గుంటూరు జిల్లాలో టికెట్ ప్లీజ్.. టీడీపీ నేతల్లో టెన్షన్

By KTV Telugu On 11 February, 2023
image

అసలైన తెలివిగలవారు గుంటూరులోనే ఉంటారంట కాదంటే కొడతారు మాకెందుకీ తంటా అని ఎప్పుడో ఒక కవి అన్నట్లుగా చెపుతారు. ఆ సంగతి ఎలా ఉన్నా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే గుంటూరు జిల్లాలో ఒక్కోసారి ఒక్కో పార్టీకి విపరీతమైన బలం ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని టీడీపీ తట్టుకోలేకపోయినా గుంటూరు ఎంపీ స్థానాన్ని మాత్రం కైవశం చేసుకోగలిగింది. ప్రస్తుతం మారుతున్న పరిణామాల్లో టీడీపీకి బలం పెరుగుతున్నట్లు చెబుతున్నారు. దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ స్ట్రాంగ్ గా ఉందనే చెప్పాలి. దానితో నేతలు రెడీ అవుతున్నారు. నేను ఇక్కడ పోటీ చేస్తానంటే నేను అక్కడ పోటీ చేస్తానని వారే ప్రకటించుకుంటున్నారు. కొందరైతే అధిష్టానం ఆదేశాలతో సంబంధం లేకుండా పరోక్షంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టేశారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. ఆ నాయకులంతా సీనియర్లు కావడంతో వారు మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే గత ఎన్నికల్లో 15 చోట్ల టీడీపీ ఓడిపోయింది. సర్వ శక్తులు ఒడ్డిన టీడీపీ సీనియర్లు సైతం పరాజయం పాలయ్యారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండగా టికెట్లపై టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఒకపక్క జనసేనతో పొత్తు ఉంటుందన్న భావన మరోవైపు ఇష్టమైన నేతకు టికెట్ వస్తుందో రాదో అన్న చర్చ ఇప్పటినుండే కార్యకర్తల్లో కూడా మొదలైంది. వాస్తవానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో టికెట్ల తేనె తుట్టెను మొట్టమొదట కదిపింది మాజీ మంత్రి ఆలపాటి రాజా అని చెప్పొచ్చు. తెనాలి నుండే పోటీ చేయాలని రాసి పెట్టిలేదని చంద్రబాబు ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడ నుండి బరిలో దిగుతానని అలపాటి ప్రకటించడం చర్చనీయాంశమైంది. జనసేనతో పొత్తు ఉంటుందనే భావనతో ఆ టికెట్ నాదెండ్ల మనోహర్‌కు ఇస్తారన్న ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ఆలపాటి కామెంట్స్‌ చేశారనే టాక్‌ నడుస్తోంది. అలాగని తెనాలిని వదులుకునేందుకు ఆలపాటి రాజా సిద్ధంగా లేరు. చంద్రబాబు మనసులో మాట తెలుసుకునేందుకు అలా మాట్లాడుతున్నారని జిల్లా పార్టీ వర్గాలు అంటున్నాయి.

రాజకీయ కురువృద్ధుడు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తాడికొండ సీటు తోకల రాజవర్ధనరావుకే అంటూ రాయపాటి మాట్లాడడం టీడీపీలో మంటలు రేపింది. అయితే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా తాడికొండ ఇన్‌చార్జ్‌గా ఉన్న తెనాలి శ్రావణకుమార్ రాయపాటి కామెంట్స్‌ను ఖండించారు. టికెట్లు ఇచ్చేది చంద్రబాబుగాని రాయపాటి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుండి బరిలోకి దిగేది తానేనని శ్రావణకుమార్ స్పష్టం చేశారు. అంతేకాదు కడప వాళ్లకి నర్సరావుపేట పార్లమెంట్ టికెట్ ఇస్తే ఓడిస్తామన్న రాయపాటి వ్యాఖ్యలు కూడా అంతే దూమారం రేపాయి. టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ కు నరసరావుపేట ఎంపీ టికెట్ ఖాయం చేశారన్న వార్తల నడుమ చంద్రబాబును రాయపాటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ప్రచారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతోంది. రాయపాటి తనయుడికి ఎంపీ కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అంత సీన్ లేదని చంద్రబాబే స్వయంగా చెప్పినప్పటికీ రాయపాటి మాత్రం పంతం వీడటం లేదు.

ఇక మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా టికెట్ టికెట్ అంటూ గొడవ చేస్తున్నారు. 2019లో ఓటమి తర్వాత కొద్దిరోజులు హైదరాబాద్ కే పరిమితమైన పుల్లారావు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్లీ జిల్లాలోకి ఎంట్రి ఇచ్చారు. తన నియోజకవర్గం చిలకలూరిపేట మాత్రమే కాకుండా పరిసర నియోజకవర్గాల్లో కూడా తిరుగుతున్నారు. మంత్రి విడదల రజనీని టీడీపీలో ప్రోత్సహించిన పుల్లారావు చివరకు ఆమె వైసీపీలో చేరి తనను ఓడించిందన్న ఆగ్రహంతో ఉన్నారు. ఈ సారి ఆమెను మట్టికరిపించాలన్న పట్టుదలతో ఉన్న పుల్లారావు చిలకలూరుపేట టికెట్ ను చంద్రబాబు ఆయనకే ఇస్తారని అనుచరుల చేత ప్రచారం చేయిస్తున్నారు.

సత్తెనపల్లిదీ విచిత్ర పరిస్థితి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చనిపోయిన తర్వాత అక్కడ సరైన కేండెట్ లేరని కేడర్ టెన్షన్ పడుతోంది. పోత్తు కుదిరి జనసేనకు సత్తెనపల్లి కేటాయిస్తే ఏం చేయాలన్న టెన్షన్ పార్టీ వర్గాల్లో పెరుగుతోంది. కోడెల శివరాం ఒక వైపు టీడీపీ టికెట్ కోసం నానా యాతన పడుతుంటే మరో వైపు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు నేనున్నానంటూ తెగ హడావుడి చేసేస్తున్నారు. నియోజకవర్గంలో సొంతంగా అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతీ మండలంలో తిరుగుతూ కార్యకర్తలకు, జనానికి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. అయితే స్థానిక కార్యకర్తల్లో వైవీ ఆంజనేయులు పట్ల సానుకూలత లేదని చెబుతున్నారు.

గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాత్రం ఎంతో సంయమనంగా ఉంటూ ఎలాంటి ప్రకటనలూ చేయడం లేదు. చంద్రబాబు ఇప్పటికే ఆయనకు టికెట్ ఖాయం చేశారని ప్రచారం జరుగుతోంది. జిల్లాలో వైసీపీ వ్యతిరేకోద్యమంలో కీలక భూమిక పోషిస్తున్నారు. పైగా తన నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఇతర చోట్లకు కూడా పార్టీ ఫండ్ ఇస్తానని యరపతినేని చెబుతున్నారట. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత శ్రీనివాసరావు జనానికి బాగా దగ్గర కావడంతో సహజంగా ఆయన పట్ల జనంలో అభిమానం పెరిగిపోయింది. టికెట్ల విషయంలో తొందరపడ వద్దని అందరికీ న్యాయం జరుగుతుందని ఇతర నియోజకవర్గాల నేతలకు కూడా యరపతినేని నూరి పోస్తున్నారట. ఏదేమైనా టికెట్ల కోసం నాయకులు బహిరంగంగా ప్రచారాలు చేసుకోవడం మాటల తూటాలు పేల్చుకోవడంతో సగటు టీడీపీ అభిమానుల్లో టెన్షన్ పట్టుకుంది.