టీడీపీ, జనసేన పొత్తు కుదిరినట్లేనా.. ఆ ముడులు విప్పేదెవరో..

By KTV Telugu On 12 January, 2023
image

అంతిమ లక్ష్యం దిశగా పార్టీల అడుగులు
చంద్రబాబు, పవన్ రెండు దఫాల చర్చలు
సీట్ల సర్దుబాటుపై తెగని పంచాయతీలు
పవన్ గట్టిగా పట్టుబట్టాలంటున్న కాపు నాయకులు
జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నేతలు
సీఎం పదవిపై వీడని సస్పెన్స్ లు చెరి సమానంగా సీట్లు వస్తే రసవత్తర రాజకీయాలు ముఖ్యమంత్రి కావాలన్న పవన్ ఆకాంక్ష తీరేదెన్నడూ
నేల విడిచి సాము వద్దంటున్న విశ్లేషకులు.

రాజకీయాల్లో అంతిమ లక్ష్యం అధికారమే. దాని కోసం పార్టీలు నేతలు వెదుక్కునే మార్గాలు వేరుగా ఉంటాయి. పొత్తులు ఎత్తులు ప్రశ్నంసలు ఆరోపణలు దూషణలు ఏవైనా సరే అందులో భాగమే అవుతాయి. గద్దె మీద ఉన్న నాయకుడిని దించి తాము పీఠమెక్కాలన్న ఏకైక కోరికతో రాత్రీ పగలు కృషి చేసే పార్టీల్లో కొందరికి మోదం, కొందరికి ఖేదం తప్పదని చెప్పాలి. అయినా సరే బహుదూరపు బాటసారిలా పార్టీలు సాగిపోతూనే ఉంటాయి. తమ ప్రయాణంలో ఆఖరి మజిలీ కోసం తపిస్తూ ఉంటాయి. ఎదురుదెబ్బలకు నిరాశ పడకుండా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ సాగే ప్రయాణంలో కొందరు మరికొందరితో కలవడం కొందరు విడిపోవడం రాజకీయ సహజ పరిణామమనే చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది కూడా అదేనని అనుకోవాలి. నిజానికి ఈ రాజకీయ ప్రయాణాల్లో కొన్ని విశ్లేషణలకు వెంటనే అందుతాయి. మరి కొన్ని అర్థం చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. అందుకు కారణాలు చాలానే ఉంటాయనుకోండి.

ఒక పార్టీని గద్దె దించాలి. మరోకరు ఎక్కాలి. ఈ రాజకీయ చదరంగంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఏడాదిన్నరలో ఎన్నికలు జరుగుతున్న వేళ పొత్తుల ఎత్తులు వేగం పుంజుకోగా ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడిపోతారనే చర్చ జరుగుతోంది. గతి తప్పిన వైసీపీని లాగి కింద పడేసేందుకు విపక్షాల ఏకమవ్వాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పమే ఇప్పుడు విపక్షాలను దగ్గరకు చేర్చేదిగా కనిపిస్తోంది. పైగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి. అంతే సమయం విపక్ష నాయకుడి హోదాలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు మరోసారి సీఎం పదవికి గాలం వేసే క్రమంలో అందరినీ కాకపోయినా కొందరిని కలుపుకుపోవాలన్న ఆకాంక్షను ప్రదర్శిస్తున్నారు. ఆ దిశగానే టీడీపీ అధినేత జనసేనాని మధ్య రెండు దఫాలు చర్చలు జరిగాయి.

