జనసేన ఆకాంక్షలపై నీళ్లు చల్లుతున్న టీడీపీ

By KTV Telugu On 2 November, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలోని పార్టీలు టీడీపీ, జనసేన మధ్య రోజుకో వివాదం రేగుతోంది. ఏ విషయంలోనైనా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బలం లేకపోయినా షో చేయాలని జనసేన చూస్తోందన్నది టీడీపీ ఆరోపణ కాగా, మొత్తం నాకే కావాలని టీడీపీ భావిస్తున్నట్లు జనసేన ఎదురుదాడి చేస్తోంది. ఈ క్రమంలో అనేక చోట్ల టీడీపీ, జనసేన నేతల మధ్య బాహాబాహీ తప్పడం లేదు…

ఏపీలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన సీనియర్లకు వారి అనుచరులకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకలాపాల్లోనూ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏలూరు జిల్లా చింతపాడులో ఘర్షణ కూడా అలాంటిదేనని చెప్పాలి. పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య మాటామాట పెరిగింది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా.. పెన్షన్‌ పంపిణీ చేయడంపై.. జనసేన కార్యకర్తలు టీడీపీ నేతలు, అధికారులను నిలదీశారు. దీంతో ఇరుపార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. ఘర్షణలో జనసేనకు చెందిన మోరు రామకృష్ణ అనే వ్యక్తికి గాయాలయ్యాయి.ఈ ఘటనపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ స్పందించారు. నిన్నటి వరకు రాష్ట్రాన్ని దురుసుగా పాలించిన కొంతమంది అరాచక శక్తులు జనసేన కండువాలు కప్పుకుని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలో కూటమి నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో.. జనసేన, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మూడు కండువాలు వేసుకోలేదు.. మీరు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని.. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను ప్రశ్నించడంతో ఇరుపార్టీల నేతల మధ్య మాటామాట పెరిగింది. దానితో టీడీపీ నేత వర్మ మీడియాకెక్కారు. పరోక్షంగా పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. ఒకప్పుడు వైసీపీ వాళ్లు పవన్ కల్యాణ్‌ను దత్తపుత్రుడని అనేవాళ్లు. ఇప్పుడు వర్మ కూడా నర్మగర్భంగా అదే మాట అనేశారు. దత్తపుత్రుడు దత్తపుత్రుడేనని అనడం ద్వారా, తమ నాయకులు చంద్రబాబు, లోకేశ్ మాత్రమేనని ఇతరులను తాము పట్టించుకోబోమని ఆయన తెగేసి చెప్పినట్లయ్యింది..

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య వైరం తారాస్థాయికి చేరింది. జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి వ్యవహారశైలిపై స్థానిక టీడీపీ నేతలు తిరగబడ్డారు. . నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పొత్తు ధర్మాన్ని ఎమ్మెల్యే మాధవి పాటించడం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. గెలిచిన తర్వాత వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. కూటమికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే మాధవి పని చేస్తున్నారని స్థానిక మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై అధిష్ఠానం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు, పవన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నేతలు హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి పరిస్తితి అదుపులోకి వచ్చింది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి