పన్నెండు సీట్లివ్వండి కేసీఆర్ చక్రం తిప్పుతారని కేటీఆర్ ప్రజల్ని అడిగారు. కేంద్రంలో బలహీన ప్రభుత్వం రావాలి.. మా మీద ఆధారపడాలి… అప్పుడు చూపిస్తాం తఢాఖా అని వైసీపీ నేతలు కలలు కంటున్నారు. ఎప్పుడూ జాతీయ రాజకీయాల్లో చక్రం గురించి .. గతం వైభవాన్ని మళ్లీ చూడాలనుకునే చంద్రబాబు మాత్రం ఈ సారి చక్రాల గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. కానీ విచిత్రంగా… కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఆయనకే వస్తుందని జాతీయ స్థాయి సీనియర్ సెఫాలజిస్టులంతా అంచనా వేస్తున్నారు. మళ్లీ చంద్రబాబు చేతికి చక్రం వస్తుందా ?
భారత రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఆరు విడతలు అయిపోయిన తర్వాత జాతీయ స్థాయిలో సెఫాలజిస్టులు పోలింగ్ సరళిని విశ్లేషించి బీజేపీకి అంత జోరు లేదని తేల్చేస్తున్నారు. అయితే బొటాబొటి మెజార్టీ లేదా మెజార్టీకి కాస్త తక్కువగానే ఉంటాయని సెఫాలజిస్టులు వరుసగా అంచనాలు వేయడం ప్రారంభించారు. ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఒక్కడే గతంలో వచ్చినన్ని లేదా అంత కంటేఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఎందుకంటే బీజేపీపై వ్యతిరేకత లేదని చెబుతున్నారు. మిగతా వారిలో యోగేంద్రయాదవ్, రుచిర్ శర్మ, సీఓటర్ యశ్వంత్ దేశ్ ముఖ్ ఇతర సీనియర్ జర్నలిస్టులు తమ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతున్నారు. బీజేపీ ఖచ్చితంగా సీట్లు కోల్పోతుందని అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ కూటమి పార్టీలతోనే ప్రభుత్వం నిలబడే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారు.
బీజేపీ అంతర్గత రాజకీయాలు కావొచ్చు లేదా మిత్రపక్ష పార్టీలతో ఆడిన రాజకీయాలు కావొచ్చు మొత్తానికి పలు రాష్ట్రాల్లో బీజేపీకి గతంలో ఉన్నంత సానుకూలత లేదు. ఒక్క గుజరాత్ లో మాత్రమే గతంలోలా క్లీన్ స్వీప్ చేస్తారని మిగతా రాష్ట్రాల్లో ఎన్నో కొన్ని సీట్లు కోల్పోతారన్న అంచనాలు ఉన్నాయి. అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో గతంలో సాధించిన సీట్లను నిలబెట్టుకోవడం గొప్ప అన్నట్లుగా మారింది. . 2019 సార్వత్రిక ఎన్నికల్లో 64 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఎస్పీ, కాంగ్రెస్ ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి. బలమైన పోటీ ఇస్తునన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో సాధించిన 64 సీట్లలో పది సీట్లు తగ్గినా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అంత కంటే ఎక్కువే తగ్గవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి.
మరో వైపు 2019 ఎన్నికల్లో బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో ఒకటి , రెండు సీట్లు మినహా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి అలాంటి పరిస్థితి లేదు. కర్ణాటకలో ఉన్న ఇరవై ఎనిమిది స్థానాల్లో మూడు తప్ప అన్నీ గెలిచారు. ఈ సారి ఖచ్చితంగా సీట్లు కోల్పోవడం ఖాయం. ఎన్ని కోల్పోతారన్నది స్పష్త లేదు. బీహార్, మహారాష్ట్రల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ పూర్తి స్థాయిలో గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఎలా చూసినా గత ఎన్నికలతో పోలిస్తే.. కనీసం అరవై నుంచి డెబ్భై సిట్టింగ్ సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. అయితే బీజేపీకి ప్లస్ పాయింట్ ఏమిటంటే.. దక్షిణాదిలో సీట్లు పెంచుకునే అవకాశం ఉండటం. ఉత్తరాదిలో తగ్గనున్న సీట్లలో అన్నీ కాకపోయినా కొన్ని భర్తీ చేసుకునేందుకు దక్షిణాదిలో అవకాశం వచ్చింది. తెలంగాణలో ఈ సారి డబుల్ డిజిల్ సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది. ఏపీలో టీడీపీ తో కలిసి పోటీ చేయడం ద్వారా ఇరవై నుంచి ఇరవై రెండు సీట్లు అంచనా వేస్తోంది. ఒరిస్సాలో గతం కన్నాసీట్లు పెరుగుతాయి. తమిళనాడు, కేరళల్లోనూ ఖాతా తెరుస్తామన్న అంచనాల్లో ఉన్నారు. అలాగే బెంగాల్‌లో గతంలో కన్నా సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఎన్ని సీట్లు పెరిగినా.. మెజార్టీకి కాస్త అటూఇటూగానే బీజేపీ ఉండిపోతుందని ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే బీజేపీ తర్వాత ఎన్డీఏలో బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీనే పెద్దది. షిండే నేతృత్వంలోని శివసేన కానీ.. నితీష్ కుమార్ జేడీయూ కానీ ఎక్కువ సీట్లు సాధించే పరిస్థితి లేదు. అతి ఎక్కువగా టీడీపీనే పదిహేను సీట్లు వరకూ సాధిస్తుందన్న అంచనాలు వస్తున్నాయి. అదే జరిగితే కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి మంచి ప్రాధాన్యత లభిస్తుంది. దేశంలో సంకీర్ణ రాజకీయాల హవా నడిచినప్పడు చంద్రబాబు అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు.
సంకీర్ణ రాజకీయల హయాంలో ప్రాంతీయ పార్టీల హవా నడిచింది. అప్పట్లో జాతీయ పార్టీలు బలహీనంగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే ఒక వేళ ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినా చక్రం తిప్పే అంత అవకాశం ఉండదనే అంచనాలు కూడా ఉన్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…