ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది టిడిపి-జనసేన పొత్తు వ్యవహారం. రెండు పార్టీల మధ్య పొత్తు వల్ల ఎవరికెంత లాభమో తెలీదు కానీ..ఇపుడు మాత్రం టిడిపికి తలనొప్పులు తప్పడం లేదు. భీమవరం నియోజకవర్గంలో టిడిపి-జనసేన నేతలు క్షేత్ర స్థాయిలో కలవడం లేదు. టిడిపి-జనసేన సమన్వయ కమిటీకి కీలక టిడిపి నేతలు డుమ్మా కొట్టడంతో జనసైనికులు భగ్గుమంటున్నారు. అటు టిడిపిలోనూ కొందరు నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మిగతా నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం-జనసేనల పరిస్థితి కాస్త అయోమయంగానే ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం రెండే రెండు నియోజక వర్గాలకు పరిమితం అయిన తెలుగుదేశం పార్టీ నాలుగున్నరేళ్లలో జిల్లాలో బలపడింది లేదు. మరో ఏడు నెలల్లో ఎన్నికలు వస్తోన్న నేపథ్యంలో ఈ మధ్యనే జనసేనతో పొత్తు పెట్టుకుంది. జనసేనకున్న కొద్ది పాటి ఓటు బ్యాంకుతో కొంతైనా పరువు దక్కించుకోవచ్చునన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది.
రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైన తర్వాత రెండు పార్టీల నేతలతో కలిసి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు హాజరు కాలేదు. దీన్ని జనసేన నేతలు ప్రశ్నించారు. నిజానికి 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా లేనే లేరు. గత ఎన్నికల్లో పులపర్తి ఆంజనేయులు అలియాస్ అంజిబాబు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అప్పుడు జనసేన అభ్యర్ధిగా పోటీచేసిన పవన్ కళ్యాణ్ పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ 8357 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
గత ఎన్నికల పరాజయంతో అంజిబాబు రాజకీయంగా స్తబ్ధుగా ఉంటున్నారు. టిడిపి-జనసేనల మధ్య పొత్తు ఏర్పడిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యారు. అయితే సమన్వయ కమిటీకి మాత్రం రాలేదు. దీనిపై జనసేనకు చెందిన వీరవాసరం జెడ్పీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మిని ప్రశ్నించారు. అంజిబాబు ఎందుకు రాలేదని అడిగారు. అంజిబాబు వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని సీతామహాలక్ష్మి బదులిచ్చి ఊరుకున్నారు.
పొత్తులో భాగంగా భీమవరం సీటును జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. అదే జరిగితే తనకు నియోజక వర్గం లేకుండా పోతుందని అంజిబాబు ఆందోళనగా ఉన్నారు. ఒక వేళ అదే జరిగితే జనసేన అభ్యర్ధికి ఏ మాత్రం సహకరించే ప్రసక్తే లేదని ఆయన వర్గీయులు తమ ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఒక పక్క జనసేనతో తమ సీటుకు ఎసరు తప్పదన్న బాధ మరో పక్క పార్టీ అధ్యక్షురాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కోపం జిల్లా టిడిపి నేతలను కుదురుగా ఉండనీయడం లేదు. ఇదిలా ఉంటే రెండు పార్టీల సమావేశానికి కొందరు టిడిపి నేతలకు సమాచారం ఇవ్వకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు.
ఇక జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికల పూడి గోవిందరావు.. వీరవాసరం జెడ్పీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు వర్గాల మధ్య ఆధిపత్య పోరు జనసేనకు పెద్ద చికాగ్గానే ఉంది. జయప్రకాష్ ఏమో అంజిబాబుకు అండగా ఉంటే.. గోవిందరావు తోట మహాలక్ష్మికి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇలా రెండు వర్గాలుగా చీలిపోవడంతో పార్టీలో లుక లుకలు కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.ఇటు టిడిపి -జనసేనల మధ్య గొడవలు..అటు టిడిపిలోనూ జనసేనలోనూ ఉన్న అసంతృప్తులు.. రెండు పార్టీల్లోనూ భిన్న వర్గాల మధ్య కుమ్ములాటలతో రెండు పార్టీల పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటున్నారు రాజకీయ పండితులు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…