వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి అసెంబ్లీలో జనసేన ఎంట్రీని సగర్వంగా ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడ్డం ద్వారా అనుకున్న విజయాలు సాధించవచ్చునని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో టిడిపితో పొత్తు ఉంటుందని సంకేతాలు ఇచ్చిన జనసేనాని సీట్ల విషయంలోనూ తన మనసులో మాటను చంద్రబాబుకు చేరవేసినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టిడిపి -జనసేన పొత్తు ఇంచుమించు ఖరారైపోయినట్లే అంటున్నారు రాజకీయ పండితులు. ఇటు జనసేన టిడిపి శ్రేణుల్లోనూ అదే జోష్ కనిపిస్తోంది. ఆ మధ్య చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయిన పవన్ కళ్యాణ్ జనసేనకు కావల్సిన సీట్ల కేటాయింపుపైనా చంద్రబాబుతో చర్చించినట్లు చెబుతున్నారు. కనీసం 35 నుండి 40 స్థానాలు జనసేనకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే జనసేన అనగానే టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కు నమ్మకంగా ఉన్న నేతలకు ఎక్కడో ఒక చోట సీటు కేటాయించక తప్పదు. వారిని సంతృప్తి పర్చాలంటే ఎంత లేదన్నా 40 స్థానాలు ఉండాల్సిందేనని జనసైనికులు కూడా పవన్ కు చెబుతున్నారట. పవన్ డిమాండ్ పై ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు తనకే అలవాటైన బేరసారాలతో సీట్లను ఎంత మేరకు తగ్గించాలో చూస్తారని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు తాను మాట్లాడకుండా తమ పార్టీ నేతల ద్వారానే లీకులు ఇప్పిస్తూ ఉంటారు. తాజాగా టిడిపి అనుబంధ సోషల్ మీడియాలో జనసేనకు 15 సీట్లు కేటాయించవచ్చునని ప్రచారం చేస్తున్నారు. ఇదే టిడిపికి చెందిన మరో సోషల్ మీడియా గ్రూపులో గరిష్టంగా 24 సీట్లు కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఆ 24 సీట్లలోనూ పవన్ కు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే 14 సీట్లు కేటాయిస్తారని అంటున్నారు. మిగతా పది స్థానాలను కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కేటాయిస్తారని అంటున్నారు.
అయితే 24 స్థానాలకు పవన్ ఒప్పుకుంటారా అన్నది ప్రశ్న. ఒక వేళ పవన్ కళ్యాణ్ 24 స్థానాలు సరిపోవని పట్టుబడితే మాత్రం 30 స్థానాల దాకా ఇవ్వచ్చని చంద్రబాబు భావిస్తోన్నట్లు వినిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేయాలనే అంశంపైనే చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలవగలిగే స్థానాలకోసం సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం నుండి పోటే చేసే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. అక్కడ గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన బొలిశెట్టి శ్రీను స్వయంగా పవన్ ను తమ నియోజకవర్గంలో పోటీచేయాల్సిందిగా ఆహ్వానించారని అంటున్నారు. అయితే పవన్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. సీట్ల విషయంలో క్లారిటీ వస్తే అపుడు అభ్యర్ధులు ఎవరన్నది ఆలోచన చేయవచచునని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు విషయంలోనే ఎవరికీ నమ్మకాలు లేవు. చంద్రబాబు తో పొత్తుకు పవన్ సుముఖంగా ఉన్నా జనసేనలో సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారట.
2009 లో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టి.ఆర్.ఎస్., సిపిఐ, సిపిఎం లతో పొత్తు పెట్టుకుని మహాకూటమి పెట్టారు. అయితే మిత్ర ధర్మాన్ని అటకెక్కించి కమ్యూనిస్టులకు, టి.ఆర్.ఎస్. కు కేటాయించిన నియోజకవర్గాల్లో కూడా టిడిపి అభ్యర్ధలకు బీఫారాలు ఇచ్చేసి బరిలో దింపారు. 2014లో విభజిత ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి మిత్రద్రోహానికే పాల్పడ్డారని అప్పట్లో బిజెపి నేతలు బాహాటంగానే విమర్శించారు. ఏ ఎన్నికలోనూ చంద్రబాబు ఫెయిర్ గా ఉండరని పొత్తులు పెట్టుకున్న మిత్ర పక్షాలతో నిజాయితీగా అసలు ఉండరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజకీయాలపై అవగాహన లేని పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చంద్రబాబు ఏదో ఒక గేమ్ ప్లాన్ ప్లే చేసి తీరతారని వారంటున్నారు. చంద్రబాబు విషయంలో పవన్ అప్రమత్తంగా ఉంటే కానీ జనసేన మనుగడ సాధ్యం కాదని వారంటున్నారు. గోదావరి జిల్లాల్లో ఎన్ని స్థానాలు దక్కించుకున్నా అక్కడ తేలిగ్గా గెలవచ్చని జనసేన భావిస్తోంది.
అయితే టిడిపి -జనసేన పొత్తు పెట్టుకుంటే టిడిపి అభ్యర్ధి బరిలో ఉన్న చోట జనసేన ఓట్లు టిడిపికి పూర్తిగా బదలీ అవుతాయి కానీ జనసేన అభ్యర్ధి బరిలో ఉన్న చోట టిడిపి ఓట్లు మాత్రం జనసేనకు పడవని బాబు గురించి బాగా తెలిసిన వారు అంటున్నారు. 2014 ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా టిడిపి బిజెపిలకు అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్రపోషించామని జనసైనికులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి దాన్ని మనసులో పెట్టుకుని తన బాధ్యతను తాను గుర్తెరగాలని వారు అంటున్నారు. జనసేనకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు రావాలని కోరుకుంటోన్న వారిలో టిడిపికి చెందిన కాపు నేతలు కూడా ఉన్నారని అంటున్నారు. ఒక వేళ టిడిపి లో తమకు టికెట్ రాదన్న అనుమానం ఉంటే ముందస్తుగా జనసేనకు జంప్ చేస్తే సరిపోతుందని వారంటున్నారు. బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే ఈక్వేషన్ తో ఉన్నారని ఆయన చాలా ముందుగానే కర్చీఫ్ వేసేసుకుంటున్నారని వారంటున్నారు.
మొత్తం మీద ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ జనసేన క్యాడర్ లో అప్పుడే జోష్ పెరిగిపోయింది. అందరూ తమకి ఏ సీటు సరిపోతుందో చూసేసుకుంటున్నారు.