TDP and Money Matters – డబ్బు సంచులు – సైకిల్ సవారీలు…

By KTV Telugu On 17 March, 2024
image

KTV TELUGU :-

అన్ని  ఆ తాను ముక్కలేనా. డబ్బులు ఇచ్చి పుచ్చుకోవాటాలు లేకుండా పార్టీలు నడవవా. మూటలిచ్చి టికెట్లు పొందారని  టీడీపీలో గుసుగుసలు ఎందుకు వినిపిస్తున్నాయి. రెండో జాబితాతో అసంతృప్తి పెరిగిపోవడానికి కారణం చంద్రబాబైనా, మనీ మేటర్ కూడా ఉందా. ఒక్కో నియోజకవర్గానికి రెండు మూడు కథలు ఎందుకు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఎవరి జోక్యం ఉంది…

34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. ప్రజల్లో పట్టున్న వారికే టికెట్ ఇచ్చినట్లుగా ప్రచారమైంది. చివరకు చంద్రబాబు ఆదేశించి నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వే కూడా అభ్యర్థుల ఎంపికలో పనిచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఐనా పార్టీలో అసంతృప్తి తప్పలేదు. అక్కడక్కడ నిరసనలు జరిగాయి. కొన్ని లిస్టులకు సంబంధించినవి అయితే మరికొన్ని లిస్టుతో సంబంధం లేకుండా వేరే అంశాల ఆధారంగా జరిగినవి, జరుగుతున్నవి కూడా ఉంటున్నాయి. నిరసనలు టీ కప్పులో  తుపానులా సమసిపోతాయని టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అది నిజం కూడా కావచ్చు. అసంతృప్తిపరులు ఎటు వెళ్లలేక సర్దుకుపోవచ్చు.అయితే మొత్తం వ్యవహారంలో  ఒక నిగూఢమైన అర్థం దాగొంది. కొన్ని శక్తుల జోక్యంతో లిస్టులో పది పన్నెండు పేర్లయినా చేరి ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. ధనం మూలం ఇదం జగత్ అన్న చందాన ఏదో  తెరవెనుక జరిగిందన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లో  బయటకే వినిపిస్తున్నాయి..అందులో  పెదకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పై అలాంటి అనుమానలే  వస్తున్నాయి. అక్కడి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు టికెట్ ఇవ్వకుండా ప్రవీణ్ కు నామినేషన్ కట్టబెడుతున్నారు. 2019లో ఓడిపోయినప్పటి నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ జనంలో ఉంటూ పార్టీ పనులు చేస్తున్నారు. అయితే భాష్యం ప్రవీణ్ చాప కింద నీరులా నరుక్కు  వచ్చారని చెబుతున్నారు. శ్రీధర్ కు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీతో చంద్రబాబు ఆయన నోరు మూయించారని టీడీపీలో అంతర్గతంగా వినిపిస్తున్న టాక్. అడ్డదిడ్డంగా నామినేషన్ దక్కించుకున్న ప్రవీణ్ విజయావకాశాలపై వినిపిస్తున్న వాదన మాత్రం  వేరుగా ఉంది..ఆయన స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావుకు మేనల్లుడు, రేపు అవకాశాన్ని బట్టి మామ, అల్లుళ్లు కూడబలుక్కుంటే జరిగేదేమిటో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

భాష్యం ప్రవీణ్ ఒక్కరే కాదు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఇంతవరకు పార్టీలో పనిచేయని వారికి కూడా ఏవేవో లెక్కలు చూసుకుని టికెట్లు ప్రకటించేశారు.సీఎం జగన్ మీద అలిగి బయటకు వచ్చి నాలుగు తిట్లు తిట్టారన్న ఆనందంలో కూడా కొందరికి టికెట్లు ఇస్తున్నారు పైగా ఈ సారి టీడీపీలో  ఫ్యామిలీ ప్యాక్స్ కూడా రెడీ అవుతున్నాయి. అవన్నీ కూడా మనీ మేటర్సేనని చెప్పుకుంటున్నారు.

టికెట్ల బట్వాడా  చాలా విచిత్రంగా ఉంది. ఎవరికి ఎందుకు టికెట్ ఇచ్చారో అర్థం కావడం లేదు. గుంటూరు పశ్చిమను పిడుగురాళ్ల మాధవి అనే  మహిళకు టికెట్ ఇచ్చారు. వికాస్ హాస్పిటల్స్ సంస్థ యజమాని భార్య. మాధవి భర్త చౌదరి అయితే ఆమె  చాకలి సామాజికవర్గానికి చెందిన బీసీ మహిళ. ఇప్పుడు బీసీలకు  టికెట్ ఇచ్చినట్లుగా టీడీపీ చెప్పుకుంటున్నప్పటికీ బాగా డబ్బు ఉండి ఖర్చు చేయగలిగిన వారికి టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్యాయమైపోయారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెనాలి టికెట్ ఆశించిన ఆలపాటి రాజాకు జనసేన రూపంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అక్కడ జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ టికెట్ పొందడంతో తనకు   గుంటూరు వెస్ట్ అయినా దక్కుతుందని రాజా ఎదురుచూశారు. అదీ జరగలేదు. ప్రొద్దుటూరులో టికెట్ పొందిన  ఎన్. వరదరాజులు రెడ్డి పరిస్థితి కూడా అంతేనని  చెప్పాలి. కురువృద్ధుడైన ఆయన రెండు సార్లు ఓడిపోయి ఉన్నారు. కదల్లేని పరిస్థితిలో ఉన్న ఆయనకు టికెట్ ఇచ్చి..నియోజకవర్గంలో బాగా పనిచేస్తున్న ఉక్కు ప్రవీణ్ ను పక్కన పెట్టారు.అది  పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. వైసీపీ  నుంచి  వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి, కోనేటి ఆదిమూలానికి  టికెట్ ఇవ్వడంపై కూడా టీడీపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది…

ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు చాలా అవసరం. ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టనిదే గెలవలేని పరిస్థితి వచ్చిన  మాట వాస్తవం. అందుకని డబ్బులే పరమావధిగా టికెట్ల బట్వాడా చేయడం కూడా కరెక్టు కాదు. డబ్బులు ఎలా చేతులు మారాయో రికార్డులు ఉండవు. కాకపోతే జనబాహుళ్యంలో అవన్నీ తెలిసిపోతూనే ఉంటాయి. చూడాలి మరి చివరగా ఏం జరుగుతుందో…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి