బాబు పగబడితే అంతే

By KTV Telugu On 5 February, 2024
image

KTV TELUGU :-

నాగు పాము పగ పన్నెండేళ్లంటారు. రాజకీయాల్లో చంద్రబాబు పగ మాత్రం  అంతకు మించే అంటారు రాజకీయ పండితులు. చంద్రబాబు ను పట్టించుకోకపోయినా..చంద్రబాబు వ్యతిరేక శిబిరంలో యాక్టివ్ గా ఉన్నా  ఆ నేతలను ఎప్పటికీ వదిలిపెట్టకూడదనుకుంటారు చంద్రబాబు.  ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో  తనను కాదని ఎన్టీయార్ వైపు ఉండిపోయిన కొద్ది మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు  పగబట్టేశారు. వారిలో ఏ  ఒక్కరికీ ఆ తర్వాత  కీలక పదవి కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. తాజాగా మరో వందరోజుల్లోపు జరగనున్న ఎన్నికల్లోనూ గతంలో తనను విమర్శించిన..ఇబ్బంది పెట్టిన నేతలకే టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయిపోయారని అంటున్నారు.  దానికి పకడ్బందీ సాకు  చూపిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుత ఎన్నికల్లో చాలా మంది సీనియర్లకు టికెట్ల ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు.   కొందరు సీనియర్ల వారసులకు కూడా మొండి చెయ్యి చూపించాలని నిర్ణయానికి వచ్చేశారు. టిడిపి ఆవిర్బావం నుంచి పార్టీలోనే ఉన్న  గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి ఈ సారి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. గోరంట్లను వదిలించుకోడానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న రాజమండ్రి రూరల్ నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గోరంట్లకు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదో చెప్పాలి కాబట్టి ఓ కొత్త డ్రామాకి తెరతీస్తున్నారు చంద్రబాబు. గతంలో  పవన్ కళ్యాణ్ ను  తిట్టిపోసిన వారికి ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేమని..  జనసేనతో పొత్తు పెట్టుకున్నందున పవన్ కళ్యాణ్ చేసే కొన్ని డిమాండ్లకు  ఒప్పుకోక తప్పదని చంద్రబాబు  పార్టీ నేతల సమావేశంలో  చెబుతున్నారట.

2019 ఎన్నికలకు ముందు  గోరంట్ల బుచ్చయ్య చౌదరి జనసేనపైనా పవన్ కళ్యాణ్ పైనా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు విమర్శలు చేశారు. ఇపుడు ఆ కారణం చూపి బుచ్చయ్యకు టికెట్ ఇవ్వలేం అంటున్నారు. నిజానికి  ఎన్టీయార్ కు వెన్నుపోటు సమయంలో బుచ్చయ్య చౌదరి ఎన్టీయార్ వైపే ఉన్నారు. తనపై నమ్మకం లేకనే బుచ్చయ్య  తనకు మద్దతుగా రాలేదని బాబు కోపం పెంచుకున్నారు. ఎన్టీయార్ మరణానంతరం  బుచ్చయ్య చౌదరి చంద్రబాబు నాయకత్వంలోని టిడిపిలో చేరినా మంత్రి పదవి మాత్రం ఇవ్వకుండా దూరం పెట్టేశారు చంద్రబాబు. బుచ్చయ్యతో పాటు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావును కూడా ఎప్పుడూ లూప్ లైన్ లోనే ఉంచారు.

దెందులూరు నియోజక వర్గంలో కొత్త అభ్యర్ధిని ఎంపిక చేసుకున్న చంద్రబాబు నాయుడు   మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి కూడా చుక్కలు చూపిస్తున్నారు. గతంలో పవన్ ను తిట్టిన టిడిపి నేతల జాబితాలో చింతమనేని ఉండడంతో ఆ కారణంగా ఈ సారి టికెట్ ఇవ్వలేమని చెబుతున్నారట. పవన్ ను తిట్టిన మరో నేత అయ్యన్న పాత్రుడు తన కుమారునికి అనకాపల్లి అడిగారు. దీనికి కూడా చంద్రబాబు నో చెప్పారని అంటున్నారు. 2018లో తెలంగాణా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో తాను జట్టు కట్టినపుడు అయ్యన్న పాత్రుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అది చంద్రబాబు నాయుడికి కాలింది. కానీ అప్పుడు ఏమీ అనలేక ఊరుకున్నారు అదను కోసం ఎదురు చూసి ఈ ఎన్నికల్లో అయ్యన్నకు షాకివ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

అదే విధంగా 2019 ఎన్నికల తర్వాత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటించినపుడు కూడా గంటా ఇంట్లోనే ఉన్నారు తప్ప  బాబు కార్యక్రమాలకు వెళ్లలేదు.  ఇది అప్పట్లోనే చంద్రబాబుకు మంట పుట్టించింది. కాకపోతే అప్పట్లో పార్టీ  వరుస ఓటములతో  దివాళా తీసి ఉండడంతో చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. ఇపుడు ఎన్నికల వేళ  గంటా తన కుమారునికి చోడవరం సీటు అడిగితే లేదని చెప్పేశారట చంద్రబాబు. నారా లోకేష్ కొంతమంది ఎన్నారైలకు సీట్లు ఇస్తామని ఆశపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఎన్నారైల కోసం మరి కొందరు సీనియర్లకు కూడా ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవచ్చునంటున్నారు. గుడివాడ, మైలవరం నియోజక వర్గాల్లో ఎన్నారైలకు టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఏపీలో పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడికి కూడా టికెట్ ఇవ్వకపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు.  పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెంనాయుడు టిడిపి ఇమేజ్ ని దారుణంగా దెబ్బతీశారు. ఆ తర్వాత లోకేష్ నాయకత్వంలో పార్టీ పరిస్థితి దారుణమే అన్నారు. లోకేష్ పాదయాత్రకు జనం రావడం లేదన్న విషయాన్ని తన టెలికాన్ఫరెన్స్ ఆడియోను లీక్ చేసి అందరికీ తెలిసేలా చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినపుడు పార్టీ పిలుపునిచ్చినా ఎవరూ వీధుల్లోకి వచ్చి బాబుకు మద్దతు ఇవ్వడం లేదని కూడా అచ్చెన్నే  ఓ లేఖ లీక్ చేశారు. ఇవన్నీ కూడా పార్టీని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా చేశారని అచ్చెన్నపైనా బాబుకు పగ ఉందంటున్నారు. అందుకే పార్టీ అధ్యక్షుడు అయినా  టికెట్లు కోరే అభ్యర్ధులు నేరుగా బాబు, లోకేష్ లనే కలుస్తున్నారు

అచ్చెన్నను పక్కన పెట్టేశారని అంటున్నారు. రేపు టికెట్ అయినా ఇస్తారా లేదా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి