వై.సుజనా చౌదరి సిఎం రమేష్ టి.జి. వెంకటేష్ గరికపాటి మోహన్ రావు ఈ నలుగురూ కూడా తెలుగుదేశంపార్టీ నేతలే అని అందరికీ తెలుసు. టిడిపి తరపున రాజ్యసభ కు నామినేట్ అయ్యారు ఈ నలుగురు. టిడిపి తరపున తమ వాణి వినిపించడానికి రాజ్యసభలో అడుగు పెట్టారు. కాకపోతే 2019 ఎన్నికల తర్వాత టిడిపి ఘోర పరాజయం చెందడంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఎన్నికలకు ముందు బిజెపిని చీల్చిచెండాడి మోదీని ఓడిస్తానని ప్రగల్భాలు పలికి కాంగ్రెస్ తో కలిసి తిరిగారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీలో టిడిపి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని కలలుగన్నారు బాబు. అయితే ఆయన కలలు రెండు చోట్లా ఢమాల్ అన్నాయి. ఏపీలో టిడిపి 23 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా టిడిపి ప్రత్యర్ధి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఏకంగా 151 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఆ సార్వత్రిక ఎన్నికల్లోనే కేంద్రంలో బిజెపి అఖండ విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు అవసరమైన స్థానాలు కూడా దక్కలేదు. చతికిల పడిపోయింది. తన ఆట రెండు చోట్లా తల్లకిందులు కావడంతో చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో పాలుపోలేదు.
ప్రత్యేకించి కేంద్రంలోని బిజెపితో అనవసరంగా పెట్టుకున్నానే అని ఆయన భయపడ్డారు. దానికి కారణం లేకపోలేదు. 2018లో బిజెపితో కటీఫ్ చెప్పి ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసి ఆయన దృష్టిలో పడ్డారు. ఆ ఎన్నికల ప్రచారంల మోదీ ఏపీలో పర్యటించినపుడు చంద్రబాబు అవినీతిని ఎండగట్టారు మోదీ. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎంలా మారిపోయిందని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోగానే చంద్రబాబు నాయుడికి ఈ భయమే పట్టుకుంది. పోలవరం ప్రాజెక్టులో తన అవినీతిపై ఆరోపణలు చేసిన మోదీ తిరిగి కేంద్రంలో ప్రధాని కావడంతో తనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి జైలుకు పంపుతారేమోనని చంద్రబాబు భయపడ్డారు. దాంతో పాటు అమరావతి భూకుంభకోణాలపై తరచుగా ఏపీ బిజెపినేతలు చేస్తూ వచ్చిన ఆరోపణలపైనా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుందేమోనని చంద్రబాబు కంగారు పడ్డారని అంటారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండడం రాజకీయంగానూ తమకి అవసరమని ఆయన భావించారని ప్రచారం జరిగింది.
అందుకే ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకోగానే అంత వరకు తాను తిట్టి పోసిన నరేంద్ర మోదీని మంచి చేసుకోవడం ఎలాగ అన్న అంశంపైనే దృష్టి సారించారు. బిజెపికి చేరువ కావాలంటే బిజెపి నాయకత్వాన్ని మెప్పించాలని అనుకున్నారు బాబు. అంతే సిగ్గుపడుతూ కూర్చుంటే పనులు కావనుకున్నారు. ఆ సమయంలో బిజెపికి రాజ్యసభలో అంతగా బలం లేదు. ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా రాజ్యసభలో మద్దతు లేని పరిస్థితి. దాన్ని పసిగట్టిన చంద్రబాబు నాయుడు బిజెపిని రాజ్యసభలో ఆదుకుంటే తనపై వేధింపులు ఉండవని అనుకున్నారు. అంతే మరో ఆలోచనే లేకుండా తమ పార్టీకి చెందిన నలుగరు రాజ్యసభ సభ్యులను బంగారు పళ్లెంలో పెట్టి బిజెపికి కానుకగా సమర్పించేశారు చంద్రబాబు. పార్టీ ఫిరాయింపులను అసహ్యించుకునే వెంకయ్యనాయుడి సమక్షంలోనే ఈ నలుగురూ చట్ట బద్ధంగా బిజెపిలో చేరిపోయారు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి బిజెపిలోకి సాగనంపారు కాబట్టే ఈ నలుగురి చేరిక గురించి చంద్రబాబు నాయుడు పల్లెత్తుమాట అనలేదు. ఇదే తెలంగాణాలో తమ పార్టీ తరపున గెలిచి టి.ఆర్.ఎస్. లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఏమన్నారు. మా పార్టీతరపున గెలిచిన వారిని మీరెలా కొంటారు సిగ్గులేదా మీకు అని మండి పడ్డారు చంద్రబాబు. అదే చంద్రబాబు నలుగురు రాజ్యసభసభ్యులు ఏమాత్రం సందడి చేయకుండా బిజెపిలో చేరిపోతే శంకరాభరణం సినిమా చూసినంత కూల్ గా ఉండిపోయారు.
