కామ్రేడ్లకు మండుకొస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను చూస్తోంటే కమ్యూనిస్టులకు చిర్రెత్తుకొస్తోంది. ఇద్దరూ కలిసి బిజెపి అధినేత మోదీ ప్రాపకం కోసం అలా వెంపర్లాడ్డం ఏంటని కోపం తన్నుకొస్తోంది. ఈ అవకాశ వాదాలు ఎందుకోసమని వారు మా సెడ్డ చికాగ్గా ఉన్నారు. బిజెపి చీదరించుకుంటోన్నా చంద్రబాబు అలా వెంటపడ్డం ఏంటని ఇనప చేటలో నిప్పులు చెరిగేస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు బాగా చికాగ్గా ఉన్నారు. చాలా అంటే చాలా అసహ్యంగా ఉంది వారికి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు నిన్న కాక మొన్ననే చంద్రబాబు నాయుడిపై చెరో ఒంటి కాలిపై లేచి నిలబడ్డారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకీ ఏ విషయంలోనూ భావసారూప్యత లేకపోవచ్చు కానీ చంద్రబాబు పవన్ ల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం రావడం కమ్యూనిస్టుల ఐక్యతకు ఏమన్నా పనికొస్తుందేమో చూడాలంటున్నారు రాజకీయ పండితులు.
ఇంతకీ ఈ ఇద్దరు కామ్రేడ్ల అభ్యంతరం ఏంటి అన్నది చూడాలి. చంద్రబాబు నాయుడు ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొంటూ నరేంద్ర మోదీ విధానాలు అద్భుతమంటూ కొనియాడారు. మోదీ విధానాలతో తాను ఏకీభవిస్తానన్నారు. మోదీ వల్లనే భారత్ కు ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చిందని కూడా అన్నారు. మొత్తానికి బిజెపితో మళ్లీ కలిసి పనిచేయాలని ఉందని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు ఇదే కామ్రేడ్లకు నచ్చలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఆ కూటమిలో ఉండే అవకాశాలు ఉండవు. కమ్యూనిస్టు పార్టీలు ఇంతకాలం చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నాయి. ఇపుడు చంద్రబాబు బిజెపి తో పొత్తుకోసం వెంపర్లాడ్డంతో రాఘవులు నారాయణలకు చిర్రెత్తుకొస్తోంది. మోదీ విధానాలు ఏం బావున్నాయని చంద్రబాబు పొగుడుతున్నారు అని నిలదీసిన రాఘవులు బిజెపి వద్దు వద్దు అంటోన్న పొత్తుకోసం చంద్రబాబు వెంటపడ్డం అవకాశ వాద రాజకీయం తప్ప మరోటి కాదన్నారు కామ్రేడ్లు చెప్పింది నిజమే. టిడిపితో పొత్తుకు బిజెపి విముఖంగానే ఉంది. ఇప్పటికే చాలా సార్లు ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పేశారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు బిజెపిని వదలడం లేదు. టిడిపితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బిజెపితోనే అంటకాగుతున్నారన్నది కామ్రేడ్ల ఫిర్యాదు. ఈ రెండు పార్టీలూ బిజెపితో కలిసిపోతే ఏపీలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో కమ్యూనిస్టులకు అర్ధం కావడం లేదు. ఎందుకంటే ఇక మిగిలిన పార్టీలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, కాంగ్రెస్, కేయే పాల్ నాయకత్వంలోని ప్రజాశాంతి పార్టీలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అలవాటు మొదట్నుంచీ లేదు. ఎప్పుడూ ఒంటరి పోరుకు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ సింగిల్ గానే పోరాడతాం తప్ప ఎవరితోనూ పొత్తులు ఉండవని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అడ్రస్సే లేదు. అంచేత దాంతో పొత్తు గురించి ఆలోచించే తీరిక కూడా కామ్రేడ్లకు లేకుండా పోయింది. ఉన్నంతలో టిడిపి జనసేనల్లో ఎవరితోనైనా కలవాలని కామ్రేడ్లు అనుకున్నారు. పొత్తుల కోసమే చంద్రబాబు నాయుడు చెప్పిందానికల్లా తలాడిస్తూ బాబు అజెండానే భుజాలకెత్తుకుంటున్నారు సిపిఐ నారాయణ. రాజధాని నగరంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమైతే వాటిని అడ్డుకుంటూ టిడిపి పిటిషన్ వేయించింది. దీనిపై చిత్రంగా కమ్యూనిస్టు పార్టీలు రెండూ కూడా నోరు మెదపలేదు. పేదల కోసం పనిచేయాల్సిన కమ్యూనిస్టు పార్టీలకు ఏమైందని మేథావులు ప్రశ్నించారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టులకు చట్టసభల్లో చోటు లేకుండా పోయింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఖాతా తెరవలేదు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అయితే అది వర్కవుట్ కాలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో అయినా బోణీ కొడతామా లేదా అన్న డైలమాలో పడ్డారు కమ్యూనిస్టులు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పొత్తులకు దూరం కాబట్టి టిడిపితోనే ముందుకు వెళ్లాలని అనుకున్నారు.
