ఒక ప్రభుత్వం మారేందుకు సమయం ఐదేళ్లు. ఒక ప్రభుత్వం ఏదైనా చేశానని చెప్పుకునేందుకు వారికి దక్కే సమయం ఐదేళ్లు. మరి ప్రభుత్వంపై ఎవరైనా ఉద్యమించాలనుకుంటే వారి చేతిలో ఉన్న సమయం కూడా గరిష్టంగా ఐదేళ్లే. అందుకే ఐదేళ్లు ఎంతో కీలక
టైమ్ అవుతుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన పోరాటం కూడా ఐదేళ్లేనని చెప్పాలి. ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా సరే ఆయన పట్టు వదలని విక్రమార్కుడిగా పోరాటం సాగించారు….
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడతారన్న సామెత ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో అతికినట్లు సరిపోతుంది. ఎవరిమీదో కసితో ఎవరి మీదో కక్ష తీర్చుకున్నట్లుగా ఏబీ వెంకటేశ్వరరావుపై సీఎం జగన్ పగబట్టి వెంటాడారు. ఈ క్రమంలో జగన్ కు కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఆయన తీరు మారలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏబీ ఉద్యోగంలోకి రాకుండా అడ్డుకోవాలనే ఆయన కంకణం కట్టుకున్నారు. నిజానికి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ.. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ …క్యాట్… ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ.. తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అసలు పిటిషన్‌నే కొట్టివేయడం గమనార్హం. ఇది ఒకరకంగా సీఎం జగన్‌కు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో ఏబీవీకి లైన్ క్లియర్ అయింది.
న్యాయ పోరాటంతో ప్రభుత్వాలు మెడలు వంచే వారికి ఏబీవీ ఒక ఆదర్శం. పోరాడితే పోయేదేమీ లేదు..ప్రత్యర్థుల పరువు తప్ప… అని కూడా ఆయన నిరూపించారు. ఏబీవీ కేసులో జగన్ ప్రభుత్వ పరువు రెండు సార్లు పోయింది. ఐనా వారి తీరు మారలేదు. ఆఖరి రోజున ఏబీవీని వేధించాలనే వైసీపీ ప్రయత్నించింది..
2019లో జగన్ అధికారంలొకి వచ్చిన నాటి నుంచి ఏబీవీపై సస్పెన్షన్ విధించారు.ఏబీవీ కుమారుడు ఇజ్రాయెల్‌తో కలిసి స్పై పరికరాల వ్యాపారం చేస్తున్నారని తొలుత పేర్కొంటూ.. ఆయనను సస్పెండ్ చేశారు. దీనిలో ఏబీవీ భాగస్వామ్యం ఉందన్నారు. అయితే.. ఇది నిలవలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో విధుల్లోకి తీసుకున్నారు. తర్వాత రెండు రోజులకే.. ఆయనపై మరోసారి సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ.. అభియోగాలు నమోదు చేశారు. అయితే.. ఈ విషయంలో క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని క్యాట్ పేర్కొంది. సస్పెండ్ చేయడం సరికాదని తెలిపింది.
ఆయనను విధుల్లోకి తీసుకోవడంతోపాటు.. నిలిపివేసిన జీత భత్యాలు కూడా ఇవ్వాలని పేర్కొంది. కానీ, ఈ క్యాట్ ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ పూర్తిగా కేసును పట్టించుకోలేదని.. ఏబీవీ చేసింది నేరమేనని.. ఆయనపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని అభ్యర్థించింది. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ ను తాజాగా హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏబీవీ పట్టుదల కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఎక్కడా భయం లేకుండా, బెదరకుండా, ప్రభుత్వానికి ఎదురు తిరిగి పోరాడారు. న్యాయం తన పక్కన ఉందని ఆయన విశ్వసించి అందుకు తగ్గట్టుగా పోరాటాన్ని కొనసాగించారు. కోర్టు కూడా ఆయన నిజాయితీని నమ్మి మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది.
ఏబీవీ నిజాయితీని కోర్టు నమ్మిందనేందుకు వరుసగా రెండు తీర్పులు నిదర్శనంగా నిలుస్తాయి. ఆయన పోరాటానికి ఏ రాజకీయ పార్టీ మద్దతు అవసరం లేదని కూడా వరుస పరిణామాలు నిరూపించాయి. చంద్రబాబుపై కసికొద్ది ఏబీవీని వేధించినా… ఆయన ఒంటరిపోరాటం మాత్రం అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ క్రమంలో జగన్ ఓడారు. ఏబీవీ గెలిచారనే చెప్పాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…