ఇటీవలి కాలంలో చంద్రబాబు పవన్ విజయవాడలో మొదటి సారి కలిశారు. రెండో దఫా హైదరాబాద్లో మీటయ్యారు. తొలి దఫా చంద్రబాబు స్వయంగా పవన్ బస చేసిన హోటల్ కు వెళ్లి ఆయన్ను పలుకరించారు. వైజాగ్ లో వైపీసీ ప్రభుత్వ దౌర్జన్యాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి కార్యాచరణతో జగన్ ను మట్టికరిపించాలన్న సంకల్పాన్ని ఇద్దరు నేతలు బయట పెట్టారు. రెండో దఫా పవన్ నేరుగా హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికవెళ్లారు. అక్కడా వైసీపీ దౌర్జన్యాలే చర్చకు వచ్చాయి. కుప్పంలో చంద్రబాబు రోడ్ షోను పోలీసులను పెట్టి అడ్డుకున్న తీరు ప్రస్తావనకు వచ్చింది. జీవో నెంబర్ వన్ పై చర్చించారు. జగన్ సంగతి తేల్చేయ్యాల్సిందేనని మరోసారి తీర్మానించారు.

ఇదంతా పైమాటే. లోగుట్టు వేరే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల పొత్తులు సీట్ల సర్దుబాటు ప్రాథమికంగా చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో తప్పు లేదు కూడా ఎందుకంటే ఇప్పటి నుంచే క్లారిటీకి వస్తే ముందుకు సాగడానికి ఇబ్బంది ఉండదని ఇద్దరు నేతలు భావించి ఉంటారు. అసలే వైసీపీ అరాచకాలతో కాకమీదున్న రెండు పార్టీల కార్యకర్తలు చాలా రోజులుగా అధినేతల దిశా నిర్దేశం కోసం వేచి చూస్తున్నారు. టీడీపీ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు జనసేనకు డిసైడ్ చేయడంతో అక్కడ పార్టీ నేతల ఊపు తగ్గించి అన్ని అవకాశాలను జనసైనికులకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు పవన్ భేటీల్లోనూ అవే పాయింట్లు చర్చకు వస్తున్నాయి.

టీడీపీ, జనసేన ఇద్దరిలో మేజర్ పార్టనర్ ఎవరూ ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం పెద్ద కష్టమేమీ కాదు. అది టీడీపీయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భవిష్యత్తుపై ఎక్కువ ఆశలు పెట్టుకున్న జనసేన మాత్రం వేరుగా ఆలోచిస్తోంది. అందుకే ఎక్కడ ఎన్ని సీట్లకు పోటీ చేయాలో ఇరు పార్టీలు నిర్ణయించుకునేందుకు టైమ్ పడుతోంది. సీమలో ఎన్ని, ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో ఎన్ని అన్నట్లుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాము ఎక్కువ స్థానాలు పోటీ చేస్తామని మొత్తం 175లో 40 వరకు జనసేనకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆఫరిచ్చినట్లు రెండు పార్టీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. తాము ఎంపిక చేసి ఇచ్చినవయితే 40 కేటాయిస్తామని జనసేన కోరుకున్న స్థానాలే కావాలంటే 30కి మించి ఇవ్వలేమని టీడీపీ తెగేసి చెబుతోంది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకునే జనసైనికులు మాత్రం అందుకు ఒప్పుకోకూడదని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. జనసేన కూడా అటు ఇటుగా సగం సీట్లకు పోటీ చేసే విధంగా చర్చలు సాగాలని కోరుకుంటున్నారు. మరి ఈ పీటముడిని విప్పేదెవ్వరన్నదే పెద్ద చర్చ. పైగా కాపు సామాజిక వర్గం కంచుకోటలు జనసేనకు బలమున్న నియోజకవర్గాలు తమకే కావాలని పట్టుబట్టే అవకాశాలూ ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ పూర్తి సత్తా ఏమిటో ఇంకా బయట పడలేదన్నది నిజం. 2019లో జనసేన ఘోరంగా విఫలమైంది. పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. అలాగని ప్రతీదానికి నిన్నటి ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవడం కుదరదు. పవన్ పవర్ ఫుల్ స్పీకర్. ఆయన ఫైటర్ కూడా. ప్రజా నాయకుడిగా ఉండాలని అవకాశం వస్తే సంక్షేమ పాలన అందించాలని కోరుకునే నాయకుడు ఆయన. ఏపీలో ఎక్కడ సమస్యలున్నా పవన్ అక్కడ వాలిపోతుంటారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నిస్తారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూనే సొంత డబ్బులతో జనానికి సేవ చేసే ప్రయత్నంలో ఉంటారు. బాధితులకు లక్షల లక్షలు చెక్కులిస్తారు. గత పవన్ వేరు ఇప్పుటి పవన్ వేరు అని ఆయన నిరూపించుకుంటున్నారు. జనానికి సాయపడుతూనే రాజకీయ ప్రత్యర్థులకు సరైన కౌంటర్లిస్తున్నారు. వైసీపీ వారిని చెప్పుతో కొడతానని అన్నారంటే ఆయనలో పొలిటికల్ ఎగ్రషన్ ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు కూడా ఇప్పుడు మారిన మనిషిలా కనిపిస్తున్నారు. నాకెందుకులే అనే తత్వాన్ని వదులుకుని ప్రజల కోసం రాజకీయ యుద్ధం చేస్తున్నామన్న ఫీలింగ్ ను కల్పిస్తున్నారు. గతంలో టీవీల్లో కనిపించి చేతులు ఊపితే జనం ఓటేస్తారని చంద్రబాబు అపోహ పడేవారు. ఇప్పుడు పద్ధతి మార్చుకున్నారు. జనంలోకి వెళ్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేమీ ఖర్మ ఈ రాష్ట్రానికి లాంటి కార్యక్రమాలతో జనంలో కనెక్ట్ అవుతున్నారు. జనం కూడా చంద్రబాబు ఆలోచనా విధానాన్ని ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని అర్థం చేసుకుంటున్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్న నినాదం జనంలోకి బాగానే వెళ్లింది.

