రాజకీయంలో ప్రత్యర్థిని ఓడించాలంటే ప్రజలను మెప్పించాలి. ప్రత్యర్థి కన్నా తను గొప్ప అని ప్రజలకు నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకుని గెలవాలి అది గెలుపు. అంతే కానీ ప్రత్యర్థిని బండబూతులు తిట్టేసి వీలైతే కొట్టేస్తానని బెదిరించి చచ్చిపో అని శాపనార్ధాలు పెట్టి అతన్ని మానసికంగా వేధిస్తున్నా అని సంబర పడిపోవడం రాజకీయం కాదు. కానీ ఇప్పుడు జరుగుతోంది అదే. మహిళా నేత షర్మిల భాష చూస్తూంటే ఇక రాజకీయాలు అంటే తిట్టడమే అని మహిళా నేతలు కూడా ఫిక్సయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
దురదృష్టవశాత్తూ ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల పాత్రను చాలా తక్కువగా రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని ఓట్లేయరని భావిస్తున్నారు. అందుకే గీత దాటిపోతున్నారు. గతంలో రాజకీయ విమర్శలు ఓ మాదిరి హద్దు దాటినా ప్రజల్లో విస్తృత చర్చ జరిగేది. కానీ ఇప్పుడు అందరు నేతలు అదే బాట పట్టారు. చివరికి ప్రజలు కూడా అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థి అంటే వ్యక్తిగత శత్రువే. దానికి తగ్గట్లుగానే రాజకీయ విమర్శలు చేయాలి చేస్తున్నారు. ఫలితంగా వారి మధ్య శుత్రత్వ స్థాయి దారుణమైన తిట్లు తిట్టుకునే వరకూ వెళ్తుంది. ఎంత వరకూ అంటే ఎదురుపడికే కొట్టడం ఖాయం అన్న హెచ్చరికలు కూడా అందులో ఉన్నాయంటే పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్లిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు.
ఇంత కన్నా దిగజారడానికి ఏమీ లేదు అనుకున్న ప్రతీ సారి ఇంకా ఇంకా దిగజారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓ సినిమాలో డైలాగ్. ప్రస్తుత రాజకీయ భాషకు అన్వయించుకుంటే ప్రతి ఒక్కరికి ఇదే భావన కలుగుతుంది. ఫలనా వాళ్లు అంత దారుణంగా తిట్టారు. ఇక అంత కంటే ఘోరంగా ఎవరూ తిట్టలేరు అనుకుంటే అంచనాలను మించి ఎదుటి వాళ్లు తిట్లు వినిపిస్తున్నారు. సాధారణంగా ప్రతి రాజకీయ నేత ఎంత రాజకీయప్రత్యర్థి అయినా సంబోధించేటప్పుడు గారు అనే సంభోధిస్తారు. ఇప్పుడు అది గాడు అయిపోయింది. మంత్రి హోదాలో గౌరవంగా మాట్లాడాల్సిన పేర్ని నాని గాడు వాడు కాపు నా.. కో.. అంటూ మీడియా ముందు చెలరేగిపోయారు. అవన్నీ ప్రత్యక్ష ప్రసారాలు. ఆ మత్రి మాటలు విని ఆయన పార్టీ అభిమానులు లైక్ మైండెడ్ పీపుల్ అహో ఒహో అనుకున్నారేమో కానీ సభ్యత సంస్కారం ఉన్న వారెవరూ హర్షించరు. ఇప్పుడు రాజకీయ విమర్శలు అనడం కన్నా రాజకీయ బూతులు అని చెప్పడం కరెక్ట్. విమర్శల కంటే ఎంతో దిగువన ఉంటున్నాయి అవి. దిగజారిపోయి తిట్ల స్థాయికి వచ్చాయి.
అసెంబ్లీ అంటే పవిత్రమైనది. అక్కడ మాట్లాడాలంటే ఎంతో రీసెర్చ్ చేసి వస్తారు. కానీ ఇప్పుడు అక్కడా పరిస్థితి మారిపోయింది. తన ఇష్టం లేని రాజకీయ నేతల్ని బండబూతులు తిట్టించేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అలా తిడితే ఏమొస్తుందో కానీ గతంలో కాస్త డిగ్నిటీ ప్రదర్శించేవారు కూడా ఆ పార్టీలో చేరిన తర్వాత దారుణమైన భాషను మాట్లాడుతూంటారు. అయితే అక్కడ హైకమాండ్‌ను మెప్పించాలంటే అలాగే మాట్లాడాలని నేతలు భావిస్తూంటారు. అలా మాట్లాడిన వారికే ప్రోత్సాహం ఉంటుందని కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. దాంతో మరింత రెచ్చిపోతున్నారు. ఒకరు తిడితే మొరకరు తిడతారువారు తిట్టడం నుంచి అడ్వాన్స్ అయి కొట్టడం ప్రారంభిస్తే వ్యవస్థ మరింత దిగజారిపోతుంది. ప్రజాస్వామ్యం అధికారం ఉన్న వాడి చేతిలో బందీ అయిపోతే ఎవరికీ రక్షణ ఉండదు. ఇప్పుడు అలాంటి దుర్భర పరిస్థితే కనిపిస్తోంది.