చంద్రబాబు హ్యాపీ, కేడర్ నాట్ హ్యాపీ ?

By KTV Telugu On 10 July, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వ కూటమి అధికారానికి  వచ్చి నెల అవుతోంది.వచ్చిందే తడవుగా చంద్రబాబు కార్యాచరణకు దిగారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని చేపట్టడం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం రావడంతో చంద్రబాబుతో పాటు ఆయన చుట్టూ ఉన్నవారంతా సంతోష పడుతున్నారు. అనుకున్నదీ సాధించామని, ఇకపై తమకు తిరుగు ఉండదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే అధినేత ఉన్నంత హ్యాపీగా ద్వితీయ శ్రేణ నేతలు, కార్యకర్తలు లేరని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. టీడీపీ అధినాయకత్వం  తీరుపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో  రగిలిపోతున్నారు….

ఐదేళ్ల పాటు టీడీపీ కేడర్ ఎన్నో వేధింపులు, అవమానాలను ఎదుర్కొంది. ఉపద్రవం ఎటు నుంచి వచ్చి పడుతుందోనన్న భయం వారిని వెంటాడింది. వైసీపీ  గ్యాంగులు ఎటు వైపు నుంచి దాడి  చేస్తారో తెలియక భయం భయంగా గడిపిన సందర్భాలున్నాయి. అనేక మంది నేతలు వారి అనుచరులపై భారీ దాడులు కూడా జరిగాయి. వాటన్నింటినీ సహించి పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే ఇప్పుడు కూడా అవమానాలు తప్పడం లేదన్న ఆవేదన పార్టీ కేడర్లో కనిపిస్తోంది. అప్పటి ఘటనలు  మదిలో మెదులుతుండగానే.. తమ నాయకుల ఒంటెత్తు పోకడలను చూసి వాళ్లు మౌనరోదన చేస్తున్నారని సమాచారం. గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే అప్పట్లో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి సహా అనేక సంఘటనలు టీడీపీని కలిచివేశాయి. ఏం జరుగుతుందోనని టీడీపీ కేడర్ భయాందోళనలకు లోనయ్యింది. అప్పుడు  పోలీసులు చేతులు దులుపుకున్నా… ఇప్పుడు  ప్రభుత్వం ఫైలుకు దుమ్ము దులిపి నిజమైన నిందితులను పట్టుకునే పనిలో ఉంది.

నిందితులను పట్టుకుంటారన్న  నమ్మకం టీడీపీ కేడర్లో ఉన్న మాట వాస్తవం.అయితే ఇప్పుడు అధికార పార్టీలో పెత్తనం చేస్తున్నదెవ్వరనేదే పెద్ద ప్రశ్నగా మారింది. నిజమైన కేడర్ ను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వలసవాదులకు ప్రాధాన్యం ఇస్తున్నారని క్రియాశీల కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు….

మంగళగిరి టీడీపీ కార్యాలయంపైనే కాకుండా వైసీపీ పాలనలో అనేక చోట్ల టీడీపీపై దాడులు జరిగాయి. కార్యాలయాలు పగులగొట్టారు. వాహనాలు ధ్వంసం చేశారు. ఎదురు కేసులు పెట్టారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. టీడీపీ వారినే రెచ్చగొట్టే విధంగా కించపరిచే విదంగా పోస్ట్ లు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ ఆఫీసుపై  దాడి చేసిన వారితో పాటు వైసీపీ ఐదేళ్ల పాలన లో ఎన్నో అరాచకాలు , అక్రమాలు చేసిన  వారు కూడా ఇప్పడు టీడీపీ ఎమ్మెల్యే పక్కన ఉండటం చూసి  కరుడుగట్టిన పార్టీ వాదుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికే వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరులలో కొందరు టీడీపీలో చేరిపోయారు. మరి కొందరు కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగేనే ఎమ్మెల్యే వద్ద కనిపించడం టీడీపీక్యాడర్ కు ఆగ్రహం తెప్పిస్తుంది.  ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి పలువురు ఇలాంటి వారిని టీడీపీ ఎమ్మెల్యే ల వద్ద చూసి బయటకు చెప్ప లేక సోషల్ మీడియా వేదిక గా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆవేదనను ఇప్పటి వరకు గెలిచిన ఎంపీ , ఎమ్మెల్యే లు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టిడిపి కేంద్ర నాయకత్వం టిడిపి ఆఫీస్ పై దాడి కేసు పై దృష్టి సారించడం తో ఈ అంశం ప్రధానం గా చర్చకు వస్తుంది. గుంటూరు ఎంపీ  పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాదవి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్   వద్ద ఎన్నికల సమయంలో పలువురు టిడిపి లో చేరిపోగా, ప్రభుత్వం మారగానే మరి కొందరు ఎమ్మెల్యే ఆఫీస్  వద్ద కనిపిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సాహిస్తే గత వైసీపీ ప్రభుత్వంపై పడిన ప్రజా వ్యతిరేక ముద్ర ప్రస్తుత కూటమి ప్రభుత్వం పై కూడా పడుతుందని ఆవేదన చెందుతున్నారు.

అక్రమాలు, దౌర్జన్యాలతో తమను అణిచివేసిన వారిని ఇప్పుడెలా చేర్చుకుంటారన్నది సగటు టీడీపీ కార్యకర్తల ప్రశ్న. చంద్రబాబు నాయుడు ఎవ్వరినీ దగ్గరకు రానివ్వకుండా, ఎవరి  మనోభావాలను అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారని కొందరు వాపోతున్నారు. పైగా  కొందరు వ్యక్తులు ముందే టీడీపీ ప్రజా ప్రతినిధులతో  మాట్లాడుకుని వ్యూహాత్మకంగా పార్టీలోకి వచ్చారని తెలియడంతో టీడీపీ కేడర్ రగిలిపోతోంది. ఫైనల్ గా చంద్రబాబు అర్థం చేసుకుంటారో లేదో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి