ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అంతా పొత్తుల అంశంపైనే చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే అధికార వైసీపీ స్పష్టం చేసింది. ఇక టీడీపీ-జనసేనలు కలిసి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. అటు ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ కూడా 2024లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించింది. కానీ బీజేపీ మాత్రం ఎవరితో కలిసి వెళ్లాలనే విషయంలో ఓ స్పష్టతకు రాలేకపోతోంది. పవన్ బాబు పక్కన చేరిపోవడంతో టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ ఎంతమాత్రం ఇష్టపడడం లేదు. అయితే ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందా లేక మనసు మార్చుకొని మళ్లీ టీడీపీ, జనసేనలతో చేతులు కలుపుతుందా అనేది త్వరలోనే తేలిపోనుంది. బీజేపీ ఏమాత్రం ఆలస్యం చేసినా టీడీపీ-జనసేనలతో కమ్యూనిస్టులు జత కట్టే అవకాశముందనే వాదన వినిపిస్తోంది.
ఏపీలో పొత్తుల రాజకీయం రోజుకో విధంగా మారుతున్న తరుణంలో విపక్ష పార్టీలైన టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి పలు విశ్లేషణలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు. వైసీపీ ఓటమే ధ్యేయంగా విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు. అయితే ఆకూటమికి తానే బాస్ కావాలనుకుంటున్నారని తెలుస్తోంది. బాబును సీఎం చేసేందుకే పవన్ పార్టీ నడుపుతున్నారని ఇప్పటికే వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి తరుణంలో జనసేనాని ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పొత్తు ఖాయమని తేల్చిచెబుతున్న జనసేన నేతలు పవన్‌ను సీఎం చేయడం తమ లక్ష్యమని కూడా చెబుతున్నారు. పవన్‌కు టీడీపీ అవసరం కన్నా టీడీపీకే పవన్ అవసరం ఎక్కువగా ఉంది. పవన్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే జనసేన-టీడీపీ పొత్తుంటుందనే ఓ చర్చ జరుగుతోంది. అందుకే ప్రధాన విపక్షం టీడీపీకి పవన్ కల్యాణ్ ఓ కీలక కండిషన్ పెట్టినట్లు సమాచారం. బీజేపీ కూడా ఆ కండీషన్‌కు ఒప్పుకుంటే పొత్తుకు సై అంటోందట.
ఎలాగూ బీజేపీ జనసేనకు భాగస్వామిగా ఉంది. అందుకే ముఖ్యమంత్రి పదవిపై పవన్ పేచీ పెడుతున్నారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు అంత ఈజీగా ఆ పదవిని వదులుకునే అవకాశం ఉండదు. చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చేందుకు ఎటు అవకాశముంటే అటు వెళ్తుంటారనే ఆరోపణ ఉంది. బాబు పొత్తుల రాజకీయం గురించి అందరికీ తెలిసిందే. పవన్ మైలేజ్ కోసమే టీడీపీ జనసేనతో పొత్తు కోరుకుంటుందే తప్ప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేంత సాహసం ఆ పార్టీ చేయదనేది జగమెరిగిన సత్యం. అయితే పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పొత్తు పెట్టుకుంటారని తాజాగా ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. వీరిద్దరి మధ్య పొత్తు కుదరకపోతే కచ్చితంగా సీఎం జగన్ టీడీపీని భూస్దాపితం చేస్తారని కూడా ఉండవల్లి హెచ్చరించారు. చంద్రబాబు తగ్గితేనే మంచిదనే విషయాన్ని ఉండవల్లి చెబుతున్నారు. కానీ ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో బాబుకు తెలియంది కాదు. ప్రస్తుతానికి పోటీ చేసే సీట్లపంపకాలతోనే సరిపెట్టి అధికారంలోకి వస్తే అప్పుడు సీఎం పదవిపై ఆలోచన చేద్దామనే మెసేజ్ టీడీపీ జనసేనకు పంపే అవకాశం ఉంది. మొత్తంగా ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల రాజకీయం ఏవిధంగా ఉండబోతుందనేది ఆసక్తిని రేపుతోంది.