తుని టీడీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. అన్నదమ్ముల మధ్య సీటు పంచాయితీ రచ్చకెక్కింది. తుని టీడీపీ టికెట్ తన కూతురుకి ఇస్తున్నారని సంకేతాలు ఇచ్చిన యనమల రామకృష్ణుడిపై తమ్ముడు కృష్ణుడు గరమవుతున్నాడు. ఎన్నికల్లో రెండు, మూడుసార్లు ఓడిపోయిన వారికి ఈసారి టిక్కెట్ ఇచ్చేది లేదని మహానాడులో లోకేష్ స్పష్టం చేశారు. దాంతో యనమల రామకృష్ణుడు తన కూతురిని బరిలో దింపాలని భావిస్తున్నారు. అయితే తాను ఎటుపోవాలి అంటున్నాడు తమ్ముడు. రామకృష్ణుడి నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తమ్ముడు యనమల కృష్ణుడు తొండంగిలోని టీడీపీ నేతతో జరిపిన ఫోన్ సంభాషణ బయటకొచ్చింది. అన్నదమ్ముల మధ్య విభేదాలను బయటపెట్టింది.
పార్టీ కోసం కష్టపడిన తమను కాదని కుమార్తెకు ఎలా టికెట్ ఇస్తారో అడగాలంటూ టీడీపీ నేతను పురమాయించారు కృష్ణుడు. ఈ క్రమంలో ప్రతీ గ్రామం నుంచి 40 మంది వెళ్లి రామకృష్ణుడిని ప్రశ్నించాలని డిమాండ్ చేసారు. యాదవ సంఘంలో 30000 ఓట్లు ఉన్నాయని తాను లేకపోతే తునిలో టీడీపీ ఉండదనే విషయాన్ని తన అన్నకు చెప్పాలని కృష్ణుడు వ్యాఖ్యానించాడు. కృష్ణుడు మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు తన ప్రత్యర్థి మంత్రి దాడిశెట్టి రాజాకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజా నెగ్గేస్తున్నాడని అందరూ అంటున్నారంటూ కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ ఇంఛార్జే వైసీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పడం గమనార్హం.
తన సోదరుడిని వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంచాలని యనమల రామకృష్ణుడు భావిస్తున్నారు. అయితే యనమల కృష్ణుడికి ఇది రుచించడం లేదు. మూడు సార్లు ఓటమి పాలయ్యానన్న కారణంతో తనను పక్కన పెట్టి కుమార్తెకు సీటు ఇప్పించుకోవాలని అన్న హైకమాండ్‌పై వత్తిడి తెస్తున్నారని కృష్ణుడు భావిస్తున్నారు. దీంతో తనకు సంబంధించిన నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. తునిలో తాను ఓటమి పాలయినా నాలుగేళ్ల నుంచి పార్టీని రక్షించుకుంటూ వస్తున్నానని కార్యకర్తలకు అండగా నిలుస్తున్నానని కృష్ణుడు అంటున్నారు. అది విస్మరించి వేరే వారికి సీటు ఇస్తే అంగీకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానంటున్న కృష్ణుడు అందుకోసం అవసరమైతే అన్నను ఎదిరించడానికైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. చంద్రబాబుకు అత్యంత ఆప్తుల్లో ఒకరు. తుని నియోజకవర్గంలో 1984 నుంచి ఎదురులేని నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇప్పుడు 18 ఏళ్లుగా గెలుపు లేక ఓటమి భారంతో కుంగిపోతున్నారు. 2004 నుంచి వరుసగా ఎన్నికల్లో ఓడుతున్నప్పటికీ ఆయన మాత్రం చట్టసభల్లో కొనసాగుతూ వచ్చారు. తన రాజకీయ వారసునిగా సోదరుడు యనమల కృష్ణుడుని రంగంలోకి దింపారు. కానీ ఆయన కూడా 2014, 2019 వరుస ఎన్నికల్లో తునిలో ఓటమిపాలయ్యారు. దాంతో ఆయనకు అధిష్టానం సీటిచ్చే విషయంలో పునరాలోచన చేస్తోంది. కృష్ణుడి స్థానంలో యనమల రామకృష్ణుడి కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అధినాయకత్వంతో రామకృష్ణుడు మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది.