బాబు కంట్లో నలుసులా ఆ ఇద్దరు ఎంపీలు

By KTV Telugu On 23 January, 2023
image

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే గట్టి పట్టుదలతో టీడీపీ ఉంది. ఈనేపథ్యంలో ప్రతీ నియోజకవర్గాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు అధినాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని టీడీపీ మూడు లోక్ సభ నియోజకవర్గాలను గెలుచుకోగలిగింది. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానాల్లో పసుపు జెండా ఎగిరింది. ఈసారి కూడా ఆ నియోజకవర్గాల్లో తన బలం ఎక్కడా చేజారకుండా జాగ్రత్తపడుతోంది. అందులో గుంటూరు, విజయవాడ రెండు నియోజకవర్గాలు రాజధాని అమరావతి పరిధిలో ఉండడంతో మరోసారి విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే ఆ రెండు సీట్లు అధినేత చంద్రబాబునాయుడికి కంట్లో నలుసులా మారాయి.

గుంటూరు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న గల్లా జయదేవ్ స్థానిక ప్రజలకే కాదు స్థానిక టీడీపీ నాయకులకు కూడా అందుబాటులో ఉండరనే పేరు ఉంది. 2014-19 మధ్య అందుబాటులో ఉన్నన్ని రోజుల్లో కనీసం సగం రోజులు కూడా ఆయన గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందుబాటులో లేరట. గుంటూరులో ఎంపీ కార్యాలయం ఎక్కడుందో కూడా చాలామందికి తెలియదట. వచ్చే ఎన్నికల్లో అసలు జయదేవ్ పోటీచేస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేదు. జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజకీయాల నుంచి వైదొలిగారు. దీంతో ఆయన రానున్న ఎన్నికల్లో సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి అసెంబ్లీకి పోటీచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. జయదేవ్‌కు చెందిన అమర్ రాజా కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. ఏపీలో కాకుండా తెలంగాణలో అమర్‌రాజా బ్యాటరీస్ పెట్టుబడి పెట్టడంపై ఇటీవల రాజకీయ రచ్చ జరిగింది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది.

విజయవాడ నుంచి ఎంపీగా ఉన్న మరో మంత్రి కేశినేని సొంత పార్టీకి కొరకరాని కొయ్యగా మారుతున్నారు. పార్టీ నేతలు, అధినేత మీద ఆయన చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలతో రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు విజయవాడ నుంచి టికెట్ ఉంటుందా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. అయితే ఇండిపెండెంట్‌గానైనా పోటీకి సిద్ధమంటున్నారు కేశినేని. దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్ధా వెంకన్నతోపాటు ఎంపీ కేశినేని సోదరుడు కేశినేని చిన్ని కలిసి చేస్తున్న రాజకీయంపై నాని మండిపడుతున్నారు. అటువంటి నాయకులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని అలా అయితే పార్టీ గెలవదంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు పార్టీలో తన వైరి వర్గానికి చెక్ పెట్టేందుకు వైసీపీ నేతలను చేరదీస్తున్నారు. మైలవరంలో ఉమకు చెక్ పెట్టడానికి వైసీపీ ఎమ్మెల్యే వసంతను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చూసుకుంటున్నారు. దాంతో కృష్ణా జిల్లా టీడీపీలో రాజకీయం వేడెక్కుతోంది. మొత్తంగా ప్రజలు అమరావతికి మద్దతుగా ఉన్నారని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఆ పార్టీలోని నాయకులే అడ్డు తగులుతున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.