశాఖ శారదాపీఠానికే జగన్ ఎందుకు ప్రాధాన్యమిచ్చారని కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ క్రమంలో ఏదో బ్లాక్ దందా, కబ్జా వ్యాపారం, బీనామీ పనులు జరిగి ఉంటాయని కూడా అనుమానిస్తున్నారు. కూలంకషంగా విచారణ ప్రారంభమైన వెంటనే విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి.

శారదాపీఠం శ్రీ శంకరచార్యుల బోధనలకు అనుగుణంగా సంస్కృత పాఠశాలను ఏర్పాటుచేసి, ప్రజల్లో వేద విద్య, వేద సంస్కృతిని పెంపొందిస్తామని కారణాలు చెప్పి ప్రభుత్వం నుంచి 2021లో 225 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని విశాఖ జిల్లా భీమిలీ మండలం కొత్తవలసలో పొందింది. తమకు కేటాయించిన భూమిలో ముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతోపాటు ఆదాయార్జన పనులు కూడా చేపడుతామని, కాబట్టి, అందుకు అనుమతి ఇవ్వాలని పీఠం 2023 నవంబరు 20న విశాఖ కలెక్టర్‌ను కోరింది. ఈ విషయాన్ని కలెక్టర్‌ సీరియస్‌గా తీసుకోలేదు. నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అధికారి విశాఖ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకురాగా, పీఠం రాసిన లే ఖపై తన రిమార్క్‌లు ప్రస్తావిస్తూ ఈ ఏడాది జనవరి 19న రెవెన్యూశాఖకు నివేదిక పంపారు. అంతే, 24 గంటల వ్యవధిలో శారదాపీఠం పంపించిన లేఖను ఆంధ్రప్రదేశ్‌ భూ నిర్వహణా వ్యవస్థలో ఆమోదించి, రెవెన్యూశాఖకు పంపించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 6వ తేదీన రెవెన్యూశాఖ సాములోరి విన్నపాలను ఆచరణలోకి తీసుకొస్తూ జీవో జారీచేసింది.

బోర్డింగ్‌ హౌస్‌ పేరిట సాములోరు కొత్తవలసలో తనకిచ్చిన భూమిలో స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు సకల సన్నాహాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు గుర్తించాయి. ఇటీవల ఈ ప్రాంతాన్ని ఓ సీనియర్‌ అధికారి సందర్శించారు. అక్కడ బోర్డింగ్‌ హౌస్‌ పేరిట భారీ స్టార్‌హోటల్‌ నిర్మాణానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు గుర్తించారు. నేరుగా హోటల్‌ అంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి ఎనిమిది అంతస్తుల బోర్డింగ్‌ హౌస్‌ నిర్మాణానికి రెడీ అవుతున్నట్లుగా గుర్తించారు. బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి కూడా అనుమతి పొందారు. దీనికి బోర్డింగ్‌ హౌస్‌ అని పేరుపెట్టారు. ఈ విషయం తెలిసి ఓ రెవెన్యూ అధికారి పీఠం ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. మీరు స్టార్‌హోటల్‌ కట్టకూడదు. అది తప్పు అని వారించినట్లు తెలిసింది. దీనికి శారదాపీఠం ప్రతినిధులు ఎదురువాదన చేశారు. అనుమతులు తీసుకునే పనులు చేస్తున్నామంటూ బుకాయించారు.

నిజానికి జగన్ ప్రభుత్వ శారదా పీఠానికి 15 ఎకరాల స్థలాన్ని దాదాపుగా ఫ్రీ గా ఇచ్చేసిందనే చెప్పాలి. కేవలం ఎకరాకు లక్ష రూపాయల చొప్పున బదలాయించేసింది.అప్పుడే వైసీపీతో రాసుకుపూసుకు తిరిగిన బీఆర్ఎస్ కూడా హైదరాబాద్ దగ్గర శారదాపీఠానికి నాలుగు ఎకరాలు కేటాయించింది. అధికారం మారిన వెంటనే భూమిని కాపాడుకునేందుకు స్వరూపానంద స్వయంగా సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు తనకు ఆప్తుడని కూడా ప్రకటించారు. అయితే ఐదేళ్ల పాటు వైసీపీ రాజకీయాలకు కేంద్ర బిందువైన శారదాపీఠాన్ని, పీఠాధిపతిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చేశారు. అన్ని అక్రమాలను బయటకు తీయాల్సిందేనని ఏపీ అధికారులను ఆయన ఆదేశించారు. పైగా శారదా పీఠానికి జగన్ వస్తున్నారంటే.. అధికారులు ఎంట్రీ ఇచ్చి దారిలో ఉన్న చెట్లన్నింటినీ కొట్టేసేవారు. పర్యావరణాన్ని దెబ్బతీసేవారు. పీఠం మార్గంలో దాదాపుగా కర్ఫ్యూ వాతావరణ ఉండేది. వీటన్నింటికీ కారణం ఏమిటో పూర్తి వివరాలు సేకరించాలని చంద్రబాబు ఆదేశించారు….

శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల స్థల జీవోను రద్దు చేయడం కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పాలి. పీఠాధిపతికి, జగన్ కు ఉన్న అపవిత్ర స్నేహం ఏమిటో బయటకు తీయడమే అసలు ప్రయత్నమని గుర్తించాలి. తదుపరి చర్యలపై చంద్రబాబు ఇప్పటికే సంకేతాలిచ్చారు. శారదా పీఠం నిర్మాణాల్లో జగన్ కు, ఆయన పార్టీకి ఏదైనా దీర్ఘకాలిక లబ్ధి కుదిర్చే ప్రయత్నం ఉందా అని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. బ్లాక్ మనీని వైట్ చేసి… తర్వాత ఆ సొమ్మును బ్లాక్ గా మార్చుకునే దందాకు తెరతీయాలన్న ప్రయత్నం జరిగిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే స్థలం కేటాయింపు రద్దు స్వామీజీ కేవలం షాక్ మాత్రమే.. కలుగులో దాక్కొన్న వారిని బయటకు లాగడం చాలా అవసరమని చంద్రబాబు ఎప్పుడో గ్రహించారు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి