గన్నవరంలో పట్టాభి ఎపిసోడ్ వల్ల పార్టీకి నష్టమా లాభమా అన్న సంశయం పట్టుకుంది టిడిపి నాయకత్వానికి.
పాలక పక్షాన్ని రాజకీయంగా ఎండగట్టడానికి పట్టాభి గొడవ పనికొస్తుందనుకుంటే అది బూమెరాంగ్ అయ్యిందన్న భావనలో పార్టీ సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం మనకి నష్టమే జరిగిందని ఆగ్రహంగా ఉన్నారట. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు సెగలు కక్కుతూ సాగుతున్నాయి. ఎన్టీయార్ జిల్లా గన్నవరం లో టిడిపి అధికార ప్రతినిథి పట్టాభి చేసిన హంగామా ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టిడిపికి సానుభూతి వస్తుందని పాలక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని టిడిపి నాయకత్వం భావించింది. విపక్షాల కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని తాము ప్రచారం చేసుకోవచ్చునని కూడా వారు అనుకున్నారు.
అయితే ఎక్కడో లెక్క తప్పేసింది. పట్టాభి గొడవ ముగిసి పట్టాభిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేశాక చంద్రబాబు నాయుడు గన్నవరంలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. అయితే స్థానిక నేతలు ఎక్కువగా రాకపోవడం ఉన్న నేతలు కూడా పట్టాభి పట్ల సానుకూలంగా మాట్లాడకపోవడం చంద్రబాబును ఆశ్చర్య పర్చింది. పట్టాభి వ్యవహారాల వల్ల పార్టీ ప్రతిష్ఠే మసకబారుతోందని గతంలోనూ పట్టాభి నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించి తన అజెండాను తెరపైకి తెచ్చారని స్థానిక నేతలు చంద్రబాబుకు వివరించడంతో చంద్రబాబు షాక్ తిన్నారట. పట్టాభి ఒఠ్టి పైరవీ కారుడని పార్టీకి చెందిన ఎన్నారైల దగ్గర కూడా చాలా రకాల పనులు చేయించుకుని వ్యక్తిగతంగా లబ్ధి పొందారని వారు ఆరోపించడంతో పట్టాభి ఇలా చేశాడా చంద్రబాబు ప్రశ్నించారట.
పట్టాభి ఎపిసోడ్ వల్ల గన్నవరంలో కానీ జిల్లాలో కానీ టిడిపికి ఎలాంటి లాభం లేకపోగా లోకేష్ పాదయాత్ర నుంచి ప్రజలను దారి మళ్లించినట్లయ్యిందని కూడా వారు ఆరోపించారట. అది చంద్రబాబు నాయుడికి మరింత కోపం తెప్పించిందని అంటున్నారు. నిజానికి పట్టాభిని గన్నవరానికి పంపింది చంద్రబాబే అయినా తనను తప్పుదోవ పట్టించి పట్టాభి తనని పంపేలా చేసుకున్నాడని చంద్రబాబు ఇపుడు ఫీల్ అవుతున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. పైగా గన్నవరంలో పార్టీకి చెందిన బిసి నేత బచ్చుల అర్జునుడు ఉండగా పట్టాభి అవసరమైతే వంశీపై నేనే పోటీ చేస్తానని సవాల్ విసరడంపైనా స్థానిక నేతలు మండి పడుతున్నారు. దాన్నే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పట్టాభి వ్యవహారంతో స్థానిక నేతలే కోపంగా ఉన్నారని ఎలా చూసిన మన పార్టీకే నష్టమని వారు చెప్పడంతో చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా ఐ సీ అంటూ తలాడించేసి ఊరుకున్నారంటున్నారు.
గతంలోనూ టిడిపి కార్యాలయం నుండి పట్టాభి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి బూతులు మాట్లాడారు. అప్పుడు కూడా గుర్తు తెలియని వ్యక్తులు టిడిపి కార్యాలయంపై దాడి చేశారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తే ఆ ఫోటోలను ఇపుడు గన్నవరం ఇష్యూలో తమ గెజిట్ పత్రికలో రావడంతో టిడిపికి మరింతగా నష్టం వాటిల్లిందని స్థానిక నేతలు బాబుకు చెప్పారు. దీని వల్ల పార్టీ నాయకత్వమే కుట్ర చేసి తప్పుడు ప్రచారాలతో చిల్లర రాజకీయాలు చేస్తోందన్న భావనను అందరిలోనూ కల్పించినట్లయ్యిందని సీనియర్ నేతలు వివరించారట. అన్నీ విన్న చంద్రబాబు నాయుడు జరిగిందేదో జరిగిపోయింది గన్నవరంలో మనం మళ్లీ జెండా ఎగరేసేలా పార్టీని బలోపేతం చేయండి మీకు నేనున్నా అని భరోసా ఇచ్చారట చంద్రబాబు. పట్టాభిపై మాత్రం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని పార్టీనేతలు అంటున్నారు.
అయితే చంద్రబాబుకు చెప్పకుండా బాబు ఆదేశాలు లేకుండా పట్టాభి సొంతంగా నిర్ణయాలు తీసుకుని రాద్దాంతాలు సృష్టిస్తారంటే నమ్మలేం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పట్టాభి ఎపిసోడ్ తర్వాత వల్లభనేని వంశీ గ్రాఫ్ అమాంతం ఆకాశానికి ఎదిగిపోయిందంటున్నారు స్థానికులు. మామూలుగానే వంశీకి గన్నవరంలో మంచి పేరే ఉంది. ఇపుడు వంశీపైనే దాడి జరిగే సరికి సానుభూతి మరింతగా పెరిగిందంటున్నారు. పట్టాభి ఎపిసోడ్ జరిగే సమయానికి నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్నారు. నిజానికి మొదటి కొద్ది రోజులు పేలవంగా సాగిన లోకేష్ పాదయాత్ర ఇపుడిపుడే కొద్దిగా దారిలో పడుతోందని అంటున్నారు. లోకేష్ లో కూడా తడబాటు తగ్గిందని అన్ని విషయాలపైనా వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వంపై చురకలు వేస్తూ హుషారుగానే యాత్రను సాగిస్తున్నారని అంటున్నారు.
అయితే టిడిపి అనుకూల మీడియా కూడా లోకేష్ యాత్రను పక్కన పెట్టేసి రోజంతా పట్టాభి రాద్ధాంతాన్నే చూపించడంతో లోకేష్ యాత్రకు పూర్తిగా అన్యాయం జరిగిందని పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడానికి కావల్సినన్ని ఇష్యూలు ఉండగా పట్టాభి వంటి వారిని తెరపైకి తెచ్చి అడ్డదారిలో వికృత రాజకీయాలు చేస్తే టిడిపికి ఉన్న కొద్ది పాటి ప్రతిష్ఠ కూడా మసకబారడం ఖాయమని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. పట్టాభి జైలు నుండి వచ్చాక చంద్రబాబు వన్ టూ వన్ భేటీ అవుతారని పార్టీ నేతలు అంటున్నారు. పట్టాభి వ్యవహారశైలిపై ఆయన క్లాస్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. పట్టాభి వల్ల జరిగిన డ్యామేజీని రిపేర్ చేసుకుని ముందుకు సాగడమొక్కటే నాయకత్వం ముందున్న మార్గం అంటున్నారు వ్యూహకర్తలు.