ఇక చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు బిజెపిలో చేరిన నలుగురికీ చంద్రబాబు నాయుడు ఓ హిడెన్ ఆపరేషన్ అప్పచెప్పే పంపారు. అదేంటంటే బిజెపి నాయకత్వం దృష్టిలో టిడిపి పట్ల ఎలాంటి చెడు అభిప్రాయం లేకుండా చూసుకోవడం. దాంతో పాటే టిడిపి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవడం. ఈ పనులను ఈ నలుగురు ఎంపీలూ పకడ్బందీగానే చేశారు. పేరుకి బిజెపి ఎంపీలే కానీ వీరు మాట్లాడేది టిడిపి భాష అనుసరించేది టిడిపి అజెండా ఎగరేసేది టిడిపి జెండా విధేయంగా ఉండేది చంద్రబాబు నాయుడికే. అందుకే కేంద్రంలోని బిజెపి ఏపీ రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయమని చెప్పినా ఈ నలుగురు మాత్రం చంద్రబాబు నాయుడి అడుగులకు మడుగులు ఒత్తుతూ అమరావతే రాజధాని అంటూ వచ్చారు. ఏ విషయంలోనైనా టిడిపి ఆలోచనలకు అనుగుణంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఈ నలుగురిలో టి.జి.వెంకటేష్ సుజనా చౌదరి గరికపాటి మోహన రావుల రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. తాజాగా సిఎం రమేష్ పదవీ కాలం కూడా ఈ ఆదివారంతోనే ముగిసిపోయింది. బిజెపి ముసుగు వేసుకున్న ఈ నలుగురితో పాటు టిడిపి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్ర పదవీ కాలం కూడా ఏప్రిల్ రెండుతోనే ముగిసింది. రాజ్యసభలో ఇక టిడిపి వాణి బలంగా వినిపించే సభ్యులు లేకుండా పోయారు. సుజనా చౌదరి సిఎంరమేష్ లపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటువంటి అవినీతి దిగ్గజాలను బిజెపిలో చేర్చుకోవడం పై గతంలోనే విమర్శలు వచ్చాయి. బిజెపిలో ఉన్నంత కాలం వీరు టిడిపి ఎంపీలుగానే మెలిగారు. ఇపుడు రాజ్యసభతో రుణం తీరిపోయింది. 2024 ఎన్నికల లోపు మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశాలూ లేవు. 2024 ఎన్నికల్లో అయినా టిడిపి ఘన విజయం సాధించి అధికారంలోకి రాగలిగితేనే ఈ నలుగురూ మళ్లీ రాజ్యసభ వైపు చూసే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే వీరిని బిజెపి రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ నలుగురిలో ఏ ఒక్కరూ కూడా జనాకర్షణ శక్తి కలిగిన నేతలు కారు. పట్టుమని పది ఓట్లు తెచ్చిపెట్టగల నాయకులూ కారు. వీళ్ల వల్ల బిజెపికి ఒరిగేదేమీ ఉండదని రాజకీయ పండితులు అంటున్నారు.
ఇంతకాలం అంటే వీరు రాజ్యసభ సభ్యులు కాబట్టి బిజెపి పనికొస్తారని ఉంచుకుంది. ఆ పదవులే పోయాక ఇక వీళ్లతో బిజెపికి పనే ఉండదంటున్నారు రాజకీయపరిశీలకులు. తమకి అవసరం లేని వారిని ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క నిముషం కూడా భరించడానికి ఇష్టపడదు.అవసరం తీరాక ఇటువంటి నేతలను ఎలా వదిలించుకోవాలా అనే ఎవరైనా చూస్తారు. బిజెపి కూడా అదే చేస్తుందంటున్నారు రాజకీయ పండితులు. అంచేత వచ్చే ఎన్నికల వరకు వీరు బిజెపిలో కొనసాగుతారా లేదా అన్నది చూడాలి. బహుశా 2024 ఎన్నికల వరకు వీరు బిజెపిలోనే ఉంటూ చంద్రబాబు నాయుణ్ని కాపడుకోవడానికి ప్రయత్నించవచ్చు.2024 ఎన్నికల్లో టిడిపి ఓటమి చెందితే మాత్రం ఈ నలుగురి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఊహించలేం. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచినా ఈ నలుగురికే రాజ్యసభలో అవకాశం వస్తుందని కూడా చెప్పలేం అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే రాజ్యసభకు నామినేట్ చేయాలంటే అది కనీసం వంద కోట్ల ప్రాజెక్టే అంటున్నారు వారు. దానికి సరితూగగలిగిన వారికే అవకాశం దక్కుతుందని వారంటున్నారు.