పేడబిర్యానీ అన్నారు. తన్నితరిమేస్తామన్నట్లు మాట్లాడారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న విభజన వివాదాలపై పంతాలకు పోతున్నారు. ఆంధ్ర మూలాలున్న నాయకులు విమర్శలు చేస్తే మీ రాష్ట్రానికి పోయి రాజకీయం చేసుకోండన్నట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో భారత్ రాష్ట్ర సమితిని దేశవ్యాప్తంగా విస్తరించామంటూ ఆంధ్రప్రదేశ్‌పై దృష్టిపెట్టారు. తెలంగాణ తర్వాత కేసీఆర్ జాతీయపార్టీ ప్రధాన లక్ష్యం ఏపీనే. అక్కడ తనను అభిమానించేవారున్నారని బోణీ బాగుంటుందన్నది గులాబీపార్టీ అధినేత ఆలోచన. అయితే ఓ చంద్రశేఖర్ మరో రావెలకిషోర్ వచ్చి చేరగానే అద్భుతాలు జరిగిపోవు. ఏపీలో కారు దూసుకుపోదు.
ఏపీ విషయంలో ఇప్పటికీ కేసీఆర్ నిబద్ధతపై ఎన్నో ప్రశ్నలు జవాబుకోసం వేచిచూస్తున్నాయ్. ఎప్పుడో రాష్ట్ర విభజన జరిగిపోయినా ఇంకా జలవివాదాలు తరచూ రెండురాష్ట్రాల మధ్య అంతరాలు పెంచుతున్నాయి. విభజన తర్వాత సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థల ఆస్తులు ఇప్పటికీ ఏపీకి బదలాయించలేదు. కృష్ణా గోదావరి జలాల వివాదంలో తెలంగాణ విమర్శలు చేస్తూనే ఉంది. బోర్డులకు ఫిర్యాదులు చేస్తూనే ఉంది. ఏపీకి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టుమీద కూడా ఆ మధ్య బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేయటంతో రెండు రాష్ట్రాల నేతల మధ్య వాగ్వాదం నడిచింది. దశాబ్దాలపాటు కలిసి ఉన్న తెలుగురాష్ట్రాలు విడిపోయాక లాభపడింది తెలంగాణేనన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఆదాయపరంగా బంగారు బాతులాంటి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. ఏపీ ఇప్పటికీ ఓ స్థిరమైన రాజధాని లేని రాష్ట్రంగానే పాలన సాగిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ విస్తరణకు ఏపీమీద దృష్టిపెట్టిన కేసీఆర్ ఈ రాష్ట్రంపై తనకు ఎలాంటి వివక్షాలేదని నిరూపించుకోవాల్సి ఉంది.
ఓ మెట్టు దిగైనా విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సి ఉంది. తానొస్తే దేశ రూపురేఖలు మార్చేస్తానంటున్న కేసీఆర్ పొరుగు తెలుగురాష్ట్రానికి ఏం చేస్తారో ప్రజలకు చెప్పాల్సి ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఏర్పాటు వెనుక ఉన్న హిడెన్ ఎజెండాపై జరుగుతున్న ప్రచారం అబద్ధమనేలా ఆయన అడుగులు వేయాల్సి ఉంది. ఏపీలో జనసేన-బీజేపీలను నష్టపరిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విజయశాంతి చేసిన ఆరోపణ చర్చనీయాంశమవుతోంది. ధనిక రాష్ట్రాన్నే అప్పులపాలుచేసిన కేసీఆర్‌ని ఏపీ ప్రజలు నమ్మరంటోంది రాములమ్మ. విజయశాంతి అన్నారని కాదుగానీ దేశమంతా పోటీచేస్తూ ఎంఐఎం ఎలాగైతే పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడుతుందో చివరికి బీఆర్ఎస్ కూడా అదే ఎజెండాతో వెళ్తుందనే అనుమానాలైతే కొందరిలో ఉన్నాయి. దేశం సంగతి దేవుడెరుగు. ముందు ఏపీ విషయంలో ఆయన సందేహాలను నివృత్తిచేస్తే జెండా ఎగిరేందుకు కాస్త చోటు దొరుకుతుంది.