దటీజ్ మోడీ – కింగ్ మేకర్ల పప్పులేం ఉడకవ్ !

By KTV Telugu On 13 June, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ , చంద్రబాబునాయుడు పేర్లు గత వారం రోజులుగా దేశ రాజకీయాల్లో మార్మోగిపోతున్నాయి. మోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడటానికి ఆంధ్రప్రదేశే కారణమని అందరూ విశ్లేషిస్తున్నారు.  కింగ్ మేకర్ అన్నారు.  కేంద్ర మంత్రి పదవులకు ఢోకా ఉండదన్నారు .రెండు కేబినెట్ పదవులు, రెండు కేంద్ర మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు వస్తాయని అనుకున్నారు.  అయితే వచ్చిన హైప్‌కు కేటాయించిన పదవులు, శాఖలకు  పొంతన లేకుండా పోయింది. ఎందుకలా ?  టీడీపీ ఎందుకు డిమాండ్ చేయలేకపోయింది ?

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం  పార్టీకి వచ్చిన హైప్‌ను బట్టి చూస్తే.. అనుకున్న విధంగా పదవులు, కీలక శాఖలు రాలేదు . కింగ్ మేకర్ గా టీడీపీని జాతీయ రాజకీయ నేతలు అభివర్ణించారు. అయితే కేబినెట్ లో ఆ స్థాయిలో ప్రాధాన్యం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.  చివరికి ఒక్క కేబినెట్, ఒక్క సహాయ మంత్రి పదవితో సరిపెట్టారు. శాఖలు కూడా ఏపీకి అంతగా ఉపయోగపడేవి కావు.  రామ్ మోహన్ నాయుడికి పట్టణాభివృద్ధి శాఖను ఇచ్చినా ఏపీ కి రాజధాని నిర్మించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నారు. కానీ గతంలో అశోక్ గజపతిరాజుకు ఇచ్చిన పౌర విమానయానమే ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బోగాపురం ఎయిర్ పోర్టును వేగంగా పూర్తి చేసుకునే అవకాశం మాత్రం లభిస్తుంది.   గుంటూరు ఎంపీ పెమ్మసాని మెడికల్ రంగంలో నిపుణుడు. ఆయనకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి కేటాయిస్తారేమో అనుకున్నారు. కానీ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖను కేటాయించారు.

ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలోని జేడీఎస్ చీఫ్ కుమారస్వామికి భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. మొత్తంగా టీడీపీకి నిరాశే ఎదురయింది. కింగ్ మేకర్ అంటూ జాతీయ మీడియాలో జరిగిన ప్రచారంతో మోదీ మళ్లీ కోపం తెచ్చుకున్నారేమో కానీ.. హైప్ మాత్రమే టీడీపీకి మిగిలిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  ఇద్దరు, ఒక్క ఎంపీ ఉన్న పార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. కానీ జనసేన పార్టీకి మాత్రం చాన్స్ ఇవ్వలేదు. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. పవన్ కల్యాణ్ తుఫాన్ అని మోడీ పొగిడారు కానీ.. దానికి తగ్గట్లుగా ప్రాధాన్యత ఇవ్వలేదు.  కేంద్ర కేబినెట్‌లో జనసేనకు చోటు లేకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పవన్ కల్యాణ్‌తో బీజేపీ అగ్రనేతలు చర్చించారని అంటున్నారు. మిత్రపక్షాలకు కేబినెట్‌లో చోటు కల్పించడంపై కొన్ని మార్గదర్శకాలు పెట్టుకున్నారని ఆ ప్రకారమే జనసేన కు చోటు కల్పించలేకపోయారని భవిష్యత్ లో రాజకీయ పరిణామాలను బట్టి పరిశీిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.  ఐదుగురు ఎంపీలు అంత కంటే ఎక్కువ ఉన్నవారికి ఓ కేబినెట్ ర్యాంక్ పదవి, తక్కువ ఉన్న వారికి ఓ సహాయ మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు.

ఒకటి, రెండు ఎంపీలు ఉన్న పార్టీలకు ఆయా పార్టీల అధ్యక్షులకు అయితే ఇవ్వాలని అనుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీని చీల్చి ఆయన పార్టీని బీజేపీ సాయంతో లాగేసుకున్న అజిత్ పవార్ పార్టీకి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు. సహాయ మంత్రి పదవి ఇస్తామంటే వద్దన్నామని అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. కానీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయలేదని బీజేపీ వర్గాలంటున్నాయి.అదే సమయంలో  పవన్ కల్యాణ్ కూడా తమకు కేంద్రకేబినెట్‌లో చోటు ఉండాలని పట్టుబట్టలేదని తెలుస్తోంది. తమకు పదవులు ముఖ్యం కాదని ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారని అంటున్నారు. అప్పటికే ఏపీ నుంచి కేబినెట్ ర్యాంక్ తో పాటు ముగ్గురికి కేంద్ర మంత్రులుగా చాన్సిచ్చినందున… జనసేన పార్టీకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని అంటున్నారు. అయితే పదవులు ఇవ్వకపోవడానికి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు కానీ..  కూటమికి జనసేన చేసిన కాంట్రిబ్యూషన్ ప్రకారం కనీసం ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందన్న అభిప్రాయం ఉంది.

అయితే ప్రధానిమోదీ ఉద్దేశపూర్వకంగా కింగ్ మేకర్లుగా హైప్ తెచ్చుకున్న  పార్టీలకు ప్రాధాన్యం తగ్గించారని అంటున్నారు. ఇప్పుడు వారి డిమాండ్లకు తగ్గితే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు తీసుకు వస్తారని.. వారి డిమాండ్లు తీర్చలేక ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే వారిని నియంత్రించారని చెబుతున్నారు. ఏపీ ఆర్థిక పరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వారానికి రెండు వేల కోట్లు అప్పు చేస్తే తప్ప బండి నడిచే పరిస్థితి లేదు. అమరావతి, పోలవరం సహా అనేక ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించాల్సి ఉంది. వీటన్నింటికీ  కేంద్ర సహకారం అవసరం. అందుకే మోడీ,చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారని అనుకోవచ్చు.

జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా బీజేపీ కూటమి అంత బలహీనంగా ఏమీ లేదు. ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలో.. మోదీకి బాగా తెలుసు. అందుకే మిత్రపక్షాలు కూడా ఏ మాత్రం ధిక్కరించాలని అనుకోవడం  లేదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి