ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భలే చిత్రంగా ఉంటాయి. అవి ఓ పట్టాన ఎవరికీ అర్ధం కావు. ప్రత్యేకించి తాజాగా కూటమి కట్టిన టిడిపి-బిజెపి-జనసేనల్లో విచిత్ర రాజకీయం నడుస్తోంది. బిజెపి-జనసేనలకు సీట్లు కేటాయించిన చంద్రాబే ఆ రెండు పార్టీల్లో అభ్యర్ధులు ఎవరన్నది తానే నిర్దేశిస్తున్నారని టాక్ నడుస్తోంది. మొదట్నుంచీ బిజెపి, జనసేనలకోసం పనిచేసిన సీనియర్ నేతలను పక్కన పెట్టి రెండు పార్టీల్లోనూ టిడిపి నుండి వలస వచ్చిన వారికే టికెట్లు దక్కేలా చంద్రబాబు పథక రచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు బిజెపిలోనూ ఇటు జనసేనలోనూ కూడా ఒరిజినల్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీకి కేటాయించిన సీట్లలో ఎక్కడెక్కడ ఎవరిని బరిలో దించాలన్నది సహజంగానే చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఏపీలో బిజెపి, జనసేన పార్టీల్లోనూ అభ్యర్ధులు ఎవరన్నది చంద్రబాబు ఇష్టాల ప్రకారమే నిర్ణయాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి చంద్రబాబు చెప్పినట్లే అభ్యర్ధుల ఎంపిక చేపట్టి హై కమాండ్ కు నివేదికలు పంపుతున్నారని ఒరిజినల్ బిజెపి నేతలు భావిస్తున్నారు. ఇటు జనసేనలోనూ చంద్రబాబు నాయుడే చాపకింద నీరులా టిడిపి నుండి నేతలను పంపి వారికే టికెట్లు వచ్చేలా పావులు కదుపుతున్నారని అంటున్నారు.
పొత్తులో భాగంగా బిజెపి ఆరు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది. మొదట్నుంచీ బిజెపిలో ఉన్న సోము వీర్రాజు రాజమండ్రి నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. జివిఎల్ నరసింహారావు విశాఖ సీటుపై దృష్టి సారించి రెండేళ్లుగా విశాఖలోనే ఉంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు.
అయితే ఈ ఇద్దరికీ చెక్ చెప్పేలా పురందేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. టిడిపి నుండి బిజెపిలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరికి టికెట్లు ఖాయం అయ్యేలా పురందేశ్వరి చేత నరుక్కు వస్తున్నారు చంద్రబాబు. పురందేశ్వరి వైఖరితో పార్టీకి మొదట్నుంచీ విధేయంగా ఉన్నవారికి టికెట్ దక్కకుండా కుట్రలు చేస్తోన్నట్లు ఉందని బిజెపిలో ఒక వర్గం భావిస్తోంది.
పురందేశ్వరి పోకడ నచ్చని ఒరిజినల్ బిజెపి నేతలంతా కలిసి రహస్యంగా సమావేశమై పార్టీ హై కమాండ్ కు ఓ లేఖ రాశారని అంటున్నారు. అందులో పురందేశ్వరి టిడిపి నుండి వచ్చిన వలస నేతలకు విలువ ఇచ్చి సంప్రదాయ బిజెపి నేతలను పక్కన పెడుతున్నారని ఆ లేఖలో ఆరోపించినట్లు తెలుస్తోంది.పురందేశ్వరి పట్టు పట్టకపోవడం వల్లనే ఏపీలో బిజెపి బలోపేతం అయ్యేందుకు అవకాశాలు ఉన్నా ఆ దిశగా కార్యక్రమాలు లేవని వారు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపిని కాపాడుకుంటూ బిజెపిని బలహీన పర్చేలా పురందేశ్వరి ఏపీ బిజెపిని నడుపుతున్నారని వారంతా హై కమాండ్ కు కంప్లెయింట్ చేసినట్లు చెబుతున్నారు.
ఇక జనసేన పార్టీలోనూ చంద్రాబు సినిమాయే ఆడుతోందంటున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాలు ఇచ్చారు చంద్రబాబు. మచిలీ పట్నం లోక్ సభ స్థానాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుండి జనసేనలోకి వచ్చిన బాలశౌరికి కేటాయించారు. బాలశౌరి టిడిపిలో చేరడానికి వస్తే చంద్రబాబే నాదెండ్ల మనోహర్ దగ్గరకు పంపి జనసేనలో చేర్పించినట్లు సమాచారం. ఆ విధంగా తన మనిషిని జనసేన తరపున బరిలో దింపాలన్నది ఆయన వ్యూహం అంటున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ టిడిపి నేతలను జనసేనలోకి పంపి వారికి టికెట్లు వచ్చేలా చేస్తున్నారని అంటున్నారు.
భీమవరంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు జనసేనల చేరారు. ఇపుడు భీమవరం టికెట్ ను ఆయనకే కట్టబెట్టారు పవన్ కల్యాణ్. పులపర్తి జనసేనతరపున బరిలో ఉన్నా ఆయన బాబు మనిషే. అలాగే టిడిపి నుంచి జనసేనలో చేరిన గంటా నరహరికి తిరుపతి టికెట్ ఖాయం చేశారు పవన్. నరసాపురంలోనూ టిడిపి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుణ్ని జనసేనలోకి పంపారు చంద్రబాబు. ఆయనకే పవన్ టికెట్ ఇచ్చారు. అనకాపల్లి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న కొణతాల కూడా టిడిపిలో చేరాలనుకుని జనసేనలో చేరిన వారే. మొత్తానికి జనసేన తర్వాతి జాబితా విడుదల అయితే అందులోనూ చంద్రబాబు అనుకున్నవారే ఎక్కువగా టికెట్లు పొందే అవకాశాలున్నాయని అంటున్నారు.కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా.. అందరూ తన మనుషులు ఉంటే చక్రం తిప్పచ్చన్నది బాబు చాణక్యం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…