లోకేష్‌తో పాటు నడుస్తూ నందమూరితారకరత్న కుప్పకూలిన దృశ్యాన్నిఅంతా చూశారు. ఆ తర్వాత నారాయణ హృదయాలకు తరలించిన తర్వాత కూడా ఆయన స్పృహలోకి వచ్చింది లేదు. ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగుపడింది లేదు. ఆస్పత్రిలో చేరిన క్షణంనుంచీ ఆయన వెంటిలేటర్ మీదే ఉన్నారు. డాక్టర్ల హెల్త్‌బులెటిన్స్‌తో తారకరత్న ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకోవడం తప్ప ఆయన కళ్లు తెరిచి చూసింది లేదు. ఆ కళ్లు తెరుచుకోకుండానే మూడువారాల తర్వాత మూతపడ్డాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున నందమూరి కుటుంబం తమ రక్తసంబంధీకుడి భౌతికకాయం ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ గడిపింది.
తారకరత్నప్రాణాలతో బయటపడే అవకాశం లేదని డాక్టర్లకు ముందే తెలుసన్నమాట ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఆయన చావు కబురు ఎందుకు ఆలస్యమైందన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చికిత్సలో మిరాకల్ జరిగి ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉన్నాయన్నది ఒక వాదన. అయితే ఇప్పటికే ఐరన్‌లెగ్ ముద్ర ఉన్న నారా లోకేష్ పాదయాత్ర తొలిరోజే ఇది జరగటంతో ఆ యువనేత భవిష్యత్తుకోసమే చావువార్తను ఆలస్యం చేశారన్నది ప్రత్యర్థుల చేస్తున్న విమర్శ. నందమూరి కుటుంబం వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయాలంటే వైసీపీ స్పోక్స్ పర్సన్‌గా మైకుముందుకొస్తారు లక్ష్మిపార్వతి. తారకరత్న మహాశివరాత్రి నాడు కాదు జనవరి 27నే చనిపోయారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
లక్ష్మిపార్వతి చెబుతున్న ప్రకారం గుండెపోటు వచ్చిన కొన్ని క్షణాలకే తారకరత్న ప్రాణాలు కోల్పోయారు. బ్రెయిన్ డెడ్ అయినా టీడీపీ అధినేత చంద్రబాబు ఆ నిజాన్ని దాచిపెట్టారన్న ఆరోపణతో నందమూరి కుటుంబంలో కలకలం రేపారు లక్ష్మిపార్వతి. కొడుకు పాదయాత్రకు అపశకునంగా అంతా భావిస్తారనే ఈట్రీట్మెంట్ డ్రామా నడిపారన్నది లక్ష్మిపార్వతి ఆరోపణ. పాదయాత్ర ఆగుతుందనే చావువార్తను ఆలస్యం చేశారంటున్నారామె. తన భర్త ఎన్టీఆర్‌ని మానసిక క్షోభకు గురిచేసి ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని మళ్లీ పాతగాయాల్ని కెలికే ప్రయత్నంచేశారు. చివరికి తారకరత్న విషయంలోనూ అదే జరిగిందంటున్నారు లక్ష్మిపార్వతి.
కారణాలేమయినా కావచ్చు 39 ఏళ్లకే నందమూరి తారకరత్న కన్నుమూయడం నందమూరి కుటుంబానికే కాదు అందరికీ బాధాకరమే. మహాశివరాత్రినాడు కన్నుమూశారన్న వార్తతో తారకరత్న శివైక్యం చెందారని అంతా భావించారు. ఇప్పుడు లక్ష్మిపార్వతి చేస్తున్న ఆరోపణలతో ఆ కుటుంబం ఇంకాస్త వేదనపడటం తప్ప తారకరత్న తిరిగిరాడు. సింహంలా బతికి ఎన్టీఆర్ నుంచి ఆయన మనువడు తారకరత్న దాకా నందమూరి కుటుంబంలో మరణాలు కూడా వివాదాస్పదం కావడమే అన్నిటికీ మించిన విషాదం.