ఆంధ్ర ప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో ఎవరు కలిసినా కలవకపోయినా టిడిపి-జనసేన కలసికట్టుగా ఎన్నికల బరిలోకి దిగడం ఇంచుమించు ఖాయంగా కనిపిస్తోంది. టిడిపితో పొత్తు వద్దని మిత్ర పక్షం బిజెపి చెప్పినా కూడా జనసేన అధినేత టిడిపి వైపే మొగ్గు చూపారు. అంతే కాదు తాజాగా పార్టీ వార్షికోత్సవ సభ వేదికగా భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు సంకేతం కూడా పంపారు. తాను బిజెపికి అన్ని వేళలా మద్దతుగానే ఉన్నా బిజెపి నేతలు మాత్రం తనతో కలిసి రావడం లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అమరావతి పేరిట లాంగ్ మార్చ్ పెడదామంటే ఢిల్లీలో ఒప్పుకున్న నేతలు ఏపీకి వచ్చే సరికి అలాంటిదేమీ లేదన్నారని పవన్ అసహనం వ్యక్తం చేశారు. అటు తెలంగాణా బిజెపి పైనా పవన్ విమర్శలు చేశారు. తెలంగాణాలో బిజెపికి తాను మద్దతుగా నిలబడినా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసైనికులను బరిలోదింపుదాం అనుకుంటే నువ్వు ఆంధ్రుడివి ఇక్కడెలా పోటీ పెడతావు అని బిజెపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారని పవన్ ఆక్రోశించారు. తెలంగాణాలో బిజెపికి తాను ప్రచారం చేస్తే తప్పులేదు కానీ పోటీ చేస్తే మాత్రం తప్పయిపోతుందా అని పవన్ ప్రశ్నించారు.
మొత్తానికి అటు ఏపీలోనూ ఇటు తెలంగాణాలోనూ కూడా బిజెపీతో కటీఫ్ చెప్పేసినట్లే పవన్ సంకేతాలు ఇచ్చారు. అయితే ఇది అనాలోచిత చర్చే అని రాజకీయ పండితులు తప్పు పడుతున్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటాలని కోరుకుంటోన్న పవన్ ఎన్నికల ఏడాదిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి దూరమై వారితో కయ్యానికి కాలుదువ్వడం చాలా తెలివితక్కువ నిర్ణయమని వారంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గుడ్ లుక్స్ లో లేకపోతే వచ్చే ఎన్నికల్లో జనసేనకు కానీ జనసేనతో పొత్తులో ఉన్నవారికి కానీ కష్టాలు తప్పకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలకే కార్పొరేట్ కంపెనీలు సంపన్న వర్గాలు ఎన్నికల ఖర్చుల కోసం విరాళాలు ఇస్తూ ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి నచ్చని పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి కార్పొరేట్ కంపెనీలు కూడా జంకుతాయి. ఎందుకంటే కేంద్రాన్ని కాదని రాజకీయ ప్రత్యర్ధులకు విరాళాలు ఇస్తే ఆ తర్వాత వారి వ్యాపారాలపై అది తీవ్ర దుష్ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు.
అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా ఉన్న పార్టీలకు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఉండవంటారు. 2014 ఎన్నికల్లో బిజెపితో జట్టు కట్టిన టిడిపి 2018 వచ్చేసరికి ఎన్టీయే కూటమి నుండి బయట పడ్డమే కాకుండా నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మోదీని ఓడించి తీరతానంటూ కాంగ్రెస్ నేత రాహుల్ తో చేతులు కలిపారు. అందుకే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పారిశ్రామిక సంస్థలు కార్పొరేట్ దిగ్గజాల నుండి చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బులు అందలేదని చెబుతారు. అదే చంద్రబాబు చేతులు కట్టేసినట్లు అయ్యిందని అంటారు. ఇపుడు జనసేన కూడా బిజెపికి కటీఫ్ చెప్పేసిన దరిమిలా వచ్చే ఎన్నికల్లో జనసేనతో పాటు జనసేనతో పొత్తులో ఉండబోయే టిడిపికీ విరాళాల చేరిక కష్టమవుతుందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల పాటు బిజెపితో కలిసి ఉన్న పవన్ కీలకమైన సమయంలో బిజెపితో మైత్రి చెడగొట్టుకుని తప్పు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక టిడిపి-జనసేన పొత్తు ప్రభావం ఏపీపై ఎలా ఉంటుందన్న అంశంపై రక రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
2019 ఎన్నికల్లో ఏపీలో జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచినప్పటికీ ఓట్ల పరంగా చూస్తే 42 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులకు చెప్పుకోదగ్గ ఓట్లే వచ్చాయి. ఆ ఓట్ల లెక్కలను దృష్టిలో పెట్టుకునే ఇటు జనసేనాని అటు చంద్రబాబు కూడా చాలా ధీమాగా ఉన్నారు. 42 నియోజకవర్గాల్లో ఈ సారి జనసేన టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వారు అంచనా వేసుకుంటున్నారు. మిగతా నియోజకవర్గాల్లోనూ రెండు పార్టీల కూటమికి అడ్వాంటేజ్ ఉంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద టిడిపి-జనసేన కూటమి వందకు పైగా స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చేస్తుందని చంద్రబాబు నాయుడు జనసేన అధినేతకు నచ్చచెప్పినట్లు సమాచారం. అయితే రాజకీయ విశ్లేషకుల భావన మరోలా ఉంది. 2019 ఎన్నికల్లో జనసేనకు 42 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల శాతం 2024 ఎన్నికల్లోనూ అదే స్థాయిలో ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేం అంటున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పాలనకు నాలుగేళ్లు నిండుతోంది. ఈ నాలుగేళ్ల లోనూ గత ఎన్నికల్లో పవన్ కు అండగా ఉన్న కాపు సామాజిక వర్గ అభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా చేసింది.
