వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దారి తప్పుతున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే నోరు అదుపు తప్పుతున్నారు. రాజకీయ నాయకులు మాట్లాడకూడని మాటలు ఆయన నోటి వెంట వస్తున్నాయి. సీఎం జగన్ పైనే విరుచుకుపడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బాలినేని కన్ ఫ్యూజన్ స్థితికి చేరుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి….
ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా సేవలందించిన బాలినేని ఒక ఏడాదిగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒక సారి మాట్లాడిన మాటలకు, వెంటనే ఇచ్చే వివరణలకు పొంతన లేకుండా పోతోంది. తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి సర్దిచెప్పినా మళ్లీ అదే తీరులో ముందుకు వెళ్తూ సొంత పార్టీ వైసీపీని ఇరకాటంలో పెడుతున్నారు. అలాగని ఆయన్ను దారికి తెచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే లేరని చెప్పాలి. బాలినేనికి ఎదురు చెప్పే ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదు. మంత్రిగా డబ్బులు తీసుకున్నానని, బెట్టింగులకు పాల్పడ్డానని చెప్పుకునే నాయకుడిని ఏమనాలో సామన్య ప్రజలకు అర్థంకానంతగా బాలినేని తీరు మారిపోయింది.
పొరుగు రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యానించేప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. బాలినేని మాత్రం లూజ్ టాక్ చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. పైగా పాలిటిక్స్ ఇరిటేషన్ తెప్పిస్తున్నాయని బాలినేని అనడం ఆయన రాజకీయాల్లో ఇంకా పరిణితి చెందలేదన్న అనుమానాలకు తావిస్తోంది. జగన్ పై ఆయనే చేస్తున్న కామెంట్స్ వైసీపీ వారికి రుచించకపోయినా జగన్ కుటుంబానికి దగ్గరివాడు కావడంతో సంయమనం పాటించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో చేరతారనుకున్న బాలినేని ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని బాలినేని యాభై లక్షల రూపాయలు పందెం కాశారట. రాజకీయ నాయకుడు పబ్లిక్ బెట్టింగ్ కరెక్టేనా అని బాలినేని స్వయంగా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ గెలుస్తుందని తనకు తెలుసన్న బాలినేని.. తన కుమారుడు మాత్రం బీఆర్ఎస్ రావాలని ఆశపడినట్లు తెలిపారు. తెలంగాణ అంతటా తిరిగి బీఆర్ఎస్ గెలుస్తుందని తనతో చెప్పినట్లు బాలినేని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే.. ఆంధ్రలో వైసీపీ గెలుస్తుందని తన ఆలోచన అంటూ చెప్పుకొచ్చారు . దీంతో కొడుకు బాధపడకూడదని, కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసినప్పటికీ కూడా పందెం వెనక్కి తీసుకున్నట్లు వివరించారు. దీనితో ఇప్పుడు బాలినేని సందేశం ఏమిటో అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో జగన్ మరోసారి అధికారంలోకి రావాలని తన కొడుకు తపన పడుతున్నట్లు.. బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌పై తనకు, తన కుమారుడికి చాలా అభిమానం ఉందన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. అయితే ఆదే అభిమానం ఆయనకూ తమపై ఉండాలి కదా అంటూ వ్యాఖ్యానించారు. ఇందులోనూ అయోమయ వైఖరితో పాటు జగన్ ను ఇబ్బంది పెట్టే సందేశం ఉంది. బాలినేనికి అప్పుడప్పుడు తన తప్పు తెలిసి వస్తుంటుంది. ఈ సారి కూడా అదే జరిగింది. కాస్త వివరణ కూడా ఇచ్చారు. మినిస్టర్‌గా డబ్బు తీసుకున్నానన్న కామెంట్స్‌పై వివరణ ఇస్తూ, అదంతా పార్టీ ఫండ్ అని సమర్థించుకోవడంతో వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే పార్టీ ఫండ్ తీసుకుంటే లెక్కలు చూపించాలని బాలినేనికి తెలియని కాదు. తన దగ్గర పది రూపాయలు వుంటే, మరో ఇరవై అప్పు చేసి ప్రజలకు పంచి పెడుతున్నట్టు ఆయన చెప్పారు. అది ఓర్చుకోలేక వందల కోట్లు సంపాదించానని ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. ఒంగోలులో తనకు 15 కోట్లు అప్పు వున్నట్టు ఆయన తెలిపారు. అది కూడా తెలుగుదేశం సంబంధీకుల వద్ద అప్పు తీసుకున్నట్టు ఆయన చెప్పారు.గత ఎన్నికల్లో ఖర్చంతా వియ్యంకుడు పెట్టాడన్నారు. ఇప్పుడు కూడా అతనే పెడతారన్నారు. ఈ పరిస్థితుల్లో తాను వుంటే అంత సంపాదించాడు, ఇంత సంపాదించాడని మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఇందులో చాలా వరకు బయట చెప్పకూడని మాటలే అవుతాయి…
బాలినేని అమాయకత్వంతో మాట్లాడుతున్నారా.. లేక అయోమయంలో మాట్లాడుతున్నారా అన్నది కూడా గట్టిగా ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎందుకు తర్వాత వివరణ ఇచ్చుకోవడం ఎందుకని పార్టీలో కొందరు లోలోన మధనపడుతున్నారు. పైగా ప్రత్యర్థి టీడీపీతో ఉన్న ఆర్థిక సంబంధాలను బహిరంగంగా బయట పెట్టడమేమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు బాలినేని వల్ల వైసీపీకి లాభం ఏంటి? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాకపోతే బాలినేనికి ఇవన్నీ అర్థం కావు. ఆయన అయోమయం జగన్నాథం కదా…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…