లోకేష్‌తో భేటీ.. టికెట్‌ కన్ఫామ్ చేసుకునేందుకేనా

By KTV Telugu On 11 January, 2023
image

ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తారకరత్న పోటీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నారా లోకేష్‌తో తారకరత్న భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని చెబుతున్నప్పటికీ తాజా రాజకీయ పరిణామాలపైనే ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నుండి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తారకరత్న గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా ప్రకటించారు. తాజా పరిణామాలతో నిజంగానే నందమూరి తారకరత్న రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన తారకరత్న ఈ సారి ఏకంగా పోటీకే సిద్ధమంటున్నారు. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై రక రకాల ఊహాగానాలు ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్‌తో సమావేశమవ్వడం ఆసక్తిని రేపుతోంది. టికెట్‌పై క్లారిటీ కోసమే లోకేష్‌ను తారకరత్న కలిశారనే టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి తారకరత్న పోటీ చేస్తారని అంటున్నారు. కొడాలి నాని కి చెక్ పెట్టడానికి నందమూరి కుటుంబం నుండి తారకరత్నను బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అన్న దానిపైన కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తారకరత్న టికెట్‌కు సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

జనవరి 27 నుంచి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకే తారకరత్న కలిసి ఉంటారని తమ్ముళ్లు భావిస్తున్నారు. లోకేష్ తో భేటీ విషయాన్ని తారకరత్న ట్వీట్ చేసి వెల్లడించారు. తనను కలవడానికి సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు చెబుతూ మీ అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం మున్ముందు మేము కలిసి ఎలా పని చేయాలో చర్చించే అవకాశాన్ని ఇచ్చినందుకు అభినందిస్తున్నాను. దీనిని కొనసాగించి మన తెలుగుదేశం పార్టీలో సానుకూల ప్రభావం చూపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. అంటూ తారకరత్న ట్వీట్ చేశారు.

ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ ఆరంగేట్రం చేసిన నందమూరి తారకరత్న ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక సినిమా చొప్పున వరుసగా సినిమాలు చేసినా సినీ రంగంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అడపాదడపా సినిమాలతో వెబ్ సిరీస్‌లతో సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తున్నప్పటికీ చెప్పుకోతగిన రీతిలో ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆయనకు అవకాశాలు రావడం లేదు. దాంతో తన కెరీర్‌ను రాజకీయాలవైపు మళ్లించారు. వచ్చే ఎన్నికల్లో నందమూరి కుటుంబం సంపూర్ణ మద్దతు తెలుగుదేశానికి ఉంటుందని తారకరత్న ఇటీవల జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. అవసరమైనప్పుడు తమ్ముడు జూ.ఎన్టీఆర్ కూడా వస్తారంటూ చెప్పుకొచ్చారు. టీడీపీకి మద్దతుగా పనిచేస్తూనే రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో తారకరత్న ఉన్నారు.