అన్యాయమైపోయాంటున్న పల్నాడు నేతలు

By KTV Telugu On 2 August, 2024
image

KTV TELUGU :-

అభివృద్ధి పరంగా ఎప్పుడూ వెనుకబడిపోయే  పల్నాడు జిల్లా రాజకీయంగా మాత్రం కొంత మేర ముందంజలోనే ఉండేది. నిన్నటి వైసీపీ సర్కారులో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మంత్రి పదవి దక్కగా గతంలో టీడీపీలో  కూడా హేమాహేమీలు స్టేట్ మినిష్టర్లుగా ఉండేవారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పల్నాడు నేతల హవా సాగేది. పల్నాడు ప్రాంతానికి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రులుగా చేశారు. కాసు వెంగలరెడ్డి మంత్రిగా, కొత్త  రఘురామయ్య స్పీకర్ గా చేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కోడెల శివప్రసాద్ కీలక నేతగా ఎదిగారు. మంత్రిగా, స్పీకర్ గా సేవలందించారు. ఆయన్ను పల్నాడు పులి అని పిలుస్తారు. అటు కోడెల, ఇటు కాసు కుటుంబాల్లో అధికారాన్ని బట్టి ఎవరోకరు మంత్రులుగా ఉండేవారు.గత చంద్రబాబు హయాంలో కోడెల స్పీకర్ అయితే, ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా పనిచేశారు. జగన్ హయాంలో అంబటి రాంబాబు జలవనరుల శాఖామంత్రిగా ఉంటే.. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా పనిచేశారు.

ఈసారి పల్నాడులోని ఏడు నియోజకవర్గాల్లో  టీడీపీ విజయభేరీ మోగించి వంద శాతం సక్సెస్ సాధించింది. ఇంకేముంది పల్నాడు నేతలకు తిరుగులేని లెక్కలేసుకుంటున్న తరుణంలో  మంత్రివర్గ ఏర్పాటులో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ సారి గెలిచిన వారు  హేమాహేమీలైనప్పటికీ కేబినెట్లో మాత్రం చోటు దక్కలేదు. రాజకీయ భీష్మాచార్యుడిగా భావించే సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణకు మంత్రి పదవి ఖాయమని  భావించి ఆయన అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. మంత్రి కన్నా గారి తాలూకా అంటూ వాట్సాప్  గ్రూపులు కూడా క్రియేట్ చేశారు. ఐనా సరే చంద్రబాబు తమను కనికరించలేదని కన్నా అనుచరులు ఆగ్రహం  చెందుతున్నారు. కన్నాను టీడీపీలో చేర్చుకున్నప్పుడే సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ తో  పాటు గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తారని ఎదురు చూశారు.అయితే  అనుకున్నదొక్కటీ ఐనదొక్కటిగా పరిస్థితి తయారైంది.ఆరు  సార్లు గెలిచిన నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడమేమిటని ఆగ్రహం చెందుతున్నారు.

ఇక నాలుగైదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, చిలకలూరుపేట ఎమ్మెల్యే  ప్రత్తిపాటి పుల్లారావులో ఒకరికి మంత్రి పదవి వస్తుందని ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. ఇద్దరు కమ్మ సామాజికవర్గానికే చెందిన నేతలు కావడంతో వారికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. పెదకూరపాడులో  తొలి సారి గెలిచిన భాష్యం ప్రవీణ్ మంత్రి పదవి దక్కించుకుంటారని ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. ఇక మాచర్ల ఎమ్మెల్యే  జూలకంటి బ్రహ్మారెడ్డికైనా మంత్రి  పదవి ఇస్తారనుకుంటే చంద్రబాబు ఆయనపై కూడా శీతకన్నేశారు. ఇన్ని సంవత్సరాల పాటు ప్రత్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేతిలో తన్నులు తిని ప్రయోజనం ఏమిటని జూలకంటి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంత అసంతృప్తిగా ఉన్నారో, వారి అనుచరులు అంతకంటే వంద రెట్లు ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు  తమను అన్యాయం చేశారని వారు వాపోతున్నారు. వీలైనంత త్వరగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పల్నాడు బ్యాచ్  ఆకాంక్షిస్తోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి