ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీలో పొగ పెడుతున్నారా? ప్రతి ఎన్నికకూ ఒక్కో సీటు మారే గంటాకు ఈసారి సీటు లేదా? ఆయన కోరిన సీటు ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారా? విశాఖ నుంచి చీపురుపల్లి వెళ్ళమని చెప్పడం వెనుక ఉన్న మర్మం ఏంటి? ఉత్తరాంధ్ర టీడీపీలో చక్రం తిప్పిన గంటా పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఎందుకు మారింది? గంటా శ్రీనివాసరావుకు టీడీపీలో భవిష్యత్ లేదని తేల్చేశారా? వాచ్ దిస్ స్టోరీ.
గంటా శ్రీనివాసరావు పార్టీలు మార్చడంలో, ప్రతిసారీ పోటీ చేసే సీటు మార్చడంలో ఆరితేరిపోయారు. రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న గంటా ఉత్తరాంధ్ర టీడీపీలో చక్రం తిప్పాడని చెబుతారు. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ మాజీ మంత్రికి రాబోయే ఎన్నికల్లో సీటు కోసం చంద్రబాబు, లోకేష్‌లను అర్థించాల్సిన దుస్థితి ఏర్పడింది. విశాఖ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసిన చరిత్ర గంటాకు ఉంది. గత ఎన్నికల్లో విశాఖ సిటీలోని నార్త్‌నియోజకవర్గంలో స్వల్ప మెజారిటీతో ఒడ్డున పడ్డారు.
తన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. పార్టీ నాయకత్వంకు చెప్పకుండానే గతంలో ఒకసారి పోటీ చేసి గెలిచిన భీమిలిలో పోటీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. తన అనుచరులు, అనుకూలంగా ఉండే స్థానిక ప్రజానిధులను అడ్డుపెట్టుకుని భీమిలి టీడీపీ ఇన్‌చార్జ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
భీమిలిలో గంటా చేస్తున్న హడావుడిని అక్కడి పార్టీ ఇన్‌చార్జ్‌చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు. ఐదేళ్ళుగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా..ఇప్పుడు మరో నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్న గంటా శ్రీనివాసరావుకు ఈసారి టిక్కెట్ ఇవ్వరాదని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం గతంలో మాదిరిగా గంటా హవా లేకపోవడం..తన అవసరానికి మాత్రమే పార్టీని ఉపయోగించుకోవడం తదితర కారణాలను చూపిస్తూ..టిక్కెట్ ఇవ్వకూడదనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
భీమిలి కాదంటే చోడవరంలో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే విశాఖ జిల్లాలోనే గంటాకు అవకాశం ఇవ్వరాదని నిర్ణయించుకున్న చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీచేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.తనను పార్టీ నుంచి బయటకు పంపించడానికే చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారని గంటా భావిస్తున్నారు. పొమ్మనకుండా పొగపెడుతున్నారని అంటున్నారు. తాను ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారిన మాట వాస్తవమేనని గంటా అంగీకరిస్తున్నారు. తాను ఎన్నిసార్లు నియోజకవర్గం మారినా విశాఖ జిల్లాలోనే పోటీ చేసినట్లు చెబుతున్నారు. ఈసారి కూడా తాను విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు, లోకేష్‌లకు గంటా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇష్టమైతే చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని లేదంటే ఈ సారి పోటీకి దూరంగా ఉండాలని గంటాకు తేల్చి చెప్పినట్లు టిడిపిలో చర్చ జరుగుతోంది.
ఎన్నికల తర్వాత తాను పార్టీని పట్టించుకోనంతమాత్రాన విశాఖ జిల్లాలో సీటు లేదంటారా అంటూ గంటా గుస్సా అవుతున్నారు. ఇక తనతో పనిలేదనే తాను ఎలాగూ పోటీచేయడానికి ఇష్టపడని చీపురుపల్లిలో పోటీ చేయమని చెబుతున్నారంటూ తన అనుచరుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు గంటా రాజకీయ భవిష్యత్ ఏంటంటూ టీడీపీలో చర్చ జరుగుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…