ఏపీ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. గన్నవరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం లాంటి పరిణామాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గన్నవరంలో టీడీపీ, ఎమ్మెల్యే వంశీ వర్గీయుల మధ్య రెండు, మూడు రోజుల నుంచి ఘర్షణ వాతావరణం కొనసాగతోంది. చంద్రబాబు, లోకేశ్ లను ఎమ్మెల్యే వంశీ తీవ్ర పదజాలంతో విమర్శించడంతో రగడ మొదలైంది. వంశీపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే స్థాయిలో విమర్శలకు దిగారు. అది కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. పోటాపోటీ ఆందోళనలు నిరసనలతో మొదలై దాడుల వరకు వెళ్లింది.
ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లగానే వల్లభనేని వర్గీయులు తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. పెట్రోల్ డబ్బాలు, క్రికెట్ బ్యాట్లతో విరిచుకుపడి ఆఫీసులో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లు విసురుకోవడంతో స్థానికంగా పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా భారీగా బలగాలను మోహరించారు. అయితే ఘటనా స్థలానికి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పట్టాభి సహా కొందరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేతలను ఎక్కడిక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ ఆఫీసులో వైసీపీ కార్యకర్తల విధ్వంసంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్నారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా లేక పోలీసు శాఖను మూసేశారా అని ప్రశ్నించారు. గన్నవరం ఘటనపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఆఫీసు తగలబెట్టిన వంశీ అనుచరులను అరెస్ట్ చేయాల్సింది పోయి, తమ నేతలనే అరెస్ట్ చేస్తారా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నేతలు ప్రభుత్వం, పోలీసులపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనతో తనకేమీ సంబంధం లేదని వల్లభనేని వంశీ చెబుతున్నారు.