అమరావతి కన్నా విశాఖ పట్టణమే శర వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం విశాఖ ఎంపీ అభ్యర్ధి భరతే స్పష్టం చేశారు. అదే అమరావతిని అభివృద్ధి చేయాలంటే కనీసం రెండు దశాబ్ధాలకు పైనే పడుతుందని..వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అమరావతిని అభివృద్ధి చేసే పరిస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలన్న చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలో పిడివాదనను భరత్ ఒక్క వ్యాఖ్యతో కొట్టి పారేశారు. వాస్తవం మాట్లాడారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా అవతరించింది. ఏపీకి రాజధాని ఎక్కడ ఉండాలన్నది తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం శివరామ కృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మూడు పంటలు పండే విజయవాడ, గుంటూరు నడి మధ్యలోని అమరావతి ఏ మాత్రం రాజధానికి అనువైనది కాదని తేల్చింది. బంగారు పంటలు పండే భూమిని నాశనం చేయకూడదంది. అయితే ఆ కమిటీ నివేదికను చెత్త బుట్టలో పారేసిన చంద్రబాబు తన సొంత కమిటీ వేసుకున్నారు. తన కనుసన్నల్లో పనిచేసే నారాయణను ఆ కమిటీకి ఇన్ ఛార్జ్ ని చేశారు.
ఇద్దరూ కలిసి తమ పార్టీ నేతలు బంధువుల చేత అమరావతి ప్రాంతంలో ముందుగా భూములు కొనేశారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములనూ గుంజుకున్నారు. తర్వాత అక్కడే రాజధాని పెడుతున్నామని ప్రకటించి ఏకపక్షంగా పెట్టారు. అమరావతి నగరం అభివృద్ధికి ఎకరాకు కనీసం రెండు కోట్లు అవుతాయని చంద్రబాబు అన్నారు. 50వేల ఎకరాలకు పైగా సేకరించారు. అంటే మౌలిక సదుపాయాల కల్పనకే లక్ష కోట్ల రూపాయలకు పైన ఖర్చు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కొన్ని వందల కోట్ల రూపాయలే. అయిదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది అయిదు వేల కోట్ల రూపాయలు మాత్రమే.
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని చంద్రబాబు విశాఖను వ్యతిరేకించారు.
అమరావతిని అభివృద్ది చేస్తే ఏపీ ప్రగతి పథంలో పరుగులు పెడుతుందంటూ తలా తోకా లేని వాదన వినిపించారు. ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్న విశాఖ పట్నాన్ని రాజధానిగా చేసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.ఇదే విషయాన్న జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు.
అయితే చంద్రబాబు అండ్ కో మాత్రం అమరావతికే జై కొడుతున్నారు. వారికి పవన్ కల్యాణ్, పురందేశ్వరి మద్దతు ఇస్తున్నారు. ఇపుడు వారి కూటమికి చెందిన నాయకుడే అసలు వాస్తవాన్ని ఒప్పుకోవడం వారికి మింగుడు పడనిదే అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు నాయుడి వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు.. విశాఖ టిడిపి ఎంపీ అభ్యర్ధి అయిన భరత్ నిజాన్ని ఉన్నది ఉన్నట్లు ఒప్పుకున్నారు. అమరావతి అభివృద్ధిచేయాలంటే వేల కోట్ల రూపాయలు పోయాలని..అది ఆర్ధికంగా ఏపీకి సాధ్యం కాదని కూడా టిడిపి విశాఖ ఎంపీ అభ్యర్ధి భరత్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే అది 20 ఏళ్ల సుదీర్ఘ కథే అని భరత్ చెప్పారు . విశాఖను మించిన గ్రోత్ ఇంజిన్ ఏపీలో మరొకటి లేదని కూడా ఆయనే అన్నారు . మరి అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వస్తోంది కూడా ఇదేగా.
అమరావతి , విశాఖ విషయంలో చంద్రబాబు ట్విస్టులు మామూలుగా లేవు. ఎన్నికల వేళ ఏపీలో టిడిపి-జనసేన-బిజెపి కూటమికి సంబంధించి టిడిపి పత్రికలకు విడుదల చేసే వాణిజ్య ప్రకటనల్లోనూ చంద్రబాబు రెండు నాల్కల ధోరణే అవలంబిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో విడుదల చేసే ప్రకటనల్లో ” మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోడానికి మోదీ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలి రండి అని పిలుపు నిచ్చారు.
అదే విశాఖ జిల్లాలో విడుదల చేసే వాణిజ్య ప్రకటనలో “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వికాసానికి” అని ప్రచురించారు. అంటే ఏ ఎండకాగొడుగు. ఏ ప్రాంతానికి ఆ కట్టుకథ. విశాఖ జిల్లాలో అమరావతే మన కలల రాజధాని అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోయారు? అని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు. అలా పెడితే ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నికల్లో తన్ని తరిమేస్తారన్న భయంతోనే వెనుకంజ వేసి ఉండచ్చని వారు భావిస్తున్నారు.
టిడిపి ఎంపీ అభ్యర్ధే..అందులోనూ చంద్రబాబు నాయుడి బంధువే ఇంతకాలం జగన్ మోహన్ రెడ్డి అంటూ వచ్చిన లైన్ కు అనుకూలంగా వ్యాఖ్యానించడం వెనుక ఏమన్నా మతలబ్ ఉందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…