కాపు నేస్తం పేరిట కాపు మహిళలకు ఏటా 15 వేలు ఇస్తోంది. అదే విధంగా అమ్మవొడి పథకం అమలు చేస్తోంది. అది మిగతా సామాజిక వర్గాలతో పాటు కాపులకూ వర్తిస్తోంది. ఇళ్ల స్థలాలు ఇతరత్రా సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హత ఉంటే చాలు అందరితో పాటు కాపులకూ అందాయి. నాలుగేళ్లుగా పథకాలను అనుభవిస్తోన్న వారిలో ప్రభుత్వంపై సానుకూల దృక్పథమే ఉండే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒక వేళ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వమే పవన్ ప్రభుత్వమో అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయన్న భయమూ వివిధ వర్గాల ప్రజల్లో ఉంది. అంచేత వచ్చే ఎన్నికల్లో ఆయా వర్గాల్లో మెజారిటీ ఓట్లు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ పండితులు. అదే జరిగితే టిడిపి జనసేన కలిసినా ఆ కూటమికి అనుకున్న విజయాలు రాకపోవచ్చునంటున్నారు. కేవలం ఏదో ఒక సామాజిక వర్గం ఓట్లపైనే ఆధారపడ్డం కూడా శ్రేయస్కరం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గాలు రెండింటిలోనూ కాపులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయినా పవన్ గెలవలేక పోడానికి వేరే కారణాలు ప్రభావం చూపి ఉండచ్చంటున్నారు. ఇదే విషయాన్ని పవన్ కూ పార్టీ శ్రేణుల దృష్టికి తెచ్చారు. టిడిపి-జనసేన పొత్తు పెట్టుకుంటే టిడిపి అభ్యర్ధులకు జనసేన వీరాభిమానులైన కాపుల ఓట్లు పడొచ్చేమో కానీ జనసేన అభ్యర్ధులకు టిడిపి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అయిన కమ్మ ఓటర్లు ఓటు వేసే అవకాశాలు తక్కువే అంటున్నారు. కమ్మలకు కాపులకు దశాబ్ధాలుగా రగులుతోన్న వైరమే దానికి కారణమంటున్నారు. కమ్మ పాలకులే తమని అణచివేశారన్న భావన కాపుల్లో ఎప్పట్నుంచో ఉంది. రాజకీయంగా ఎదిగిపోతున్నాడనే నాడు వంగవీటి రంగాను కమ్మ పాలకుల హాయంలోనే హత్య చేయించారు. అంచేత ఇపుడు చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ చేతులు కలిపి మేం ఇద్దరం ఒక్కటే అన్నంత మాత్రాన ఆ ఇద్దరి సామాజిక వర్గాలు అంత తేలిగ్గా కలవక పోవచ్చునంటున్నారు.
ఈ ఆందోళన ఉంది కాబట్టే మచిలీ పట్నం సభలో పవన్ పదే పదే జనసైనికులను ఉద్దేశించి వంగవీటి రాథా కాపు అయితే ఆయన భార్య కమ్మ అని గుర్తు చేశారు. కాపులకీ కమ్మలకీ రాథా పుట్టారని నొక్కి చెప్పారు. వాళ్లకి లేని కులం గొడవ మీకెందుకయ్యా అని అభిమానులను నిలదీశారు పవన్. అంటే పై స్థాయిలో నేతలు పార్టీలు పొత్తు పెట్టుకున్నా క్షేత్ర స్థాయిలో రెండు కులాలూ కలవకపోవచ్చునన్న అనుమానంతోనే పవన్ అలా వ్యాఖ్యానించి ఉంటారని అంటున్నారు. మొత్తానికి టిడిపి-జనసేన పొత్తు వాళ్లు అనుకుంటోన్నట్లు బ్రహ్మాండం బద్దలు కొట్టకపోవచ్చుననే భావిస్తున్నారు.
అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి అప్పటికి ఈ రెండు పార్టీలను జనం విపరీతంగా ఆదరిస్తే మాత్రం పాలకపక్షానికి గట్టి సవాల్ తప్పకపోవచ్చునని అంటున్నారు.