ఎన్టీఆర్ కు భారతరత్న.. సమయం ఆసన్నమైంది తమ్ముళ్లూ

By KTV Telugu On 23 May, 2023
image

ఎన్టీయార్ కు భారతరత్న అవార్డు పై టిడిపి నేతలు మరోసారి  హడావిడి చేయడం వెనక ఆంతర్యం ఏంటి. ఎన్టీయార్ మరణించిన 27 ఏళ్ల తర్వాత ఇపుడే ఎందుకిలా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో మరోసారి ఎన్టీయార్  పేరును వాడుకోవడమే టిడిపి అజెండానా లేక నిజాయితీగానే భారతరత్న అడుగుతున్నారా. ఏటా ఎన్టీయార్ జయంతి రోజునో లేదంటే మహానాడు సభల సందర్భంగానో మాత్రమే ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ చేసి మిగతా సమయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరారామావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఎన్టీయార్ కుటుంబ సభ్యులతో పాటు సినీ రంగ ప్రముఖులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సహజంగానే వక్తలంతా ఎన్టీయార్ గుణగణాలను ఆయన నటనా వైదుష్యాన్ని కొనియాడారు. అటువంటి యుగపురుషుడు భవిష్యత్తులో పుట్టడని కూడా అన్నారు. ఈ సందర్భంగానే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాల్సిందే అన్నారు. భారత రత్న ఇచ్చే వరకు పోరాడుతూనే ఉందాం అని కూడా అన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్ధులైతే ఎన్టీయార్ కు భారతరత్న అవార్డు విషయంలో చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధే లేదని విమర్శలు చేశారు. 1995లో చంద్రబాబు నాయుడు టిడిపిలో తిరుగుబాటు లేవదీసి ఎమ్మెల్యేలను వైస్రాయ్ లో క్యాంప్ పెట్టి ఎన్టీయార్ నుండి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే ఎన్టీయార్ మరణించారు. 1996 జనవరిలో ఎన్టీయార్ కన్ను మూశారు. ఎన్టీయార్ నుండి పాలనా పగ్గాలు చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు పార్టీ మేనిఫెస్టోలో ఎన్టీయార్ బొమ్మ లేకుండా జాగ్రత్తలు పడ్డారు. దానిపై అప్పట్లో విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ కు భారత రత్న ఇవ్వాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్ గా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ప్రధానులను రాష్ట్రపతులను నేనే నియమించానని చెప్పుకుంటారు. దేవెగౌడ్, గుజ్రాల్ ప్రధానులు కావడానికి తానే కారణమని చెప్పారు. అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతిని చేసింది తానే అన్నారు. 1996లో దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆయన తర్వాత ఐ.కే. గుజ్రాల్ ప్రధాని అయ్యారు. ఈ ఇద్దరూ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోనే ఉన్నారు. అపుడు జాతీయ స్థాయిలో ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబే చక్రం తిప్పారు. ఆ తర్వాత 1999 లో ఏకంగా బిజెపి పొత్తుతోనే ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అందుకు ప్రతిగా టిడిపి నేత బాలయోగిని లోక్ సభ స్పీకర్ చేసుకున్నారు. 2004 వరకు కేంద్రంలో చంద్రబాబు నాయుడి హవా నడిచింది. అంటే 1996 నుండి 2004 వరకు కూడా కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆయన ఏం చెబితే అది చేయడానికి నాటి ప్రధాని వాజ్ పేయ్ సిద్దంగా ఉండేవారని చంద్రబాబే చెప్పుకున్నారు.

జాతీయ రహదారులు అధ్వాన్నంగా ఉంటే మలేషియా, సింగపూర్ లను చూసి తానే ప్రధాని వాజ్ పేయ్ కి చెబితే ఆయన స్వర్ణ చతుర్భుజికి శ్రీకారం చుట్టారని ఇప్పటికీ చంద్రబాబు చెబుతున్నారు. మరి ఆయన ఏం చెబితే అది చేసే పార్టీలు వ్యక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీయార్ కు భారతరత్న అవార్డు ఇప్పించుకోడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. 2004లో కేంద్రంలో ఎన్డీయే గద్దె దిగి యూపీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఎన్టీయార్ తనయ పురంధేశ్వరిని కాంగ్రెస్ లో చేర్చుకున్న దివంగత సిఎం వై.ఎస్.ఆర్. ఆమెను కేంద్రంలో మంత్రిని చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. కేంద్ర మంత్రి హోదాలో పురంధేశ్వరి పార్లమెంటు హాల్ లో ఎన్టీయార్ చిత్ర పటం పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాగలిగారు. కానీ ఎన్టీయార్ కు భారతరత్న అవార్డు మాత్రం సాధ్యం కాలేదు. భారతరత్న అవార్డు విషయంలో చంద్రబాబు నాయుడికి కొంత క్లారిటీ ఉందని అందుకే అది ఎన్టీయార్ కు ఇప్పించుకునేందుకు చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగానే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ ఎన్టీయార్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్రం నిర్ణయిస్తే  ఆ అవార్డును నిబంధనల ప్రకారం ఎన్టీయార్ సతీమణి లక్ష్మీపార్వతికి అందిస్తారు. అంటే ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కుతారు. ఇది చంద్రబాబు నాయుడికి అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబుకే కాదు ఎన్టీయార్ కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఇష్టం లేదు. ఈ ఒక్క కారణంగానే చంద్రబాబు నాయుడు ఎన్టీయార్ కు భారతరత్న అవార్డు కోసం కేంద్రంలో ఎలాంటి ప్రయత్నం చేయకుడా జాగ్రత్త పడ్డారని టిడిపిలో ఎన్టీయార్ వీర విధేయులు అంటున్నారు. తనంతట తాను ఎన్టీయార్ కు అవార్డు ఇప్పించరు. ప్రయత్నం చేయరు. కానీ ఎన్నికలు వచ్చినా ఎన్టీఆర్ జయంతి వచ్చినా ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలంటూ నినాదాలు చేస్తారు చంద్రబాబు. ఇక ప్రస్తుతం ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలను ఆయన భుజాలకెత్తుకుని అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనంత పతనావస్థలో ఉంది. ఆ పార్టీ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఇంత బలహీనంగా ఏనాడూ లేదు. 2024లో   ఎన్నికల్లో పోటీ అంటేనే చంద్రబాబు నాయుడు కంగారు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏపీలో. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 175 నియోజక వర్గాలకు గానూ కేవలం 23 స్థానాలకు పరిమితం అయ్యింది టిడిపి. ఆ తర్వాత నాలుగేళ్లలో జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు వివిధ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ టిడిపి అడ్రస్ గల్లంతయ్యింది. గెలవడం మాట దేవుడెరుగు కనీస పోటీ కూడా ఇవ్వలేక డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పటికీ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగానే ఉంది. స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు లోకేష్ పోటీ చేస్తోన్న మంగళగిరిలో సైతం పార్టీ ప్రమాదకర స్థితిలో ఉందని సర్వేలు చెబుతున్నాయి.