చంద్రబాబు, పవన్ ఇద్దరూ క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. తమ తమ పార్టీల కార్యకర్తల మనోభావాలను మైండ్ కు ఎక్కించుకున్నారు. అయితే రెండు పార్టీల మధ్య ఈగో ప్రాబ్లమ్ మాత్రం ఉంది. మేమేం తక్కువ మాకేం తక్కువ అన్న ఆలోచన రెండు పార్టీలను వెంటాడుతోంది. పైగా ఇప్పుడు కాకపోతే మరోసారి ఛాన్స్ రాదన్న ఫీలింగూ కనిపిస్తోంది. ఆ ఆలోచన టీడీపీ కంటే జనసేనలో ఎక్కువగా ఉంది. పవన్ ముఖ్యమంత్రి కావాలంటే ఈ సారి గట్టిగా పట్టుకోవాలన్న దృఢనిశ్చయం వారిలో మెదులుతోంది. పట్టువిడుపులకు పోతే టీడీపీ తమను మింగేస్తుందన్న భయమూ వారిని వెంటాడుతోంది.

ఎన్నికల్లో విజయం సాధించడమే రెండు పార్టీల ముందున్న తొలి ఛాలెంజ్. పొత్తుల చర్చలు, సీట్ల సర్దుబాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలి. కలిసి ప్రచారం నిర్వహించాలి. ఎక్కడా విభేదాలు కనిపించనివ్వకూడదు. వైసీపీకి చిన్న అవకాశం కూడా రానివ్వకూడదు ఇస్తే జగన్ బ్యాచ్ తమను మింగేస్తుందన్న నిజాన్ని గుర్తించాలి. చెట్టుకొకరు పుట్టకొకరు కాకుండా ఇరు పార్టీల అగ్రనేతలు విస్తృత ప్రచారం చేయాలి. వైసీపీ చేస్తున్న తప్పిదాలను జనానికి వివరించడంలో శక్తివంచన లేకుండా కృషి చేయాలి. మార్పు అనివార్యమని జనానికి ఎక్కించగలగాలి. అప్పుడు గెలుపు సాధ్యమే అవుతుంది.

