చంద్రబాబుపై టీడీపీ ఆగ్రహం.. అలా ఎవరైనా రాసినా.. మాట్లాడిన ఆ మాట వినడానికి విడ్డూరంగా ఉంది. అందులో ఏదో తప్పు ఉందనిపిస్తుంది. తెలియక రాశారో, కావాలని రాశారోనని అనుమానించాల్సి వస్తుంది. కసి కొద్ది రాశారని కూడా అనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షంలో విభేదాలు సృష్టించడానికి రాశారని కూడా అనుకోవచ్చు.కాకపోతే చంద్రబాబుపై టీడీపీలో చాలా మందికి ఒక ఉదుటున కోపం వచ్చిన మాట వాస్తవం.వరుస పరిణామాలే ఇందుకు కారణం కావచ్చు. పైగా టీడీపీ హార్డ్ కోర్ కు షాకిచ్చే పరిణామాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి..
చెరువు నిండింది కప్పలు చేరుతున్నాయి.. ఇదీ బుధవారం టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో వినిపించిన కామెంట్. దానికి పెద్ద కారణమే ఉంది. ఒకప్పుడు చంద్రబాబును అనరాని మాటలు అంటూ ఒక దశలో విపరీతమైన విమర్శలు చేసిన నాయకులు ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి రావడం ఆ పార్టీలో చాలా మందికి అసలు నచ్చలేదు. అలాంటి వారిని ఎందుకు చేర్చుకున్నారని చంద్రబాబును డైరెక్టుగా నిలదీయలేక ఇప్పుడు ఆయనపై కారాలు మిరియాను నూరుతున్నారు. పచ్చగా ఉన్న చోట మేసి, వెచ్చగా ఉన్న చోట పడుకుని.. ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వస్తామంటే ఎందుకు చేర్చుకోవాలన్నది టీడీపీని అభిమానించే వారి ప్రశ్న. ఇప్పటి వరకు పార్టీలోంచి కదలకుండా ఒక్క పదవి కూడా పొందకుండా అవకాశవాద రాజకీయాలకు ప్రతిరూపంగా నిలిచిన వారిని వదిలేసి ఆయా రామ్, గయా రామ్ బ్యాచ్ కు ఎందుకు ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించాలని సగటు టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరపున నిర్వహించే సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న మాట..
ఇటీవలి కాలంలో వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదు. రాజకీయాల్లో కనిపించి కనిపించకుండా ఉండిపోయి చాలా రోజులైంది. అధికారపక్షం పంచన చేరి పదవులు అందుకోవడం మినహా ప్రజా నాయకులుగా వాళ్లు పేరు తెచ్చుకున్న సందర్భమూ లేదు.ఐనా సరే వారికి చంద్రబాబు ఎందుకు పచ్చ కండువా కప్పారన్నది టీడీపీ శ్రేణుల నుంచి సైతం వినిపిస్తున్న ప్రశ్న. కష్టకాలంలో పార్టీ వైపు చూడకుండా ఇప్పుడు వచ్చిన వాళ్లందరినీ ఎందుకు ఆహ్వానించాలన్నది కూడా వారి ప్రధాన ప్రశ్న..
వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య, ఒకప్పుడు టీడీపీలో వెలుగు వెలిగి వైసీపీలో చేరిన ఉత్తరాంధ్ర నేత దాడి వీరభద్రరావు బుధవారం మళ్లీ టీడీపీలో చేరారు. ద్వారకానాథ్ రెడ్డి అప్పుడెప్పుడో ఎమ్మెల్యేగా చేయడం మినహా పెద్దగా సాధించిందేమీ లేదు. విజయసాయి రెడ్డి బావమరిది అన్న గుర్తింపు తప్పితే పక్కింటోళ్లు కూడా గుర్తించలేని రోజులు ఆయనకు వచ్చేశాయి. అలాంటి వారిని చేర్చుకుని అదనపు లగేజీ మోయడం మినహా సాధించేదేమిటన్నది టీడీపీలో ప్రతి ఒక్కరు వేస్తున్న ప్రశ్న. చేరికలతో ఏదో మైంగ్ గేమ్ ఆడాలనుకోవడం మంచిదే కానీ, మరీ కాలం చెల్లిన నేతలను చేర్చుకోవడమేంటని గట్టిగానే యూట్యూబ్, ట్విటర్, ఇన్ స్తాగ్రామ్ వేదికగా టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అంతకు మించి సి. రామచంద్రయ్యను చేర్చుకోవడం టీడీపీ కేడర్ కు ఏ కోశానా ఇష్టం లేదు. టీడీపీలో పుట్టిన ఉమ్మడి కడప జిల్లా నేత రామచంద్రయ్య..మంత్రిగా చేశారు. చంద్రబాబు ఆయనకు రెండు పర్యాయాలు రాజ్యసభ ఇచ్చారు. మూడో సారి పదవి రాదని గుర్తించి చిరంజీవి స్థాపించిన పీఆర్పీలో చేరారు. అక్కడ నుంచి వైసీపీ గూటికి చేరి మూడు సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు వైసీపీ ఓటమి ఖాయమని తెలిసి .. చల్లగా టీడీపీ కండువా కప్పుకున్నారు.తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు టీడీపీలోకి వస్తున్న రామచంద్రయ్య ఒకప్పుడు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకుడు. అలాంటి వ్యక్తిని చేర్చుకోవడంపై పార్టీలో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక దాడి వీరభద్రరావు కూడా ఒకప్పుడు టీడీపీలో అన్ని పదవులు అనుభవించారు. తర్వాత అవకాశం కోసం వైసీపీలో చేరితే జగన్ ఆయన్ను పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ గెలుస్తోందనే ఆయన వచ్చారు. అందుకే ఇలాంటి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులను చేర్చుకోకూడదని టీడీపీ విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది.
చంద్రబాబు లెక్కలు వేరే ఉండొచ్చు. జగన్ ను అన్ని వైపుల నుంచి ఇబ్బంది పెట్టాలన్న కోరిక ఆయనకు ఉండొచ్చు. ఐనా సరే కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సి అనివార్యత కూడా ఉంది. చేర్చుకున్న వారికి ఎలాంటి షరతులు పెట్టారో కూడా ఇంకా తెలియలేదు. ఏదేమైనా మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యమిచ్చి తర్వాతే బయట నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలన్న ప్రస్తావన వస్తోంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…