ఎప్పటినుంచో రాజకీయాల్లో వున్న కుటుంబాలను రాజకీయాల్లో దిగ్గజ కుటుంబాలని అంటారు.
రకరకాల బలాలు బలగాలతో తమ తమ నియోజకవర్గాల్లో ఆయా దిగ్గజ కుటుంబాలు వేళ్లూనుకొనిపోయి వుంటాయి.
ఆయా నియోజకవర్గాల్లో ఆ దిగ్గజ కుటుంబాలు చెప్పిందే వేదం, చేసిందే త్యాగమన్నట్టుగా పరిస్థితి వుంటుంది.
కర్నూలు జిల్లాకు చెందిన అలాంటి దిగ్గజ రాజకీయ కుటుంబాల నేతల్లోనూ, వారి అనుచరుల్లోనూ అసంతృప్తి ఎగిసిపడుతున్నట్టు పొలిటికల్ టాక్.
రాష్ట్రంలో టిడిపి ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు 24 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారికి మంత్రి పదవులను కేటాయించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎన్ ఎండీ ఫరూక్‌లకు మంత్రి పదవుల లభించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురికి మంత్రి పదవుల కేటాయింపు జరగ్గానే అంతవరకూ ఆ పదవులను ఆశించిన^నేతల్లో అసంతృప్తి మొదలైనట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన దిగ్గజ కుటుంబాలకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ విజయానికి దోహదం చేసిన పొలిటికల్‌గా సీనియర్లయిన నేతలకు మొండి చేయి చూపించారని ఆయా దిగ్గజ కుటుంబాల నేతలు, అనుచరులు మండిపడుతున్నట్టు జిల్లాలో టాక్. కర్నూలు ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాలు ఉంటే రెండు ఎంపీ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ విజయం సాధించిన వారిలో కోట్ల కుటుంబానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి .. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు, గౌరు వెంకటరెడ్డి సతీమణి గౌరు చరిత, మాజీ ఎంపీ దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ, మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి కుమారుడు బీవీ జయ నాగేశ్వర రెడ్డి ఉన్నారు.
వీరిలో కోట్ల, కేఈ కుటుంబాల తో పాటు భూమా కుటుంబాలకు మంత్రి పదవులు వస్తాయని ఆయా కుటుంబాల అనుచరులతోపాటు రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా కొత్త వారికి అవకాశం కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్ కు మంత్రి పదవులు దక్కాయి.
దీంతో మంత్రి పదవుల పై ఆశ పెట్టుకున్న దిగ్గజ కుటుంబ సభ్యులు, వారి వారసులు తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది.
తమ అనుచరుల ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం చివరి వరకు ప్రయత్నం చేసినా.. అధినేత మాత్రం కొత్తవారి వైపు మొగ్గు చూపడం పై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఎప్పటినుంచో రాజకీయాల్లో వుంటూ సీనియారిటీ పుష్కలంగా వున్నవారిని పక్కనపెట్టడంపట్ల ఆయా దిగ్గజ కుటుంబాలు రగిలిపోతున్నట్టు జిల్లా రాజకీయావర్గాల్లో చెప్పుకుంటున్నారు.
నారా లోకేష్ పాదయాత్ర సమయంలో బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ అన్ని రకాలుగా సహకరించినట్టు తెలుస్తోంది.
దీంతో ఆ కృతజ్ఞతతో పాటు భవిష్యత్తులో లోకేష్ రాజకీయ భవిష్యత్తు బలపడాలంటే సీనియర్లవల్ల ఇబ్బంది వస్తుందని, అందుకనుగుణంగా మంత్రివర్గ సభ్యులను ఎంపిక చేశారని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి పదవుల కేటాయింపు పై ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన దిగ్గజ కుటుంబాల నేతలు, వారి నుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అసంతృప్తి చివరకు ఎంత వరకు దారి తీస్తుందో తెలియాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…