టీడీపీకి ఏదో శని పట్టుకుంది. చంద్రబాబు ఏ క్షణాన ఇదేం ఖర్మ అనే కార్యక్రమం పెట్టుకున్నారో అప్పట్నుంచి టీడీపీకి శకునాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది చివరలో కందుకూరు మీటింగ్‌లో 8మంది 2023 ఆరంభంలో గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిల్చింది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర వేళ మళ్లీ కీడు శంకించింది. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రమాదం నుంచి బయటపడగా నందమూరు తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రజలకు అభివాదం చేసి వెనుదిరిగే సమయంలో వాహనం ముందుకు కదలడంతో నిల్చున్న బాలకృష్ణ ఒక్కసారిగా వెనక్కితూలి పడబోయారు. పార్టీ నాయకులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగానే లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెలో నొప్పితో సొమ్మసిల్లిపడిపోయారు. తారకరత్నను హుటాహుటిన కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. విషయం తెలుకున్న బాలకృష్ణ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు.
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయంలో పూజల తర్వాత మసీదులో ఆయన ప్రార్థనలను నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో తారకరత్న కూడా పాల్గొన్నారు. అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల తాకిడి పెరిగింది. పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకకత్న సొమ్మసిల్లి పడిపోయారు. తారకరత్న స్పృహలోకి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తారకరత్న ఇటీవల టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హిందూపురంలో పర్యటిస్తున్న ఆయన లోకేష్ పర్యటన సందర్భంగా కుప్పం చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో నందమూరి అభిమానులు ఆందోళనకు గురయ్యారు.