ఇటీవలి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధుల విజయానికి కమ్యూనిస్టులు శక్తివంచన లేకుండా కృషి చేశారు. దీన్ని అడ్డు పెట్టుకుని 2024 ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకుందామని కమ్యూనిస్టులు ఆశపడ్డారు. బిజెపి తమతో పొత్తుకు ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు కమ్యూనిస్టులతో కూడా పొత్తు పెట్టుకుంటారు. అందులో అనుమానాలు అవసరం లేదు. కాకపోతే చంద్రబాబు మాత్రం బిజెపికే అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీల తరపున ఎవరూ అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి ఉండదని రాఘవులు, నారాయణలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే 15 ఏళ్లుగా అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిథ్యమే లేకుండా పోయినట్లవుతుంది. అదే జరిగితే ఇక పార్టీల మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. అందుకే ఇద్దరు సీనియర్ కామ్రేడ్లూ చాలా మంటమీద ఉన్నారు. బిజెపి ఛీ కొడుతోన్నా చంద్రబాబు ఎందుకు వెంటపడుతున్నారని అడుగుతోన్న కమ్యూనిస్టులు కూడా ఓ విషయం గుర్తుంచుకోవాలంటున్నారు రాజకీయ పండితులు.
చంద్రబాబుకు కమ్యూనిస్టులతో కలవడం కన్నా బిజెపితో కలవడమే ఇష్టమని తేలిపోయిన తర్వాత కూడా టిడిపితో పొత్తు కోసం జనసేనతో స్నేహం కోసం రాఘవులు నారాయణలు ఎందుకు వెంపర్లాడుతున్నారో చెప్పాలని వారంటున్నారు. చంద్రబాబువి అవకాశ వాద రాజకీయాలంటున్నారు కామ్రేడ్లు. అది ముమ్మాటికీ వాస్తవం. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా అవకాశ వాద రాజకీయమే. మరి అదే సమయంలో కమ్యూనిస్టులవి అవకాశ వాద రాజకీయాలు కావా అంటున్నారు మేథావులు. ఉమ్మడి ఏపీలో కమ్యూనిస్టులు ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాయి ఏ సిద్ధాంతం ప్రాతిపదికన పొత్తులు పెట్టుకున్నాయి. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టిన వెంటనే టిడిపితో పొత్తు పెట్టుకున్నారు కమ్యూనిస్టులు. కాంగ్రెస్ ను ఓడించడం కోసమే టిడిపితో కలిశామని వివరణ ఇచ్చుకున్నారు. 1999 ఎన్నికల వరకు టిడిపితో పొత్తులు పెట్టుకున్న కమ్యూనిస్టులు 1999లో పొత్తుల్లేకుండా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో కమ్యూనిస్టులు అలా చేయాల్సి వచ్చింది. 2004 ఎన్నికల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఫలితంగా రెండు పార్టీలూ కలిసి 15 స్థానాలు గెలుచుకున్నాయి.
2009 ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ టిడిపితో పొత్తుకు సిద్దమైపోయాయి కమ్యూనిస్టు పార్టీలు. ఓ సిద్ధాంతం ప్రాతిపదిక అంటూ ఏమీ లేవు. కాంగ్రెస్ తో కలిసినపుడు టిడిపిని ఓడించడానికని టిడిపితో కలిసినపుడు కాంగ్రెస్ ను ఓడించడానికని కారణాలు చెప్పుకున్నారు. అసలు విషయం ఏంటంటే కమ్యూనిస్టులు ఎప్పుడూ కూడా ఏ పార్టీ గెలుస్తుందో దాంతో పొత్తు పెట్టుకోడానికే మొగ్గు చూపాయి. పొత్తుల ద్వారా కొన్ని సీట్లు సాధించుకోడానికే పరిమితం అయ్యాయి. అందుకే ఆ పార్టీలు ఎదుగూ బొదుగూ లేకుండా ఏదో ఒక పార్టీతో పొత్తుల కోసం దేబిరించే తోక పార్టీలుగా మిగిలిపోయాయి. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కామ్రేడ్లు ఇపుడు టిడిపి జనసేన తమతో కలిసి రావడం లేదనన దుగ్ధతో బిజెపి వెంట మీరెందుకు పడుతున్నారని నిలదీయడంలో అర్దం లేదంటున్నారు రాజకీయ పండితులు. టిడిపి అయినా జనసేన అయినా తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తామే నిర్ణయించుకుంటాయి తప్ప కమ్యూనిస్టు పార్టీల ఇష్టాయిష్టాలను బట్టి కాదు. ఇంత సింపుల్ లాజిక్ ను కామ్రేడ్లు ఎలా మిస్ అయ్యారో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.