గెలుస్తారు సరే గెలిచిన తర్వాత పరిస్థితి ఏమిటి..? ఒక పార్టీకి పూర్తి మెజార్టీ వస్తే ఇక రెండో నేత మాట్లాడే అవకాశం ఉండదు. చంద్రబాబుకు ఫుల్ మెజార్టీ వస్తే పవన్ చేయగలిగిందేమీ లేదు. ఆయన ఇచ్చిన పదవులు తీసుకుని జన సైనికులు మౌనంగా ఉండాల్సిందే. చంద్రబాబుకు ఫుల్ మెజార్టీ రాకపోయినా పవన్ కళ్యాణ్ పార్టీకి పోటీ చేసిన వాటిలో దాదాపుగా అన్ని సీట్లు వచ్చినా రాజకీయం రంజుగా ఉంటుంది. రాజకీయ ముష్టి యుద్ధాలు మొదలవుతాయి.

పవన్ కళ్యాణ్ యాంబిషన్ అందరికీ తెలిసినదే. ఏదోక రోజున ఏపీ సీఎం కావాలన్న కోరిక ఆయనలో బలంగా ఉంది. టీడీపీ, జనసేనకు దాదాపు సమానంగా సీట్లు వచ్చి ఎవరు ముఖ్యమంత్రి కావాలన్న పరిస్థితి ఎదురైనప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. అప్పుడు సామాజికవర్గం నేతలు రంగంలోకి దిగుతారు. ఎప్పుడూ కొన్ని సామాజిక వర్గాలకే సీఎం పదవి కావాలా అన్న పేచీకి తెరలేస్తుంది కాపు సీఎం అన్న అమిత వేగమైన చర్చకు అవకాశం వస్తుంది. ఇప్పటికే కాపు వర్గాల్లో ఒక మాట ప్రచారానికి వచ్చింది. చెరి రెండున్నరేళ్ల కాలం సీఎం పదవిని నిర్వహించాలన్న ప్రతిపాదనతో ఎన్నికల పొత్తు కుదరాలని కొందరు కాపు నాయకులు కోరుకుంటున్నారు. పవన్ వద్ద నేరుగా ప్రస్తావించకపోయినా సోషల్ మీడియాలో చర్చ మొదలు పెట్టారు. ఏదో రోజున పవన్ చెవికి ఆ మాట చేరడం ఖాయం అప్పుడు పట్టుబట్టాలన్న కోరిక ఆయనలో కూడా కలుగుతుంది. అసలు పేచీ మొదలు కావచ్చు.

ఏదేమైనా సరే సీఎం పదవి ఇప్పుడు కీలక సమస్యే అవుతుంది. పోటీకి ముందే దానిపై తేల్చాలని జనసేన పట్టుబట్టే అవకాశమూ ఉంది. పోనీలే అని ప్రస్తుతానికి రాజీకి వచ్చినా ఎన్నికల తర్వాతైనా నిలదీసే ఛాన్సుంది. లేని పక్షంలో మహారాష్ట్రలో బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే ఎదురు తిరిగి సీఎం పదవిలో కూర్చున్నట్లుగా పవన్ దూకుడును ప్రదర్శించే ఛాన్సుంది. పిక్చర్ బహుత్ బాకీ హై అనుకోవాలా రెండు పార్టీలు సర్దుకుపోవాలా అన్నది వారే నిర్ణయించుకోవాలి. తమ పరిమితులు ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలను సమీక్షించుకోవాలి. మరోసారి పొరబాటు పడితే పుట్టగతులుండవని అర్థం చేసుకోవాలి. నేల విడిచి సాము చేసే ఆలోచన పోతే సీఎం పదవిపై పేచీ కూడా దానంతట అదే మాయమవుతుంది.