అనుకున్నదేగా.. ఒంటరి పోటీకి గుండె సరిపోవడంలేదు!

By KTV Telugu On 9 January, 2023
image

టీడీపీ బలంగా ఉంది. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తుంది. ఇదేంఖర్మంటూ జనంలో తిరుగుతున్న చంద్రబాబు పదేపదే చెబుతున్న మాటిది. ఒక్క ఛాన్సివ్వండి, రాష్ట్ర రూపురేఖలు మార్చేస్తానంటూ అటు గబ్బర్‌సింగ్‌ నోటినుంచి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ వస్తున్నాయి. వారాహి పేరుతో ఆర్మీ తరహా వాహనాన్ని కూడా రెడీచేసుకుని ఈసారి ఒక్కడే తాడోపేడో తేల్చేసుకుంటాడన్నంత ఎమోషన్‌ క్రియేట్‌ చేశారు. జనసేన దోస్తీతో ఒకటీ అరా సీట్లయినా రాకపోతాయా అన్న ఆశతో అటు బీజేపీ వెయిటింగ్‌. కానీ పవన్‌కళ్యాణ్‌-చంద్రబాబు భేటీతో ఏం జరగబోతోందో అర్ధమైంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలతో ఉండాలో విడిగా చూసుకోవాలో తేల్చుకోవాల్సింది బీజేపీనే.

అన్నయ్య తప్పులు తమ్ముడు చేయరనుకున్నారు. ఆర్భాటంగా ప్రజారాజ్యాన్ని ప్రారంభించి ఒక్క ఎన్నికతోనే వెన్నుచూపించేశారు చిరంజీవి. పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆ పార్టీతోపాటే రాజకీయంగా తెరమరుగయ్యారు. తమ్ముడు మొండిఘటం కాబట్టి అలాంటి తప్పటడుగులు వేయడనుకున్నారు. అయితే ప్రభుత్వ ఓట్లు చీలకుండా చూస్తాం అని పదేపదే చెబుతూ వస్తున్న జనసేనాని అంతరంగంలో ఏముందో ఇప్పుడందరికీ అర్ధమైపోతోంది. గత ఎన్నికల్లో పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయిన పవన్‌కళ్యాణ్‌కి ఒంటరిగా తానేమీ చేయలేననే తత్వం బోధపడినట్లుంది. అందుకే టీడీపీతో కలుస్తారన్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నారు. ఆ మధ్య హోటల్‌కొచ్చి మరీ పవన్‌కళ్యాణ్‌ని చంద్రబాబు పరామర్శించి వెళ్లారు. ఇప్పుడు పవర్‌స్టార్‌ వెళ్లి చంద్రబాబుని కలిశారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుంది. ఒకవేళ విడిగా పోటీచేయాలనుకున్నా ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల అవగాహన ఉంటుంది. వైసీపీకి ఝలక్‌ ఇవ్వాలన్న మైండ్‌గేమ్‌ కూడా వీరి కలయికల వెనుక మరో ఎజెండా. అప్పట్లో వైజాగ్‌ పర్యటనలో పవన్‌కళ్యాణ్‌ని అడ్డుకోవడాన్ని చంద్రబాబు ఖండిస్తే, ఇప్పుడు కుప్పంలో టీడీపీ అధినేతకు ఎదురైన అనుభవాలపై పవన్‌కళ్యాణ్‌ స్పందించారు. అంటే మ్యూచువల్‌ అండర్‌స్టాండింగ్‌తో వెళ్తున్నారన్నమాట. వీరిద్దరి మీటింగ్‌తో వైసీపీ తన సహజశైలిలో స్పందించింది. జగన్‌ని ఎదుర్కోలేకే అనైతిక బంధం ఏర్పరుచుకుంటున్నారని దుమ్మెత్తిపోసింది. పవన్‌కళ్యాణ్‌ టీడీపీకి దూరంగా ఉండాలని కోరుకుంటున్న బీజేపీ కూడా వేచిచూసే ధోరణితోనే ఉంది. అందుకే చంద్రబాబు-పవన్‌ భేటీని సమర్ధించలేదు, అలాగని విమర్శించలేదు. ఆ రెండు ఒక్కటైతే అనివార్యంగా వెంట నిలవాల్సిన పరిస్థితి బీజేపీది.

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే ఇవ్వాల్సిన సీట్లమీద కూడా పెద్ద చర్చే జరుగుతోంది. పవన్‌కళ్యాణ్ కనీసం 50-60 సీట్లు అడిగే అవకాశం ఉందని జనసైనికులు జబ్బలు చరుచుకుంటున్నారు. పాతికిస్తే గొప్పన్నట్లుంది టీడీపీ వైపునుంచి వస్తున్న రియాక్షన్‌. ఏపీలో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్‌కళ్యాణ్‌ సీట్ల విషయంలో తెగేదాకా లాగకపోవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. పవన్‌కళ్యాణ్‌ సీఎం అవ్వడం అలా ఉంచి ముందు ఎమ్మెల్యేగా గెలిస్తే అదే పెద్ద విజయం అన్న అభిప్రాయం కూడా ఉంది. ఒక్కటైతే క్లియర్‌. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుని మరోసారి వైసీపీని అధికారంలోకి తేవడానికి అటు చంద్రబాబు, ఇటు పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ సిద్ధంగా లేరు. ఈ ఉమ్మడి లక్ష్యంకోసం పంతాలు పట్టింపులు పక్కనపెట్టి ఎలాగైనా సర్దుకుపోవడానికి ఇద్దరూ సిద్ధమైనట్లే కనిపిస్తోంది.