ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కైకలూరు ఇంఛార్జ్ వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అలయన్స్‌పై జోరుగా ప్రచారం జరగుతున్న తరుణంలో తమకు టికెట్ రాదని భావిస్తున్న కొందరు గోడ దూకేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడంతో కైకలూరు టీడీపీ ఇంచార్జ్ జయమంగళ వెంకటరమణ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. మంత్రి కారుమూరి ఆయనతో మంతనాలు జరిపారు. ప్రభుత్వం వెంకట రమణకు రాత్రికి రాత్రే నలుగురు గన్ మెన్‌లను కేటాయించింది ప్రభుత్వం. స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న 8 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి వెంకటరమణకి కేటాయించనున్నారని తెలుస్తోంది. వెంకటరమణ జంప్‌తో స్థానికంగా టీడీపీ బలహీనపడుతుందని వైసీపీ అంచనా వేస్తోంది.
ఎన్నికలకు ముందు ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఆయా పార్టీలు పక్కా వ్యూహంతో వెళ్తున్నాయి. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో జగన్‌ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు ఎత్తుగడ వేస్తే దీనికి కౌంటర్‌గా టీడీపీకి బలం ఉన్న క్రిష్ణా జిల్లా లో వైసీపీ కొత్త ప్లాన్ రెడీ చేసింది. టీడీపీకి చెందిన నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు అధికార పార్టీతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే కొందరి టికెట్‌కు ఎసరు పడుతోంది. దాంతో ముందే కొందరు సేఫ్ ప్లేస్ చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ దక్కదనే ఆలోచనతోనే వెంకటరమణ వైసీపీ వైపు చూసినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
గత ఎన్నికల్లో కైకలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు విజయం సాధించారు. అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా మరోసారి ఆయన ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. 2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా జయమంగళ వెంకటరమణ గెలుపొందారు. 2014లో పొత్తుల్లో భాగంగా కైకలూరు సీటును బీజేపీకి కేటాయించారు. అక్కడ బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన కామినేని శ్రీనివాస్ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. ప్రస్తుతం కైకలూరులో క్రీయాశీలకంగా వెంకటరమణ ఉన్నారు. అయితే అధికారికంగా నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల కేటాయింపులో ఆలస్యం జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే జయమంగళ టీడీపీకి మంగళం పాడుతున్నారు.