వైసీపీ సంక్షోభం, టీడీపీకి వరప్రసాదం

By KTV Telugu On 8 January, 2024
image

KTV TELUGU :-

విచిత్ర  పరిస్థితుల నుంచి టీడీపీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీల్లో కీలక నేతలంతా అసెంబ్లీకే పోటీ చేస్తామని  భీష్మించుకు కూర్చోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న తరుణంలో కాగల కార్యం గంధర్వులు  నిర్వర్తించినట్లుగా వైసీపీలో నెలకొన్న సంక్షోభం ఇప్పుడా పార్టీకి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంది. ఏడాదిగా ఎంపీ అభ్యర్థుల కోసం టీడీపీ వేట కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లోనే చాలా మంది వైసీపీ ఎంపీలు ముఖ్యమంత్రి జగన్ మీద అలిగి పక్క చూపులు  చూస్తున్నారు. వారంతా చంద్రబాబు చిటికేసి పిలిస్తే వైసీపీ  వైపుకు వచ్చేందుకు  సిద్ధంగా ఉన్నారని సమాచారం..

నిజానికి లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం  పాలైంది. 25  స్థానాల్లో కేవలం మూడు చోట్ల గెలిచింది. అదీ కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఉన్న విజయవాడ, గుంటూరులో గెలిచింది.  కింజారపు రామ్మోహన్ నాయుడు మంచి అభ్యర్థి కావడంతో శ్రీకాకుళంలో గెలిచింది. మిగిలిన 22 స్థానాల్లోనూ ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ పై పార్టీ శ్రేణులకు ఆసక్తి తగ్గింది. అందరూ ఏపీలో జగన్ ను దించేసే  ప్రక్రియపైనే దృష్టి  పెట్టారు. పైగా లోక్ సభ సభకు వెళ్లడం కంటే అసెంబ్లీ బరిలోకి దిగి గెలిస్తే రాష్ట్ర మంత్రి కావచ్చన్న ఫీలింగ్ ఆ పార్టీ శ్రేణుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దానితో లోక్ సభ అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు కత్తిమీద సాములా పరిణమించింది. ఎవరిని  ఎంపిక చేయాలి, ఎంపిక ప్రక్రియ ఎలా చేపట్టాలనే అంశాలపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు..

వైసీపీలో మాగుంట ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా  సాగింది. జగన్ ఆయన్ను పిలిపించి 140 కోట్ల రూపాయలు డిపాజిట్  చేయాలని ఆదేశించారు. పైగా చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని కూడా ఆదేశించారు. అందుకు ససేమిరా అన్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఆలోచనలో పడిపోయిన రెండు రోజులకే ఇక ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చే ప్రస్తావనే  లేదని బాలినేని  దగ్గర జగన్ తెగేసి చెప్పారు. అదీ మాగుంటకు ప్రయోజనం కలిగించిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన ముందుగానే పక్క  చూపులు  చూస్తున్నారు. ఇప్పుడు టీడీపీతో టచ్  లోకి వెళ్లిన మాగుంట  అదే ఒంగోలు లోక్ సభా నియోజకవర్గం నుంచి  చంద్రబాబు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆ క్రమంలో  చంద్రబాబుకు ఒక అభ్యర్థి దొరికినట్లయ్యింది…

ఇక నరసరావుపేట ఎంపీ  లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇప్పుడు వైసీపీని వీడే ఉద్దేశంలో ఉన్నారు. ఆయనకు  కూడా మాగుంటకు పెట్టిన షరుతులనే జగన్  పెట్టారు. తాను ఎలాంటి దందాలు చేయడం లేదని 140 కోట్లు జమ చేయడం తన వల్ల కాదని కృష్ణదేవరాయలు తెగేసి చెప్పారు. పైగా  గుంటూరు నుంచి పోటీ చేయాలని లావును జగన్ ఆదేశించారు. ఆయనకు టీడీపీ  నుంచి ఆఫర్లు వస్తున్నట్లుగా వార్తలు ఉన్నాయి. గుంటూరులో పోటీ చేసేందుకు ఇష్టపడని లావు…. నరసరావుపేట నుంచి టీడీపీ తరపున  పోటీ చేయబోతున్నారు. గుంటూరు నుంచి సిట్టింగ్  ఎంపీ గల్లా జయదేవ్ పోటీ చేయని పక్షంలో ఆ స్థానాన్ని  బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరికి కేటాయించే  ప్రతిపాదన తెరమీదకు వచ్చింది…

రెండు మూడు సంవత్సరాలుగా నరసాపురం ఎంపీ రఘురామ  కృష్ణరాజు వ్యవహారం  నడుస్తోంది. వైసీపీలో ఉంటూనే జగన్ కు వ్యతిరేకంగా ఆయన రచ్చరచ్చచేస్తున్నారు. ఆయనకు టీడీపీ తరపున నరసాపురం  టికెట్ ఖాయమని చెబుతున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు ముగ్గురు ఎంపీలు కూడా ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి టీడీపీకి ఎంపీ అభ్యర్థుల  కరువు తీరినట్లేనని చెప్పుకోవాల్సి ఉంటుంది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి