ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న టిడిపి సీనియర్లు ఎన్డీఎ కోటాలో గవర్నర్ పదవులవైపు ఆశగా చూస్తున్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా టీడీపీ నేతలు పదవులు లేక అల్లాడిపోయారు. ఇప్పుడు కేంద్రంలో కూడా టీడీపీ మద్దతుతోనే ఎన్డీఏ సర్కార్ ఏర్పడటంతో పదవులపై కన్నేశారు. ముఖ్యంగా టీడీపీలోని ఇద్దరు సీనియర్లు గవర్నర్ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఒక్కరికే పదవి వస్తుందనే టాక్ నడుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో గవర్నర్ పదవులపై జోరుగా చర్చ సాగుతోంది. సీనియర్ నాయకుల్లో ఒకరికి గవర్నర్ పదవి వస్తుందంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్డీఎలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉండటంతో పార్టీలోని సీనియర్ నాయకులు కీలక పదవులను ఆశిస్తున్నారు. ముఖ్యంగా కొందరు సీనియర్లు గవర్నర్ పదవిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్లు టిడిపిలో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇద్దరు సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాలకి దూరమై తమ వారసులను అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దించి విజయం సాధించారు.
చంద్రబాబు టిడిపి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ఇద్దరూ ఆయనకు అత్యంత సన్నిహితులుగా కొనసాగుతున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు 1983లో టీడీపీ ఏర్పడినపుడు రాజకీయాల్లోకి వచ్చి 2004 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ పాలనలో కీలకమైన మంత్రి పదవులతో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవి కూడా నిర్వహించారు. యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉన్నపుడే 1995 టిడిపి సంక్షోభం ఏర్పడింది. ఆనాడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వైపు కాకుండా తిరుగుబాటు చేసిన చంద్రబాబు వైపు నిలిచి ఆయన ముఖ్యమంత్రి కావడానికి దోహదపడ్డారు. అప్పటినుంచి చంద్రబాబుకి దగ్గరయ్యారు.
2009లో తొలిసారి ఓటమి చవి చూసిన యనమల రామకృష్ణుడు అప్పటినుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు. 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికై మళ్లీ చంద్రబాబు క్యాబినెట్ లో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయన రాజ్యసభ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికలలో తుని నియోజకవర్గంలో గతంలో రెండు సార్లు పోటీ చేసిన ఓడిన తన సోదరుడు యనమల కృష్ణుడు బదులు తన కూతురు దివ్యను రంగంలోకి దించి గెలిపించుకున్నారు.
టిడిపి అధికారంలోకి రావడంతో యనమలకి మళ్లీ క్యాబినెట్ లో కీలక పదవి లభిస్తుందని టిడిపి వర్గాలు భావించాయి. అయితే యనమల సీనియారిటీకి తగిన విధంగా కీలకమైన పదవి ఇవ్వడానికే చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యనమలను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు టిడిపిలో చర్చ జరుగుతోంది. ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకమైన పార్టీ కావడంతో ఒక గవర్నర్ పదవి తీసుకోవాలని టిడిపి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యనమల కూడా గవర్నర్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఉత్తరాంధ్రలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన అశోక్ గజపతి రాజు కూడా గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అశోక్ గజపతి రాజు 1978లో తొలిసారి జనతాపార్టీ అభ్యర్థిగా విజయనగరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో కీలక పదవులు అనుభవించారు. 2014 లో విజయనగరం నుంచే పార్లమెంట్‌కు ఎన్నికై మోదీ తొలి ప్రభుత్వంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు.
ఈ సారి కూడా ఆయన పోటీ చేయకుండా తన కుమార్తె ఆదితి గజపతిరాజుని రంగంలోకి దింపి గెలిపించుకున్నారు.
అటు యనమల…ఇటు అశోక్ గజపతిరాజులలో ఒకరికి గవర్నర్ పదవి ఖాయమని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజుకి గవర్నర్ అవకాశం రాకపోతే రాజ్యసభకైనా పంపవచ్చని ప్రచారం జరుగుతోంది. సిఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీ వద్ద టిడిపికి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో టిడిపికి రెండు మంత్రి పదవులు దక్కాయి.
ఉత్తరాంద్రకి చెందిన రామ్మోహననాయుడికి పౌరవిమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ పదవి దక్కింది. తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి గుంటూరు ఎంపిగా గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కూడా సహాయ మంత్రి పదవి లబించింది. మోదీ క్యాబినెట్ విస్తరణలో మరో సహాయమంత్రి పదవి వస్తుందని టిడిపి అంచనా వేస్తోంది. అదేవిధంగా సీనియర్ల కోరిక తీరేవిధంగా గవర్నర్ పదవి కోసం కూడా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…