పవనే సిఎం అభ్యర్ధా?

By KTV Telugu On 7 February, 2023
image

ఏపీలో వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ పేరును ప్రకటించనుందా. పవన్ గ్లామర్ తో అధికారంలోకి వచ్చాక తమదైన స్టైల్లో చక్రం తప్పిచ్చని అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు వ్యూహరచనచేస్తున్నారు. రాజగురువు జోక్యంతోనే ఇటువంటి ఆలోచన పురుడు పోసుకుందా అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి రానీయకుండా నిలువరించాలంటే విపక్షాలన్నీ పొత్తులతోనే కలసి కట్టుగా ముందుకు వెళ్లాలని చెబుతోన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే జనసేన తో పొత్తు గురించి టిడిపి, జనసేన శ్రేణులకు క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు నాయుడు అధికారం కోసం నిబంధనలను ఎలాగైనా మార్చుకోడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచీ ఆశీస్సులు ఇస్తూ వెన్ను దన్నుగా నిలుస్తోన్న అగ్ర పత్రిక కొంత కాలం క్రితం ఏపీ అంతటా విస్తృతంగా సర్వే నిర్వహించిందట. ప్రతీ నియోజక వర్గంలోనూ పెద్ద సంఖ్యలో ప్రజల అభిప్రాయాలను సేకరించేలా సర్వే ప్రణాళిక రూపొందించారు. రక రకాల ప్రశ్నలతో ప్రజల మనసులను జల్లెడ పట్టేసే విధంగా అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించారట. సర్వే నివేదికలు సిద్ధం అయిన వెంటనే ఆ పత్రికాధిపతి చంద్రబాబు నాయుణ్ని పిలిపించి సుదీర్ఘంగా భేటీ అయ్యారట.

రాష్ట్రంలో ఎక్కడా కూడా టిడిపికి సానుకూల పవనావలు లేవని సర్వేలో తేలడంతో ఖంగుతిన్న పత్రికాధిపతి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను దెబ్బతీయాలంటే మరో వ్యూహంతో ముందుకు పోవాలని బాబుకు నూరిపోశారట. యువతలో పవన్ కళ్యాణ్ కు ఉన్న గ్లామర్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారట. జనసేనకు 50 నియోజక వర్గాలు కేటాయించడంతో పాటు పవన్ కళ్యాణ్ నే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికలకు ముందే ప్రకటించాలన్నది అసలు వ్యూహం. పవన్ ను సిఎంని చేస్తామని జనంలోకి వెళ్తే కాపు సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా కూటమికి పడతాయన్నది వారి వ్యూహం. కమ్మ, కాపు ఓట్లకు తోడు ఇతర బీసీ ఎఎస్సీ ఎస్టీలను ఎన్నికల లోపు మంచి చేసుకునే ప్రయత్నం చేస్తే కచ్చితంగా అధికారంలోకి రావచ్చునని పత్రికాధిపతి చెప్పారట.

కూటమి అధికారంలోకి వచ్చే వరకు సంయమనంతో ఉంటే అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఎప్పుడైనా మెజారిటీ ఎమ్మెల్యేలు టిడిపి వాళ్లే ఉంటారు కాబట్టి పవన్ ను తప్పించి చంద్రబాబే ముఖ్యమంత్రి కావచ్చునన్నది ప్లాన్ లోభాగం.
నిజానికి ఇటువంటి ఒప్పందాలకు ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయరు చంద్రబాబు. మరి పత్రికాధిపతి సలహాను ఆయన ఎలా తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారిందంటున్నారు పార్టీలో సీనియర్లు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడికి ప్రజల్లో విశ్వసనీయత పూర్తిగా క్షీణించిందని ఆయన హామీలు ఇస్తారు కానీ అమలు చేయరన్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందంటున్నారు. టిడిపి-జనసేనల మధ్య ఓట్ల బదలీ నిజాయితీగా నిక్కచ్చిగా జరిగితే అధికారం నూటికి నూరు శాతం ఖాయమన్న భావనతో వారు ఉన్నట్లు సమాచారం.

పత్రికాధిపతి చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తారా లేక మొదటి రెండున్నర ఏళ్లు తాను సిఎంగా ఉండి చివరి రెండున్నరేళ్లు పవన్ ను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటిస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
టిడిపి జనసేన పంచాయితీ పూర్తిగా తేలిపోతే ఎలాగో ఒకలాగ నందమూరి వంశీకుడు జూనియర్ ఎన్టీయార్ ను బతిమాలి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేయాలన్నది పత్రికాధిపతి ఆలోచన. దానికి చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించారట. కాకపోతే 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ను ఆ తర్వాత పార్టీకి దూరం పెట్టిన నేపథ్యంలో ఇపుడు ఆయన్ను పిలిస్తే ప్రచారానికి వస్తారా అని చంద్రబాబు అనుమానిస్తున్నారట. హరికృష్ణ తనయ సుహాసినికి 2018 ఎన్నికల్లో కూకట్ పల్లి టికెట్ ఇస్తే జూనియర్ ఎన్టీయార్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ప్రచారానికి రాకపోవడాన్ని చంద్రబాబు ప్రస్తావించారట. అయితే గతం గతః ఇప్పటి ప్రయత్నాలు ఇప్పుడు మళ్లీ చేయాల్సిందేనని పత్రికాధిపతి సెలవిచ్చారట.

పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే మాత్రం జనసైనికుల జోష్ ను ఆపడం ఈ భూమ్మీద ఎవరి తరం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ప్రచారం నుంచే పవన్ ను వారు సిఎంగా చూడ్డం మొదలు పెడతారని వారంటున్నారు. పవన్ ను సిఎం కేండిడేట్ గా ప్రకటించి నాకూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి పేదల జీవితాలు మార్చి చూపిస్తాను అన్న హామీని హోరెత్తిస్తారని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే నందమూరి కుటుంబం ఎలా స్పందిస్తుందన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు అదే సమయంలో టిడిపిలో మొదటి నుంచీ ఉన్న సీనియర్లు ఈ డీల్ కు మోకాలడ్డే అవాకశాలున్నాయంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం టిడిపికి ఉంటే జనసేనకు పట్టం కట్టడం ఏంటని వారు నిలదీసే అవకాశాలున్నాయంటున్నారు. 40శాతం దాకా ఓటు బ్యాంకు పదిలంగా ఉన్న టిడిపి ఆరేడు శాతం ఓటు బ్యాంకు ఉన్న పవన్ కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే నలుగురూ నవ్విపోతారని వారంటున్నారు. చంద్రబాబును పిలిపించిన కొద్ది రోజుల ముందే పవన్ కళ్యాణ్ ను కూడా ఆ పత్రికాధిపతి పిలిపించి మాట్లాడారట. అప్పుడు ఏయే అంశాలు చర్చకు వచ్చాయో ఏమేం డీల్స్ తెరపైకి వచ్చాయో తెలీదు.