పులివెందుల కోటకు బీటలు

By KTV Telugu On 23 March, 2023
image

పులివెందుల పేరు చెప్పగానే గుర్తొచ్చేదీ వైఎస్సార్ కుటుంబం. జగన్ తాత రాజారెడ్డి కాలం నుంచి పులివెందుల గడ్డ వైఎస్ కుటుంబం అడ్డాలాగే ఉండేది. అక్కడ ఓటమి ఎరుగని నేతలుగా ఆ కుటుంబానికి పేరుంది. ఇప్పుడు మాత్రం సీన్ మారిపోతోంది. జగన్ అధికారానికి వచ్చి 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న నేపథ్యంలోనే పులివెందుల క్రమంగా చేజారిపోయే ప్రమాదం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం సహా అన్ని నియోజకవర్గాలు గెలిచి తీరుతామంటూ వైనాట్ 175 అని జగన్ నినాదం ఎత్తుకున్న రోజు నుంచే పులివెందులలో అంతర్గీనంగా కదలిక మొదలైందనే చెప్పాలి.

కడప జిల్లాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పులివెందుల ఇప్పుడు హాట్ టాపిక్. విపక్ష టీడీపీ ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ అక్కడ క్రమంగా నరుక్కుంటూ వస్తోంది. ఇప్పటి వరకు ఒక్క సారి మాత్రమే పులివెందులలో దెబ్బతిన్న వైఎస్ కుటుంబానికి ఇప్పుడు మాత్రం వరుస పరాజయాలు తప్పదనిపిస్తోంది. గతస్ధానికసంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివే కానందరెడ్డిపై పులివెందులకు చెందిన టిడిపి నేత బిటెక్ రవి గెలిచారు. ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన బీటెక్ రవి పులివెందులలో టీడీపీని అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. అక్కడ పార్టీ నిర్మాణం కూడా ఆయనే చూసుకుంటున్నారు. పులివెందుల చరిత్రలో వైఎస్ కుటుంబంపై గెలిచిన వ్యక్తిగా బీటెక్ రవి రికార్డులకెక్కారు.

తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పులివెందులకే చెందిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పట్జబద్రుల ఎమ్మెల్సీగా విజయంసాధించి పులివెందుల నడిబొడ్డు పూలంగళ్ల సర్కిల్లో మరోసారి టిడిపిజెండాను ఎగురవేశారు. జగన్ కోటలో టీడీపీ సత్తా చాటారు. పైగా పులివెందులలో ఏడు వేల ఓట్లు పోలైతే అందులో నాలుగు వేలు టీడీపీ అభ్యర్థికి పడ్డాయని అనధికార సమాచారం. ఈ క్రమంలో చంద్రబాబు చేత శభాష్ అనిపించుకోవడమే కాకుండా అంతంకాదిది ఆరంభం అన్న నినాదాన్ని మొదలు పెట్టారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పులివెందుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యానర్లు జెండాలు మాత్రమే ఉండేవి. ఇతర పార్టీలకు చెందిన పతాకాలు మాత్రం కనిపించేవి కాదు. ఇతర పార్టీలు ధైర్యం చేసేవి కాదు. ఇప్పుడు మాత్రం టీడీపీ నేతలు పోటీ పడి జెండాలు ఎగురవేస్తున్నారు. రాంగోపాల్ రెడ్డి గెలిచిన వెంటనే వెలిసిన టీడీపీ బ్యానర్లు చూసి పులివెందుల జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకాలానికి వైఎస్ కుటుంబానికి పోటీ వచ్చిందని చెప్పుకుంటున్నారు.

కుటుంబ పరంగానూ జగన్ రెడ్డికి చుక్కెదురవుతోందనే చెప్పాలి. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. హూ కిల్డ్ బాబాయ్ అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ లాంటి టీడీపీ నినాదాలు జనంలోనే కాకుండా వైఎస్ కుటుంబంపైనా బాగానే పనిచేశాయి. వైఎస్ వివేకా వర్థంతి రోజున వేసిన బ్యానర్లలో ఎక్కడా జగన్ ఫోటో కనిపించలేదు. వైఎస్ సునీత ఈ బ్యానర్లు వేయించారని చెబుతుండగా ఇలా జరిగిందేమిటబ్బా అని పులివెందుల జనం చర్చించుకుంటున్నారు. ఏదేమైనా టీడీపీ దూసుకెళ్తోంది వచ్చే ఎన్నికల్లో గెలిచే ధీమాతో ముందుకెళ్లోంది దాని ప్రభావం పులివెందులపై కూడా ఉండొచ్చు. అందుకే వైనాట్ పులివెందుల అన్న నినాదం ఇప్పుడు ఆకర్షనీయంగానే ఉంది.