నెల్లూరు జిల్లా దుర్ఘటన 8ప్రాణాలు తీసింది. చంద్రబాబు సభలో జరిగిన ఈ విషాదం అందరినీ కలిచివేసింది. స్వయానా ప్రధానమంత్రే సంతాపం ప్రకటించారు. కొంత సాయం ప్రకటించారు. కానీ ఏపీలో మాత్రం విషాదంపైన కూడా రాజకీయం నడుస్తోంది. చంద్రబాబు సభ పెట్టటమే తప్పన్నట్లు మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. ఆయన ప్రచార ఆర్భాటంతోనే ఈ దారుణం జరిగిందని నిందిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల అయితే నరబలి తీసుకున్నారన్న మాట మాట్లాడారు. ఇరుకు ప్రాంతంలో ఎక్కువమంది వచ్చారని చూపించేందుకే అక్కడ సభ పెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లనాటి కృష్ణా పుష్కరాల విషాదాన్ని గుర్తుచేస్తున్నారు.
వైసీపీ నేతలు కేవలం విమర్శలతోనే సరిపెట్టటం లేదు. 8మంది చావులకు కారణమైన చంద్రబాబుని అరెస్ట్ చేయాలంటున్నారు. గాయపడ్డ ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసులు కూడా పెట్టారు. జనం పెద్ద ఎత్తున వచ్చినప్పుడు కొన్ని చోట్ల అపశ్రుతులు జరిగిపోతుంటాయి. అలా జరగాలని ఎవరూ కోరుకోరు. కాకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేదో పార్టీ కార్యక్రమం అని ప్రభుత్వ వ్యవస్థలు పట్టించుకోకుండా వదిలేయకూడదు. ఓ సభ పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ నిర్వహకులు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. కందుకూరు సభలో దురదృష్టంకొద్దీ అలా జరిగిపోయింది. వచ్చేది ఎన్నికలసీజన్. ఇలాంటి సభలు, రోడ్‌షోలు ఊరూవాడా కనిపిస్తాయి. మరోసారి జరగకుండా ఏం చేయాలన్నదానిపైనే పార్టీలైనా ప్రభుత్వాలైనా దృష్టిపెట్టాలి.
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఇంత ఘోరం జరిగిందన్న వైసీపీ మాటలు అర్ధరహితం. అధికారపార్టీ కార్యక్రమాలకు జనసమీకరణ జరగడం లేదా. అధికారంలోకొచ్చిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంతకుముందు పాదయాత్రలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదా. మరప్పుడు ఎలాంటి ఘటనలూ జరగలేదంటే అనుకోకుండా జరిగేవాటినే ప్రమాదాలంటారు. వైసీపీ విమర్శలను లెక్కచేయకుండా చంద్రబాబు మృతుల కుటుంబాలను పరామర్శించారు. పార్టీతో పాటు నాయకులు ఇచ్చిన సాయం కూడా కలిపి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేశారు. పిల్లల చదువులు, కొందరి ఉద్యోగాలపై భరోసా ఇచ్చారు. జాగ్రత్తలు తీసుకోండని సూచించడం వేరు. మీవల్లే జరిగిందని నిందిస్తే రేపు ఇలాంటి అనుభవం ఎవరికైనా రావచ్చు.