ఈక్రమంలోనే ఒంటరిగా పోటీ చేసే శక్తి లేక పొత్తులకోసం తాపత్రయ పడుతున్నారు చంద్రబాబు. ఆక్రమంలోనే జనసేన వెంటపడి పొత్తు ఖరారు చేసుకున్నారు. బిజెపితో పొత్తు కోసం వెంపర్లాడుతోన్నా బిజెపి అగ్రనేతలు వద్దంటున్నారు. అయినా చంద్రబాబు తన ప్రయత్నాలు ఆపలేదు. ఈ పొత్తులతో పాటు జనంలో టిడిపి దూసుకుపోవాలంటే ఎన్టీయార్ పేరు ఒక్కటే తారక మంత్రమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే అటకెక్కించిన నందమూరి తారకరామారావు జ్ఞాపకాలను కిందకు దించి బూజులు దులిపి ప్రజలకు గుర్తుచేసే పనిలో పడ్డారు చంద్రబాబు. ఎన్టీయార్ ను పదవి నుండి తప్పించిన కొత్తలో  ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు ఎన్టీయార్ ను ఉద్దేశించి ఏ మాత్రం విలువలు, నైతికత లేని మనిషి అంటూ ఎన్టీయార్ ను ఈసడించుకున్నారు. 1999 ఎన్నికల్లో ఎన్టీయార్ ఫోటో లేకుండానే బిజెపి కార్గిల్ విజయం మానియా అండతో పోటీ చేశారు. అపుడు అవసరం లేకపోయిన ఎన్టీయార్ ఫోటో 2004 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంతో అవసరం అనిపించింది. 2009 ఎన్నికల్లో ఎన్టీయార్ జపం చేస్తూ ఆయన మనవడు జూనియర్ ఎన్టీయార్ చేత రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించుకుని ఎన్నికల బరిలో దిగారు. అయితే వై.ఎస్.ఆర్. ప్రభంజనం ముందు అవేవీ పనిచేయలేదు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో సమీకరణలు మారాయి. ఈ సారి నరేంద్ర మోదీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగారు. బిజెపి వేవ్ లో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 2018 వరకు తిరిగి ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారు. కేంద్రంలో ఇద్దరు టిడిపి ఎంపీలు మంత్రులుగా ఉంటే రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. ఈ నాలుగేళ్ల లోనూ కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న చంద్రబాబు నాయుడు పోలవరం కాంట్రాక్టు పనులు తమవారికి ఇప్పించుకోడానికి జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని తమకి అప్పగించాల్సిందిగా ప్రాధేయపడి సాధించుకున్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. కనీసం ఈ నాలుగేళ్లలో సైతం ఎన్టీయార్ కు భారతరత్న అవార్డు ఇప్పించుకునే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు నాయుడు. నిజంగా ఆయన పట్టుబట్టి ఉంటే మోదీ ప్రభుత్వం ఎన్టీయార్ కు భారతరత్న అవార్డును ఇచ్చేదే అంటారు బిజెపి సీనియర్లు. తాను అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న ఊసెత్తలేదు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆయర్ పేరు అవసరమైనప్పుడు మాత్రమే ఎన్టీయార్ కు భారతరత్న కావాలంటూ నినాదాలు చేస్తూ ఉంటారని ఎన్టీఆర్ కు వీర విధేయులైన సీనియర్ నేతలు కొందరు ఆక్షేపిస్తున్నారు. 2024 ఎన్నికల వరకు ఎన్టీయార్ పేరు అవసరం కాబట్టే ఆయన ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు తప్ప అంతకు మించి ఆయనకు ఎలాంటి చిత్తశుద్ధీ లేదంటున్నారు రాజకీయ పండితులు.