తెలంగాణ ప్రభుత్వం మరో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సిద్ధమయింది. ఈ సారి ప్రవేశ పెట్టబోయేది ఎన్నికల బడ్జెట్. ఏడాది చివరిలో ఎన్నికలు ఉంటాయి. ఇంకా ముందస్తు ఆలోచన చేస్తే మరో నాలుగైదు నెలల ముందు ఎన్నికలు ఉండవచ్చు. అయితే ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ ఎంత కలర్ ఫుల్ గా ఉన్నా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో కలగాలి. మరి సీఎం కేసీఆర్ ప్రతీ ఏటా తాను ప్రవేశ పెడుతున్న బడ్జెట్‌లో చెబుతున్నట్లుగా నిధులు కేటాయిస్తున్నారా. గత ఏడాది అంటే 2022-23 బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు కనీసం నిధులు కేటాయించారా. అసలు బడ్డెట్ పద్దుల్ని పట్టించుకున్నారా. డీటైల్డ్ రిపోర్ట్.
2022-23 తెలంగాణ బడ్జెట్‌లో రెండు లక్షల 56 వేల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యు వ్యయం లక్షా 89 వేల కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం 29,728 కోట్లు. ఇందులో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11 వేల 800 కుటుంబాలకు అందిస్తోంది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. మనఊరు – మనబడి పథకానికి మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లు కేటాయించింది. సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు రూ. 1500 కోట్లు ఇలా పెద్ద మొత్తంలో కేటాయింపులు చేశారు. కానీ ఎన్ని అమలు చేశారంటే పెదవి విరవక తప్పదు.
2018 ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించడానికి సీఎం కేసీఆర్ ప్రధానంగా ఇచ్చిన హామీలు రూ. లక్ష రుణ మాఫీ, నిరుద్యోగ భృతి వంటివి. అప్పట్లో ఆయన దళిత బంధు పథకం గురించి ఆలోచించలేదు. మ్యానిఫెస్టోలో చెప్పలేదు. కానీ దళితబంధు పథకానికి బడ్జెట్‌లో రూ. 17,700కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ పథకం అమలులో నెలకొన్న సందిగ్ధత కారణంగా లక్ష్యం చేరలేదు. ఒక్కో శాసనసభా నియోజకవర్గంలో 1500 మంది చొప్పున రూ. 10లక్షలు ఆర్ధిక సాయం చేయాలనుకున్నారు కానీ ఆచరణలో సఫలం కాలేదు. దీంతో నిధుల విడుదల నిల్చిపోయింది. కేటాయించిన మొత్తంలో విడుదల చేసింది పది శాతం కూడా ఉండదు. అదే సమమయంలో నిరుద్యోగ భృతికి రూ. 3వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం మొదలు పెట్టలేదు. ఈ నెల వచ్చే నెల అనే ప్రకటనలు మాత్రం ప్రభుత్వ వర్గాలు చేస్తున్నాయి. వాస్తవంగా ఈ ఏడాది 4లక్షల మందికి సాయం అందించాలని బడ్జెట్ లక్ష్యం పెట్టుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని అనుకుంటారు. కానీ సంక్షేమ పథకాలకూ నిధులను విడుదల చేయలేకపోయారు. ఉచిత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టిన సర్కార్ రూ. 1000 కోట్లను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు చేసినా ఎక్కడా విడుదల చేసిన దాఖలాల్లేవు. విద్యార్ధుల ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం బడ్జెట్‌లో రూ. 4688కోట్లు కేటాయించారు. కానీ నిధులు విడుదల కాక విద్యార్థులు, కాలేజీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షమంది భవన నిర్మాణ కార్మికులకు ఉచిత మోపెడ్‌ల మాట మర్చిపోయారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేసినప్పటికీ ఈ పథకం అమలులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో పెండింగ్‌లో పడిపోయింది. ప్రస్తుత ఏడాదిలో రూ. 75వేల వరకు రైతు రుణమాఫీకి నిధులు కేటాయించినప్పటికీ 7లక్షల మందికి రూ. 4వేల కోట్ల నిధులు విడుదల కాలేదు.
మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రస్తుత ఏడాదిలో రూ. 1377 కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో పాతబస్తీ మెట్రోకు రూ. 500 కోట్లు, రాయదుర్గం-శంషాబాద్ మెట్రోకు చేసిన కేటాయింపులు విడుదల కాలేదు. కానీ టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ. 2142కోట్లు, విద్యుత్ రాయితీకి రూ. 190కోట్లు కేటాయించారు. కానీ విడుదల చేయలేదు. సంక్షేమరంగానికి రూ. 31వేల కోట్లకు మించి ఖర్చు చేసింది కానీ బడ్జెట్ ప్రతిపాదనలకు భిన్నంగా ఈ ఖర్చులు జరిగాయి.
తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలు చూస్తూంటే ఎప్పటి అవసరాలకు తగ్గట్లుగా అప్పుడు అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు పెట్టుకుంటూ పోయింది. రాజకీయ అవసరాలు ఇతర ప్రయోజనాలు చూసుకుని ఖర్చు పెడుతూ పోయారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అవసరమైన పథకాలకు నిధులుకేటాయించలేకపోయారు. దీనికి కేంద్రంపై నిందలు వేయవచ్చు. కేంద్రంనుంచి అందాల్సిన గ్రాంట్లు, నిధులు, సాయాల్లో రూ. 56వేల కోట్లు కోతలు పడటం వల్ల ఇవ్వలేకపోయామని వాదించవచ్చు. కానీ బడ్జెట్ లక్ష్యాల ప్రకారం ముందుకు సాగడమే ఆర్థిక క్రమశిక్షణ. తెలంగామ ప్రభుత్వం ఆ ఆర్థిక క్రమశిక్షణ అసలు ఫాలో కావడం లేదు. అందుకే కొత్తగా హరీష్ రావు ప్రవేశ పెట్టే ఎన్నికల బడ్దెట్ మూడు లక్షల కోట్లకు మించి ఉన్నా అందులో చెప్పినట్లుగా చేస్తారని ప్రజలు కూడా నమ్మడం కష్టం. ఎందుకంటే కలల బడ్జెట్లు కల్లలైన వైనం కళ్ల ముందే ఉంది మరి !