కమలానికి చంద్రుడు ఎంతో దగ్గర.. !

By KTV Telugu On 8 December, 2023
image

KTV TELUGU :-

చంద్రబాబు స్కెచ్ కరెక్టుగానే వేస్తున్నారా. 2024లో విజయానికి బాటలు పరుచుకునే దిశగా అటు జనసేన, ఇటు బీజేపీని కలుపుకుపోతున్నారా. పవన్ కంటే కూడా బీజేపీని బాగా చూసుకుంటే పొత్తుకు విజయావకాశాలుంటాయని విశ్వసిస్తున్నారా. ఆ దిశగా ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు బీజేపీ అధిష్టానానికి  చేరాయా…

ఇతర రాజకీయ నాయకుల రేపటి ఆలోచనలను చంద్రబాబు ఇవ్వాళే అమలు చేస్తారని ప్రచారం చాలా రోజులుగానే ఉంది. జగన్ కక్షసాధింపుతో ఆయన్ను జైలుకు పంపినప్పటికీ చంద్రబాబులో పొలిటికల్ షార్ప్ సెన్ ఏ మాత్రం తగ్గలేదు. 2024లో ఒకేసారి జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పొత్తులు ఖరారు చేసుకునే దిశగా ఆయన శరవేగంతో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల గుర్తింపు ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఒక పక్క టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీలు  జరుగుతున్నాయి. మరో పక్క బీజేపీ నేతలతో అనధికార చర్చలు జరుగుతున్నాయి.ఎక్కడ ఎవరు పోటీ  చేయాలన్న క్లారిటీ కోసం  ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు చేరుతూనే ఉన్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బాగా చేరువ కావాలన్న ఆకాంక్ష చంద్రబాబులో కనిపిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా మోదీ నాయకత్వానికే దేశ ప్రజలు జై కొడతారని తెలిసి ఆయనతో  సఖ్యతగా ఉండాలని బాబు తీర్మానించారు. అందుకే ఏపీలో బీజేపీ అడిగింది ఇవ్వడం ద్వారా వారిని సంతృప్తి పరిచి తనకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు..

గత ఎన్నికల్లో బీజేపీకి ఒక శాతం కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఒక ఎమ్మెల్యే గానీ, ఒక ఎంపీ గానీ గెలవలేకపోయారు. ఐనా సరే ఆ ఫలితంతో సంబంధం లేకుండా  బీజేపీకి గరిష్టంగా స్థానాలు కేటాయించాలని టీడీపీ తీర్మానించుకుంది. మొత్తం ఐదు లోక్ సభా స్థానాలు ఇచ్చేందుకు  రెడీ అయిన చంద్రబాబు అందుకు సంబంధించిన  బ్లూ  ప్రింట్ కూడా సిద్ధం చేశారు. గుంటూరు లేదా నరసరావుపేట లోక్ సభా స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇవ్వాలని టీడీపీ డిసైడైంది. ప్రస్తుత నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వస్తే ఆయనకు సిట్టింగ్ స్థానాన్ని కేటాయిస్తారు. అప్పుడు గుంటూరు ఎంపీ సీటు బీజేపికి వెళ్తుంది.మళ్లీ పోటీ చేసేందుకు ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సుముఖంగా లేనందున ఆ స్థానంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బరిలోకి దిగుతారని తెలుస్తోంది.  కమ్మ సామాజిక  వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న గుంటూరులో పురంధేశ్వరి  గెలుపు సులవేనని భావిస్తున్నారు. గుంటూరుతో పాటు రాజంపేట, బాపట్ల, విశాఖను కూడా  బీజేపీకి   కేటాయించే వీలుంది. ఆ నాలుగు నియోజకవర్గాలతో పాటు ఏదైనా ఒక నియోజకవర్గం ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. బీజేపీకి ఐదు సీట్లిచ్చేందుకు వేరే రీజన్ కూడా ఉందని చెబుతున్నారు. టీడీపీ నేతల్లో వంద  శాతం మంది అసెంబ్లీకి పోటీ చేసేందుకే  ఇష్టపడుతున్నారు. ఆ ఎంపీ సీటు మాకొద్దు బాబోయ్ అని అంటున్నారు. దానితో లోక్ సభకు సరైన అభ్యర్థులు లేని పరిస్థితుల్లో బీజేపీకి ఐదు, జనసేనకు రెండు లోక్ సభా స్థానాలు కేటాయించడంలో తప్పులేదని చంద్రబాబు నిర్ణయించుకున్నారట, అలాగే బీజేపీకి పది వరకు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో కైకలూరు, విశాఖ ఉత్తరంతో పాటు ఉభయ గోదావరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాల నియోజకవర్గాలుంటాయి. జనసేనకు 30 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో కనిష్టంగా 15 చోట్ల జనసేన గెలుస్తుందని లెక్కలు వేస్తున్నారు. సంక్రాంతి నాటికి సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని  అధికారికంగా ప్రకటించాలని చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారు.

ఎన్నికల్లోపు  ప్రచారానికి తగిన సమయం కావాలన్నది చంద్రబాబు ఆలోచనా విధానం. అప్పుడే జగన్ వ్యూహాలకు ప్రతివ్యూహాలతో అధికార  పార్టీని దెబ్బకొట్టే వీలుంటుందని భావిస్తున్నారు. అందుకే కీలక భాగస్వాములను కలుపుకుపోవాలని తీర్మానించుకున్నారు. ఎవరికి  ఎక్కడ గెలిచే అవకాశాలుంటే, అక్కడే సీట్లివ్వడం తన అభిమతంగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి